ఆరోగ్యసిరికి ఉరి | State government which is carrying out the Aarogyasri Scheme | Sakshi
Sakshi News home page

ఆరోగ్యసిరికి ఉరి

Published Sun, Jun 25 2017 2:02 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

ఆరోగ్యసిరికి ఉరి

ఆరోగ్యసిరికి ఉరి

రకరకాల కొర్రీలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
 
సాక్షి, అమరావతి: ఆర్థికంగా భారమైందనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోజూస్తోంది. వివిధ కారణాలు చూపి వ్యూహాత్మకంగా లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. ఇప్పటికే రకరకాల కొర్రీలు వేస్తూ ఈ పథకాన్ని నిర్వీర్యం చేసింది చాలదన్నట్లు.. వలస వెళ్లిన పేదలు రేషన్‌ తీసుకోవడం లేదనే కారణం చూపి తాజాగా జాబితా నుంచి వారి పేర్లను తొలగించింది. నాలుగేళ్లుగా బడ్జెట్‌లో కోత విధిస్తూ, ముఖ్య జబ్బులను నిర్లక్ష్యం చేస్తూ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు బకాయిలు విడుదల చేయకుండా నాన్చుతూ వచ్చిన సర్కారు.. ఇపుడు క్రమం తప్పకుండా రేషన్‌ తీసుకున్న వారికే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబుతోంది.

ఈ వ్యవహారం ఇపుడు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా బడుగు వర్గాలు నివ్వెర పోతున్నాయి. ఉన్న ఊర్లో బతుకుదెరువు లేక పట్టణాల్లో ఏదో ఒక పని చేసుకుంటూ రేషన్‌ తీసుకోవడానికి వెళ్లలేక పోయామని, ఇప్పుడు జబ్బు చేసి ఆస్పత్రులకు వస్తే మీ కార్డు చెల్లదని అంటున్నారని లక్షలాది మంది పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆదాయం లేని చికిత్సలను దూరం పెట్టి, నిర్దాక్షిణ్యంగా రోగులను వెనక్కు పంపుతుండగా, ఇప్పుడీ తాజా పరిణామం సామాన్యులకు షాకిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1,044 జబ్బులకు సేవలందుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో 133 జబ్బులకు మాత్రమే ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స చేస్తున్నారు.

మిగతా జబ్బులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలి. కాగా, రెండు మూడేళ్లుగా ప్యాకేజీలు పెంచడం లేదన్న కారణంగా గుండె, న్యూరో జబ్బులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నప్పటికీ వైద్యానికి జాప్యం చేస్తున్నారు. ఇక ప్రమాద బాధితులు ఆస్పత్రులకు వస్తే వారి బాధలు వర్ణణాతీతం. మామూలుగా ఒక చోట ఎముక విరిగిన వారికి శస్త్ర చికిత్స చేస్తే రూ.25 వేలు ఇస్తారని, అలాంటిది ఐదారు చోట్ల ఎముకలు విరిగినప్పుడు ఆపరేషన్‌ చేయాల్సి వచ్చినా ఆరోగ్య శ్రీ కింద రూ.25 వేలే ఇస్తున్నారని.. ఇది మాకు గిట్టుబాటు కాదని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో ఆరోగ్య శ్రీ కార్డులున్న వారే పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, ఇక ఈ కార్డులు లేని పేదల పాట్లు ఊహించుకోలేమని వైద్య వర్గాలు వాపోతున్నాయి. 
 
 ఆరోగ్యశ్రీ నిర్వీర్యం ఇలా..  
► మొత్తం 938 జబ్బుల్లో 133 జబ్బులను కేవలం ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయాలని 2010 నవంబర్‌లో ప్రైవేటు పరిధి నుంచి తప్పించారు. అయితే ఈ జబ్బులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వసతులు లేవు. ఆపరేషన్‌కు అవసరమయ్యే లాప్రొస్కోపిక్‌ పరికరాలు కూడా లేవు. స్పెషలిస్టు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో రోగులు ఆస్తులమ్ముకుని కార్పొరేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
► ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ పరిధిలో ఉన్న 131 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 125 ఆస్పత్రులు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. 
► కార్పొరేట్‌ లేదా ప్రైవేటు ఆస్పత్రులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో చికిత్సలో తీవ్ర జాప్యం అవుతోంది. నరాలు, గుండె, క్యాన్సర్, పాలీ ట్రామా (ప్రమాద బాధితులకు) వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నారు.
► ప్రస్తుతం పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు లేవు, రేడియంట్‌ వార్మర్స్‌ (శిశువులకు కామెర్లు రాకుండా ఉంచే బాక్సులు), ఐసీయూలు లేవు, సీటీ స్కానర్లు లేవు, ఎక్స్‌రే యంత్రాలు లేవు. వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టు వైద్యాధికారులే తేల్చారు. 
► ఏసీటీ మెషీన్స్, హెడ్‌లైట్స్, మైక్రోడిబ్రైడర్స్, అల్ట్రాసౌండ్‌ మెషీన్స్, న్యూరో ఎండోస్కోప్స్, హైస్పీడ్‌ స్టెరిలైజర్స్, ఈసీజీ మిషన్లు, నెబులైజర్స్, ఆక్జినేటర్స్, ఆక్సిజన్‌ సిలిండర్స్‌ తదితర కనీస పరికరాలు కూడా లేని ఆస్పత్రుల్లు 108 ఉన్నాయని వైద్య అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కిడ్నీ రోగులు ఎక్కువవుతూండటం, డయాలసిస్‌ మెషీన్లు తక్కువగా ఉండటంతో రోగులు అల్లాడుతున్నారు.
► ప్రీమియం సొమ్ము రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచడం, వంద జబ్బులు అదనంగా చేర్చడం, దీనికి తగ్గట్టు డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వందల కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి.
 
40 లక్షల మంది వలస కూలీలకు ఇక వైద్యం హుళక్కే
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఊళ్లొదిలి వివిధ పట్టణాలు, నగరాలకు వెళ్లి చిన్న చిన్న కూలీ పనులు చేసుకుని పొట్టపోసుకుంటున్న కుటుంబాలు 10 లక్షల వరకు ఉన్నాయనేది అంచనా. ఈ లెక్కన సుమారు 40 లక్షల మంది బాధితులైనట్లే. ఇది స్వయానా పౌరసరఫరాల శాఖ వేసిన అంచనా. వీళ్లు వలస వాసులుగా ఉండటంతో చౌక దుకాణాల్లో ఇచ్చే రేషన్‌ సరుకులు తీసుకోలేక పోతున్నారు. ఇలా సరుకులు తీసుకోని వారి జాబితాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో రేషన్‌ సరుకులు కట్‌ చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిలో నుంచి కూడా తీసేశారు. ఈ నేపథ్యంలో జబ్బు చేసి, ఆసుపత్రికి వెళితే ఆరోగ్యశ్రీ కార్డు పని చేయడం లేదని, ఆన్‌లైన్‌లో పేరు లేదని చెబుతున్నారు.

తహసీల్దార్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ తీసుకురావాలని అంటున్నారు. తహసీల్దార్‌ దగ్గరకు వెళితే... ఆరోగ్యశ్రీ కార్డు ఉండగా సర్టిఫికెట్‌ ఇవ్వలేమని అంటున్నారు. ఇదీ గత కొద్ది రోజులుగా ఆరోగ్యశ్రీ రోగుల బాధ. ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల మాట అటుంచితే ప్రభుత్వ పరిధిలో ఉన్న పెద్దాసుపత్రుల్లోనూ ఈ కార్డులు పనిచేయడం లేదని తిరస్కరిస్తున్నారు. దీంతో రోగులు వైద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉండగా మరో 16 లక్షల కుటుంబాలు వివిధ కారణాల వల్ల రేషన్‌ తీసుకోవడం లేదు. దీంతో ఈ కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తప్పించారు. 
 
నా కార్డు చెల్లదంటున్నారు..
మాది తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి. నా భర్త పేరు యేసుబాబు. మేము కొన్ని నెలల క్రితం బతుకుదెరువు కోసం విజయవాడకు వచ్చాం. ఇక్కడ ఓ అపార్ట్‌మెంటులో నా భర్త సెక్యూరిటీ గార్డుగా ఉన్నారు. నేను కూడా బట్టలు ఇస్త్రీ చేస్తుంటాను. రెండ్రోజుల క్రితం నా భర్తకు తీవ్ర కడుపు నొప్పి వచ్చింది. విజయవాడ పెద్దాసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ విభాగం వద్దకు వెళ్లమన్నారు. అక్కడకు వెళ్లగానే మీ కార్డు ఆన్‌లైన్‌లో లేదని, రేషన్‌ తీసుకోనందున తొలగించి ఉంటారని చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు.
– కుమారి, కిర్లంపూడి
 
పౌర సరఫరాల శాఖ డేటానే ఫాలో అవుతాం
ప్రతి నెలా ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టుకు పౌర సరఫరాల శాఖ నుంచి తెల్లరేషన్‌ కార్డుదారుల వివరాలు, రేషన్‌ తీసుకుంటున్న వారి వివరాలతో కూడిన జాబితా వస్తుంది. ప్రతి నెలా మొదటి వారంలో మాకు ఆన్‌లైన్‌లో ఈ జాబితాను పంపిస్తారు. ఆ జాబితాలో ఉన్న వివరాలనే మేము పాటిస్తాం. కార్డుదారుల వివరాలను తీసెయ్యడం, చేర్చడం మా చేతుల్లో ఉండదు. పౌర సరఫరాల శాఖ ఇచ్చిన నివేదికనే పాటించాలని నిబంధనలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డులు తొలగించడం ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ పరిధిలో ఉండదు. మా జాబితాలో పేర్లున్న వాళ్లందరికీ వైద్యం అందించే బాధ్యత మాది.
– రవిశంకర్‌ అయ్యన్నార్, సీఈఓ, ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌
 
తొలగించడం బాధాకరం
చాలా మంది పేదలకు ఆరోగ్యశ్రీ పెద్ద దిక్కుగా ఉంది. ఇప్పటికే చాలా మంది కార్డులు లేని పేదలు ముఖ్యమంత్రి, వైద్య మంత్రి పేషీ వద్దకు వచ్చి పడుతున్న అవస్థలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రేషన్‌ తీసుకోని వలస జీవులకు సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు తొలగించడం బాధాకరం. ఒక డాక్టరుగా ఇది నన్ను తీవ్రంగా బాధిస్తోంది. మరింతగా నిధులిచ్చి పథకాన్ని మెరుగు పరచాల్సిందిపోయి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం దురదృష్టకరం.
–డా.డి.జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం
 
నెలకొక్కటే  : బదిరులపై కోలుకోలేని దెబ్బ
పుట్టుకతోనే చెవుడు, మూగతో బాధ పడుతున్న చిన్నారులకు చేయాల్సిన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సలపై సర్కారు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఒక్కో శస్త్రచికిత్సకు రూ.6.50 లక్షలు చెల్లించాల్సి వస్తోందని ఇది తలకు మించిన భారమని భావించిన సర్కారు... నెలకు ఒక్క కేసు మాత్రమే కొత్తది మంజూరు చేయాలని ఆదేశించింది. రివ్యూ కేసు అంటే పాత కేసు ఒకటి అంటే నెలకు రెండు కేసులు మాత్రమే తీసుకోవాలని తాజాగా అపోలో, బయ్యా శ్రీనివాసరావు ఆస్పత్రి వంటి వాటికి అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 12 ఏళ్ల గరిష్ట వయసు వరకూ శస్త్రచికిత్సలు చేయించే అవకాశముండేది. దీన్ని రెండేళ్లకు కుదించారు. తాజాగా ఐదేళ్ల వరకు పొడిగించారు.  కాగా సర్కారు జాప్యంతో వయసు దాటిపోతూండటం కారణంగా వారు అర్హత కోల్పోతున్నారు. మూన్నెళ్లుగా వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో బదిరుల శస్త్రచికిత్సలకు అనుమతులివ్వటానికి కమిటీ లేదని శస్త్రచికిత్సలకు ఏకంగా మూన్నెళ్లు సెలవులు ఇచ్చారు. దీంతో చెవిటి, మూగ చిన్నారులు నెలల తరబడి ఆస్పత్రుల్లోనే పడిగాపులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement