కోటా కోత
=క్రిస్మస్‌కు పామాయిల్ లేదు
=సంక్రాంతికీ అనుమానమే..
=పది మండలాలకు ‘తుపాను’ నిల్వలు సరఫరా
=ఇదేం పౌర పంపిణీ వ్యవస్థ!
సాక్షి, మచిలీపట్నం : క్రిస్మస్ పండక్కి పిండివంటలు చేసుకుని తినాలన్న పేదోడి కోరిక ఈసారి నెరవేరే అవకాశం లేదు. సంక్రాంతికి అరిసెల సంగతి అటుంచి కనీసం గారెలు తినాలన్నా సామాన్యుడికి కష్టమే. ఎందుకంటే ఈసారి ప్రభుత్వ చౌకడిపోల ద్వారా జిల్లాలో పామాయిల్ పంపిణీ జరగడం లేదు. ఇతర దేశాల నుంచి దిగుమతి కాలేదు.. తుపానుల సమయంలో ఉంచిన నిల్వలను కొన్ని మండలాలకు పంపేందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పౌర పంపిణీ వ్యవస్థ కారణంగానే పండుగ వేళ పేదలకు ఈ అవస్థలు.
జిల్లాలో తెల్లకార్డులు, అంత్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ కార్డులు మొత్తం 11,52,152 ఉన్నాయి. వీటికి తోడు తాజాగా ఇటీవల జరిగిన రచ్చబండలో 59,711 కొత్త కార్డులకు తాత్కాలికంగా కూపన్లు జారీ చేశారు. ఒక్కో కార్డుకు నెలకు కనీసం లీటర్ చొప్పున పామాయిల్ ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాకు సుమారు 1150 మెట్రిక్ టన్నులు అవసరం. కాగా, సింగపూర్, మలేసియా నుంచి పామాయిల్ ఇప్పటివరకు రాలేదు. పండుగల నేపథ్యంలో ఆయా దేశాల్లో పామాయిల్‌కు డిమాండ్ పెరగడంతో మనకు కేటాయించిన కోటా ఎగుమతులు నిలిపివేశారు.
పండుగల ముందు నుంచే ఆయా దేశాల్లో మనం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థతో మాట్లాడాల్సిన మన యంత్రాంగం ఇప్పుడు ప్రయత్నాలు మొదలెట్టింది. అవి ఫలించి పామాయిల్ వచ్చినా క్రిస్మస్‌కు కోటా అందదు. ఆయా దేశాల నుంచి ఓడల్లో వచ్చే పామాయిల్ కాకినాడలో ప్యాకింగ్ కావాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు వచ్చినా అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో డిసెంబర్ కోటాపై ఆశ లేనట్టే. సంక్రాంతినాటికైనా జనవరి కోటా ఇచ్చేందుకు కసరత్తు సాగుతోంది. చౌకడిపోల్లో కిలో రూ.40కి ఇచ్చే పామాయిల్ బయట మార్కెట్లో రూ.65 పలుకుతోంది, మామూలు రిఫైన్డ్ ఆయిల్ కిలో రూ.100 పైమాటే. ఫలితంగా సామాన్యుడు ఇబ్బందిపడక తప్పదు.
పది మండలాలకే సరి..
డిసెంబర్ పామాయిల్ కోటా రాకపోవడంతో ప్రత్యామ్నాయ అవకాశాలపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల వచ్చిన తుపానులను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా నిల్వ ఉంచిన పామాయిల్‌ను కొన్ని ప్రాంతాల్లో చౌక డిపోల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టినట్టు పౌరసరఫరాల జిల్లా మేనేజర్ చిట్టిబాబు సాక్షికి వివరణ ఇచ్చారు. తుపానులప్పుడు నిల్వ ఉంచిన 387మెట్రిక్ టన్నుల పామాయిల్‌ను జిల్లాలో పది మండలాలకు డిసెంబర్ కోటాగా అందించేందుకు చర్యలు తీసుకున్నారు.
పెడన, గూడూరు, కోడూరు, నాగాయలంక, బంటుమిల్లి, కృత్తివెన్ను, ముదినేపల్లి, గుడ్లవల్లేరు, ముసునూరు మండలాలతోపాటు విజయవాడ రూరల్ మండలాల్లో పూర్తిస్థాయిలో పామాయిల్ కోటా ఇస్తారు. విజయవాడ నగరం, గుడివాడ, కైకలూరు, మండవల్లి ప్రాంతాల్లో 50 శాతం మంది తెల్లకార్డుదారులకు మాత్రమే పామాయిల్ కోటా కేటాయించారు. కాగా, జిల్లా అంతటా డిసెంబర్ నెలకు బియ్యం, పంచదార, కందిపప్పు, కిరోసిన్, ఇతర సరుకులు మాత్రం ఇస్తున్నారు.