పండుగకు పరేషాన్ | The supply of oil due to the negligence of the government to a standstill | Sakshi
Sakshi News home page

పండుగకు పరేషాన్

Published Wed, Oct 1 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

The supply of oil due to the negligence of the government to a standstill

విశాఖ రూరల్ : జిల్లాలో 12.3 లక్షల తెల్లరే షన్‌కార్డుదారులు ఉన్నారు. చౌక దుకాణాల నుంచి వీరు ప్రతీ నెలా ఏ వస్తువు తీసుకోకపోయినా పామాయిల్‌ను మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ కుటుంబానికి అవసరమైన ఈ వంటనూనె సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయింది. గత మార్చి నుంచి ఉత్పత్తి కొరత పేరుతో పామాయిల్ పంపిణీ పూర్తిగా ఆపేశారు.

రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌డిపోల్లో సరఫరా చేసే పామోలిన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ విడుదల చేయాల్సి ఉంటుంది. గత ఏడు నెలలుగా రాయితీ నిధులు జమ చేయడం లేదు. దీంతో సరఫరా నిలిచిపోయింది. పామోలిన్ లీటర్ ధర రూ.63.50 ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రాయితీ రూ.15, రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూ.8.50 చెల్లించి.. కార్డుదారులకు రూ.40కే చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేది.

మలేషియా నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేయగా కాకి నాడ పోర్టుకు తీసుకువచ్చి అక్కడ పామాయిల్‌ను ప్యాకింగ్ చేసి జిల్లాలకు కేటాయింపులు చేసేవారు. కానీ గత ఏడు నెలలుగా పామాయిల్‌ను కొనుగోలు చేయలేదు. దీంతో 12.3 లక్షల మంది కార్డుదారులు బహిరంగ మార్కెట్‌లో లీటర్ పామోలిన్‌ను రూ.63 నుంచి రూ.68కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాధారణంగా కార్డుదారులకు ప్రతీ నెలా అరకిలో పంచదార ఇస్తున్నారు. పండుగ మాసాల్లో మాత్రం అదనంగా మరో అరకిలో ఇచ్చేవారు. వినాయక చవితి పండుగకు అదనపు చక్కెర ఇస్తారని భావించినప్పటి ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు చేయలేదు.

కనీసం దసరాకైనా అరకిలో అదనంగా ఇస్తారనుకున్నా ప్రభుత్వం కనీసం ఆ విషయంపైనే దృష్టి సారించలేదు. ఇందుకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు గాని, అదనపు కేటాయింపులు గానీ జరగకపోవడంతో దసరాకు కూడా పంచదార అదనంగా ఇచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కేవలం బియ్యం, పంచదార మినహా మిగిలిన సరుకులు ఇవ్వడం లేదు. దీంతో పండుగ మాసంలో కూడా పేదలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement