పండగకు పామాయిల్ ఉన్నట్టా... లేనట్టా...!
=ఈ నెలలో సరఫరా చేసింది సగమే
=జనవరికి ఇప్పటికీ కేటాయింపులు లేవు
=అయోమయంలో పేద కుటుంబాలు
=పండగకు తప్పని అదనపు భారం
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : పండక్కి పామాయి ల్ అదనపు కోటా మాట అటుంచి అసలుకే దిక్కులేని పరిస్థితి నెలకొంది. డిసెంబరులో అరకొరగా కేటాయించినప్పటికీ, జనవరికి సంబంధించి అధికారులు ఇప్పటికీ ఏ విషయమూ నిర్దుష్టంగా చెప్పలేకపోతున్నారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తరువు వస్తాయంటున్నారు. ఆమేరకు కేటాయింపు, సరఫరా చేస్తామని చెబుతున్నారు. చౌక దుకాణాల ద్వారా ప్రతీ తెల్లరేషన్‌కార్డుదారునికి ప్రభుత్వం లీటరు పామాయిల్‌ను రూ.40కి పంపిణీ చేస్తోంది. బయట మార్కెట్లో ధీని ధర రూ.65 వరకు ఉంది. దీంతో చౌకదుకాణాల పామాయిల్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. తక్కువ ధర కు వస్తుండటంతో దాదాపుగా అందరూ పామాయిల్‌ను విడిపించుకుంటున్నారు.
జిల్లాలో 12.34 లక్షల మంది కార్డుదారులు ఉంటే డిసెంబరులో కేవలం 6,08,445 లీటర్లు మాత్రమే సరఫరా చేసింది. దీంతో సగానికిపైగా కార్డుదారులకు వంటనూనె అందలేదు. ఇక జనవరిలో సంక్రాంతి పండగకు అదనంగా పంచదార, నూనెను సరఫరా చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం అదనపు కోటా మాట అటుంచి, జనవరికి అవసరమైన కేటాయింపులు ఇప్పటి వరకు జిల్లాకు రాలేదు. విదేశాల నుంచి ప్రతి నెలా పామాయిల్ కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది.
అక్కడ ప్యాకింగ్‌లు చేసి వాటిని అవసరాల మేరకు జిల్లాలకు సరఫరా అవుతుంది. ప్రస్తుతం రెండు వేల కిలోలీటర్ల పామాయిల్ పోర్టుకు చేరిన ట్లు దిగుమతి కంపెనీ వర్గాల ద్వారా తెలిసిందని, దాన్ని కేటాయించిన వెంటనే సరఫరా చేస్తామని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి రేషన్ దాకాణాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంటారు.
కానీ జనవరి నెల పామాయిల్ ఇప్పటికీ రాకపోవడంతో పండుగ మాసం బహిరంగ మార్కెట్‌లో అధిక ధర రూ.65 వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఒకవేళ ఆలస్యంగానైనా పామాయిల్ వస్తే వాటిని కార్డుదారులకు సరఫరా చేయడానికి సమయం పట్టనుంది. మొత్తం మీద ఈ పండుగకు ముందైనా ప్రభుత్వం పామాయిల్‌ను ఇస్తుందో లేదో వేచి చూడాలి మరి.