సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) బకాయిలపై నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. చంద్రబాబు సర్కార్.. రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టగా, ఎల్లుండి (జనవరి 6) నుంచి ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌కు ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ASHA) అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ, జనవరి 6వ తేదీ నుంచి క్యాష్ లెస్‌గా వైద్య సేవలు అందించలేమని తెలిపారు.
తాము నోటీసులిచ్చిన కూడా ప్రభుత్వం నుంచి నామమాత్రపు స్పందన మాత్రమే వచ్చిందన్నారు. బకాయిల భారాన్ని మోయలేకపోతున్నాం... ఆసుపత్రులను నడపలేకపోతున్నాం.. వీలైనంత త్వరగా 50 శాతం బకాయిలు చెల్లించాలన్నారు. ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేయడంలో మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇన్స్యూరెన్స్‌కు ఇప్పగించే ముందు మా బకాయిలన్నీ తీర్చాలని విజయ్‌కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: ‘చంద్రబాబుగారూ.. ఇంత ద్రోహమా? ఇంతటి బరితెగింపా?’
మరోవైపు, ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. రూ.2.50 లక్షల వరకు వైద్య సేవలను బీమా పరిధిలోకి తెస్తామని చెప్పారు. ఇందుకోసం ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2,500 చొప్పున ప్రీమియం చెల్లిస్తామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలోని 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య బీమా వర్తిస్తుందని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు బీమా వర్తింపజేస్తే ప్రైవేటు ఆస్పత్రులు మనుగడ సాగించడం కష్టమంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment