
విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ‘దువా’ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్
ఈద్ ముబారక్ అంటూ ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు
విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణమండపంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్లొన్నారు. ‘‘ఈద్ ముబారక్’’ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు.
విజయవాడలో బుధవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
టోపీ, కండువా ధరించి నమాజ్
ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ మంత్రులు అంజాద్ బాషా, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, పార్టీ నేతలు పూనూరు గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.విజయవాడలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపం వద్ద జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
ఉప్పొంగిన అభిమానం
విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్‌కు ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఎన్‌ఏసీ కళ్యాణ మండపం ఉండే గురునానక్ కాలనీ రోడ్డు, వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. వైఎస్ జగన్ అభివాదం చేయగానే సీఎం, సీఎం నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై జగన్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.
