‘ఆరోగ్యశ్రీ’లో మళ్లీ కోత | Again removal of arogya sri cards in ap | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 3 2017 4:30 AM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM

Again removal of arogya sri cards in ap - Sakshi

సాక్షి, అమరావతి: తెల్ల రేషన్‌ కార్డు కలిగిన పేదలకు ఉచితంగా వైద్య సదుపాయం అందించే ఆరోగ్యశ్రీ పథకానికి రోజు రోజుకూ గడ్డుకాలం ఎదురవుతోంది. ఇప్పటికే సుమారు 10 లక్షల పైన కార్డులను ఆన్‌లైన్‌ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం తాజాగా మరో లక్షన్నర కార్డులకు కోత వేసినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ (ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌) అధికార వర్గాలు తెలిపాయి. దీంతో పేద బాధితులు లబోదిబోమంటున్నారు. వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లిన రోగుల కార్డులను ఆరోగ్య మిత్రలు ఆన్‌లైన్‌లో పరిశీలించి.. మీ కార్డులు జాబితాలో లేవని చెబుతున్నారు. దీంతో ఇక చేసేదేమి లేక బాధితులు డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లక తప్పని దుస్థితి. రకరకాల జబ్బులతో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న వీరి గోడు సర్కారు చెవి కెక్కడం లేదు. 

3 నెలలు రేషన్‌ తీసుకోలేదని...
ఆరోగ్యశ్రీని భారమైన పథకంగా భావిస్తున్న సర్కారు ఏదోవిధంగా కోత పెట్టి తగ్గించుకోవాలని చూస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. ఇందులో భాగంగానే రేషన్‌కూ ఆరోగ్యశ్రీకి లింకు పెట్టారు. మూడు మాసాలు వరుసగా రేషన్‌షాపులో రేషన్‌ తీసుకోకపోతే అలాంటి వారిని ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ విషయం ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఏమాత్రం తెలియకుండానే జరుగుతోంది. ఆరోగ్యశ్రీ కార్డు నంబర్‌ను ఆన్‌లైన్‌లో తొలగిస్తే చాలు ఏ ఆస్పత్రికి వెళ్లినా ఆ కార్డు పని చేయదు. ఆ విషయం తెలియని పలువురు వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆస్పత్రులకు రావడం, కార్డు పని చేయదని తెలుసుకుని వెనుదిరగడం పరిపాటిగా మారింది. గడిచిన ఏడు మాసాల్లో కోత విధించిన కార్డుల సంఖ్య పదకొండున్నర లక్షలకు చేరినట్టు తేలింది. ప్రతి 3 మాసాలకు పౌర సరఫరాల శాఖ రేషన్‌ తీసుకోని కుటుంబాల వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఇవ్వడం, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఆ కుటుంబాలను జాబితా నుంచి తొలగించడం జరుగుతోంది.

ఆది నుంచి చిన్నచూపే
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథనాన్ని ఎలాగైనా వదిలించుకోవడానికే మొగ్గు చూపుతోంది. ఏదో ఒక సాకుతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఒక్కోసారి ఒక అంశానికి లింకు పెడుతూ లక్షలాది కుటుంబాలను తప్పించడం దారుణం అని వైద్య వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఆధార్‌ లేదనో, పింఛన్‌ తీసుకోలేదనో లింకులు పెడుతూ మరిన్ని కుటుంబాలను ఈ పథకానికి దూరం చేయడం ఖాయమని ఓ అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఎలాగైనా సరే ఈ పథకాన్ని ఎత్తివేయడమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయన్నారు. 

ఆరోగ్యశ్రీలో ఇక్కట్లు ఇవీ..
-  మూడు మాసాలు రేషన్‌ సరుకులు తీసుకోకపోతే ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగింపు
- రాష్ట్రంలో పలు జబ్బులకు వైద్యం అందకపోయినా హైదరాబాద్‌లో వైద్యం పొందేందుకు నిరాకరణ
- కొత్తగా ఇచ్చిన లక్షలాది తెల్లరేషన్‌ కార్డులకు ఇప్పటికీ మంజూరు కాని ఆరోగ్యశ్రీ కార్డులు  
- 133 జబ్బులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం.. ఇప్పటికీ సరిగా అందని వైనం 
- రోగులు ఆస్పత్రులకు వచ్చి వెళ్లడానికి ఇస్తున్న రవాణా చార్జీల నిలిపివేత
-  జబ్బు నిర్ధరణ పరీక్షలు చేయించుకుని వస్తేగానీ ఆరోగ్యశ్రీలో చేర్చుకోవడం లేదు
- జబ్బు నిర్ధారణకే వేలాది రూపాయలు ఖర్చు చేయలేక పేదలు సతమతం
- సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో జాప్యం 
- ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత మంది వైద్యులు లేక సత్వరం అందని సేవలు

వలస కుటుంబాలకు తీరని నష్టం
ఆరోగ్యశ్రీ కార్డుల కోతతో 90 శాతం మంది వలస జీవులకే నష్టం జరుగుతోంది. బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వెళుతున్న వలస కూలీలు నాలుగైదు మాసాలు సొంత ఊరికి వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రేషన్‌ సరుకులు తీసుకోలేరు. ఈ కారణంగా ఆరోగ్యశ్రీ కార్డులు కోల్పోతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన కుమారి అనే మహిళ కుటుంబం ఆరు మాసాలుగా విజయవాడలో ఉంటోంది. భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండగా, కుమారి అపార్టుమెంట్‌లో పని మనిషిగా ఉంటోంది. ఒక రోజు తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్న తన భర్తను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిం ది. ఆరోగ్యశ్రీ కార్డును పరిశీలించి జాబితా నుంచి తొలగించారని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో భర్తను ప్రైవేట్‌ అస్పత్రిలో చేర్పించి.. డబ్బులు అప్పు తెచ్చుకుని వైద్యం చేయించింది.

ఇలాంటి కుటుంబాలు లక్షల్లో ఉండటం కలచి వేస్తున్న అంశం. హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు వైద్యం అందడంలేదు. ప్రభుత్వం ఆ అవకాశాన్ని లేకుండా చేసింది. పరిమితంగా కొన్ని వర్గాలను మాత్రమే అనుమతించింది. సర్కారు తీరు చూస్తుంటే.. స్థానికంగా బతికేందుకు పనులున్నా లేకపోయినా అర్ధాకలితో అలమటించాలన్నట్లు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని నగరాలకు వలస వెళ్తే అరోగ్య శ్రీ కార్డును తొలగిస్తారనే భయంతో ఇకపై చాలా మంది పేదలు ఉన్న ఊళ్లోనే బతుకీడ్చాల్సిన దుస్థితి దాపురించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement