7 నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్‌ | Network hospitals to discontinue cashless services under Arogyasri Seva from April 7 in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

7 నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్‌

Published Tue, Mar 25 2025 5:12 AM | Last Updated on Tue, Mar 25 2025 5:12 AM

Network hospitals to discontinue cashless services under Arogyasri Seva from April 7 in Andhra Pradesh

రాష్ట్ర ప్రభుత్వానికి ‘ఆషా’ అల్టీమేటం 

రూ.3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించని సర్కారు 

10 నెలల్లో 26 సార్లు లేఖలు రాసినా స్పందించని ప్రభుత్వం 

దీంతో సమ్మెకు సిద్ధమైన ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు):  రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో ఏప్రిల్‌ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆషా) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందచేసినట్లు అసోసియేషన్‌ తెలిపింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 26 సార్లు ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు సీఈఓను, వైద్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని, ఐటీ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించినట్లు తెలిపారు.

అయినప్పటికీ తమ సమస్యలపట్ల సానుకూల స్పందన కొరవడటంతో, ఆస్పత్రులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయి నిర్వహించలేని దయనీయ స్థితిలో ఉన్నందున.. వచ్చేనెల 7 నుంచి పూర్తిగా సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆషా అధ్యక్షుడు డాక్టర్‌ కె. విజయ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రూ.1,500 కోట్లు రిలీజ్‌ చేయడంతో పాటు, అనంతరం చెల్లింపులపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తేగానీ ఆరోగ్యశ్రీని నిర్వహించలేని స్థితిలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఏకంగా రూ.3,500 కోట్ల మేర ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ చెబుతోంది.

వివిధ రూపాల్లో నిరసనలు
ఏప్రిల్‌ 7 వరకూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విజయ్‌కుమార్‌ వివరించారు. అందులో భాగంగా.. మార్చి 25న జిల్లా కలెక్టర్‌లు, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్, డీఎంహెచ్‌ఓలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. అంతేకాక.. తమ ఇబ్బందులను మీడియాకు వివరించనున్నట్లు తెలిపారు. మార్చి 27న ఎంఎల్‌ఏలు, ఎంపీలు, జిల్లా ఇన్‌ఛార్జిలను కలిసి వినతిపత్రాలు అందించనున్నట్లు తెలిపారు. 29న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాలు.. ఏప్రిల్‌ 3న కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ హెడ్స్, ఆషా ప్రతినిధులు విజయవాడ, విశాఖపట్నంలలో ప్రెస్‌మీట్‌ల నిర్వహణకు కార్యాచరణను రూపొందించినట్లు ఆషా ప్రతినిధులు తెలిపారు.

నగదు రహిత వైద్యం అందించలేం
నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 నెలల్లో 26 సార్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ బకాయిలపై ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినప్పటికీ సర్కారు నుంచి సరైన స్పందనలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ ఆమోదించిన బిల్లులు రూ.1,300 కోట్లు, సీఈఓ ఆమోదించనివి రూ.1,700 కోట్లు ఉన్నాయి. ఇక ఆస్పత్రులు అప్‌లోడ్‌ చేయాల్సిన బిల్స్‌ మరో రూ.500 కోట్ల మేర ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పెద్దఎత్తున బిల్లులు నిలిచిపోవడంతో గతేడాది నుంచే చాలావరకూ ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవల కల్పనకు వెనుకడుగు వేస్తున్నాయి. పేదలు చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదు. నగదు రహిత వైద్యసేవలు అందించలేం’ అని యాజమాన్యాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement