ఉపకారం లేదు! | Government officials are instructed to apply for scholarships | Sakshi
Sakshi News home page

ఉపకారం లేదు!

Published Thu, Jan 9 2014 3:41 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Government officials are instructed to apply for scholarships

 జి.సిగడాం, న్యూస్‌లైన్:ఉపకార వేతనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులు అదే పనిలో పడ్డారు. ఇందుకు కావాల్సిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారి ఆశలపై నిబంధనలు నీళ్లు చల్లాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారంతా పేదల జాబితాలో చేరుతారు. స్కాలర్‌షిప్ పొందాలంటే తహశీల్దార్ కార్యలయం నుంచి ఆదాయ, కుల ధ్రువ పత్రాలు పొందాలి. అంతవరకూ బాగానే ఉన్నా నిబంధనలు మాత్రం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్కాలర్‌షిప్ పొందడానికి సంవత్సర ఆదాయం 44,500 రూపాయలలోపు ఉండాలని విద్యాశాఖ స్పష్టం చేస్తుంది. అంతకంటే ఎక్కువ ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ ఆమోదించడం లేదు. రెవెన్యూ అధికారులు మాత్రం  55,000 నుంచి 75,000 వరకు ఆదాయ ధ్రువపత్రాన్ని జారీ చేస్తున్నారు. దీంతో ఇటు రెవెన్యూ, అటు స్కాలర్‌షిప్ మంజూరు చేసే అధికారుల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ఇప్పటికీ ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోని పరిస్థితి ఏర్పడింది.
 
  సొమ్ము ఖర్చు!
 మీసేవా ద్వారా ఆదాయ, కులధ్రువపత్రాల కోసం వెళ్తున్న విద్యార్థుల నుంచి ఒకసారికి సుమారు 70 రూపాయలు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి రెండు మూడుసార్లు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుండడంతో రవాణా ఖర్చులతో సహా వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
 
 ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నప్పటికీ విద్యార్థులకు మాత్రం స్కాలర్‌షిప్ వచ్చే అవకాశాలు కానరాలేదు. రెవెన్యూ యంత్రాంగం మాత్రం సంవత్సర ఆదాయం 50 వేల రూపాయలకు పైగానే జారీ చేస్తామని వెల్లడిస్తున్నారు. జిల్లాలోని చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సుమారు 10 వేల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు నోచుకోనే అవకాశాన్ని కోల్పోయినట్టు తెలిసింది. జిల్లాలో అన్ని పాఠశాలల్లో చదువుతున్న 9, 10, ఇంటర్ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం మీసేవా, రెవెన్యూ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 చదువుకు దూరం!
 ఆదాయ ధ్రువపత్రాల కోసం 9, 10 తరగతుల విద్యార్థులు రోజుల తరబడి కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే ఒక పక్క మీ సేవా ఆన్‌లైన్ పనిచేయకపోవడం, ఆదాయం ధ్రువీకరణ సర్టిఫికెట్ 50 వేల రూపాయల కంటే తక్కువ ఇవ్వకపోవడంతో తరచూ దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు పాఠశాలకు డుమ్మా కొట్టి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో మూడు నెలలు సమైక్యాంధ్ర కోసం పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పుడు ధ్రువపత్రాల కోసం తిరుగుతుండడంతో చదువులు సాగని పరిస్థితి నెలకొంది.
 
 పదో తరగతి ఫీజుకు రాయితీ లేనట్టే!
 ఆదాయ ధ్రువీకరణ పత్రం ప్రభావం స్కాలర్‌షిప్‌తోపాటు  పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. పరీక్ష ఫీజుగా 125 రూపాయలు చెల్లించాలి. సంవత్సరాదాయం 23 వేల రూపాయలలోపు ఉంటే ఫీజులో రాయితీ ఉంటుంది. కానీ రెవెన్యూ అధికారులు రూ. 50 వేల రూపాయలకంటే ఎక్కువగానే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుండడంతో ఫీజులో రాయితీ వర్తించడం లేదు. దీంతో పూర్తిగా సొమ్ము చెల్లిస్తున్నట్టు పలువురు విద్యార్థులు వాపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement