- రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యం రూ.435 కోట్లు
- గత ఏడాది కన్నా 62 శాతం ఎక్కువ
- కష్టమేనంటున్న సిబ్బంది
విశాఖపట్నం, న్యూస్‌లైన్: జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన ్లశాఖకు ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో రూ.435.10 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దే శించింది. గత ఆర్థిక సంవత్సరంలో సమైక్యాంధ్ర సమ్మె తదితర కారణాల వల్ల రూ.389 కోట్ల లక్ష్యానికి 59 శాతం ప్రగతితో రూ.231 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కన్నా 62 శాతం అధికంగా లక్ష్యాన్ని నిర్దేశించడంతో లక్ష్య సాధన కష్ట సాధ్యమని సిబ్బంది అంటున్నారు.
విశాఖపట్నం రాష్ట్ర రాజధాని అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఇంత ఆదాయం రావడం అనుమానమేనని చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారుల వెనుకంజ కారణంగా రిజిస్ట్రేషన్లు పడకేశాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 71 రోజులపాటు సిబ్బంది సమ్మె చేయడంతో ఆదా యం గణనీయంగా పడిపోయింది.
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో విశాఖ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అత్యధికంగా రూ.120.91 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రోజుకు 120 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అవుతుండగా, సుమారుగా రూ.కోటి వరకు ఆదాయం వస్తోంది. పెరిగిన లక్ష్యం ప్రకారం రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయం వస్తేనే లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలుంటాయి.
లక్ష్యాన్ని చేరుకుంటాం
ఇప్పటికే అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు లక్ష్యాలు పంపించాం. గత ఏడాది పెట్టుబడిదారుల వెనుకంజ కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం కొంతవరకే ఉంది. సాధారణంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు విశాఖలో భూములపై పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉంటారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు పుంజుకుంటాయనే భావిస్తున్నాం. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకుంటాం.
-ఆర్.దామోదరరావు, జిల్లా రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ల శాఖ, విశాఖపట్నం