పండుగకు పామాయిల్ లేనట్టే! | no palm oil to festival | Sakshi
Sakshi News home page

పండుగకు పామాయిల్ లేనట్టే!

Published Tue, Jan 7 2014 11:56 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

no palm oil to festival

యాచారం, ఘట్‌కేసర్ టౌన్, న్యూస్‌లైన్: మరో ఆరు రోజుల్లో సంక్రాంతి పండుగ.. తెల్ల రేషన్‌కార్డుదారులకు అమ్మహస్తం సరుకులతో పంపిణీ చేసే పామాయిల్ రెండు నెలలుగా అందడం లేదు. ఈ నేపథ్యంలో పండుగకు పిండివంటలు చేసుకోవడం పేదలకు కష్టంగా మారనుంది. మార్కెట్లో అధిక ధరకు వంటనూనె కొనుగోలుచేసే స్తోమత లేని పేదలు రేషన్‌దుకాణాల్లో పంపిణీ చేసే పామాయిల్ వైపే మొగ్గు చూపుతారు. అయితే యాచారం మండలంలో డిసెంబర్ నెలకు సంబంధించి డీలర్ల వద్ద డీడీలు కట్టించుకున్న అధికారులు అమ్మహస్తం సరుకుల్లో పామాయిల్‌ను సరఫరా చేయలేదు. మండలంలో 20గ్రామాల్లో దాదాపు 14వేల వరకు తెల్లరేషన్‌కార్డుల లబ్ధిదారులున్నారు. డిసెంబర్‌లో పామాయిల్ సరఫరా చేయకపోవడంతో జనవరిలోని స్టాక్‌కు డీడీలు తీయవద్దని ఉన్నతాధికారులు డీలర్లను ఆదేశించారు. దీంతో ఈ నెలలో కూడా పామాయిల్‌తోపాటు గోధుమపిండి కూడా పేదలకు అందే పరిస్థితి కన్పించడం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారులను, రెవెన్యూ అధికారులను అడిగినా పామాయిల్, గోధుమపిండి వస్తుందో, రాదో స్పష్టంగా చెప్పడం లేదని పలువురు డీలర్లు ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు.
 
 భగ్గుమంటున్న నూనె ధరలు
 పండుగ దగ్గర పడుతుండడంతో మార్కెట్లో వంటనూనె ధరలు భగ్గుమంటున్నాయి. వారం రోజుల క్రితం లీటర్ రూ.70 ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రస్తుతం రూ.99 దాటింది. అలాగే పల్లీనూనె రూ.65 నుంచి రూ.65కి చేరింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.  
 
 పేదలపై రూ.కోటి భారం!
 ఘట్‌కేసర్ మండలంలో మొత్తం 38 చౌకధర దుకాణాలుండగా, 35వేలకు పైగా తెల్లరేషన్‌కార్డుదారులకు సరుకులు అందజేస్తున్నారు. చౌకధర దుకాణాల్లో లీటర్ పామాయిల్‌ను రూ.40కి పంపిణీ చేస్తుండగా బహిరంగ మార్కెట్‌లో రూ.65-70కి విక్రయిస్తున్నారు. దీంతో ఒక పామాయిల్ పైనే లబ్ధిదారులకు లీటర్‌కు రూ.25-30 అదనపు భారం పడనుంది. దీంతో మండలంలో సంక్రాంతి పండుగకు పేదలపై సుమారు కోటి రూపాయల అదపనపు భారం పడుతోంది. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ సురేందర్‌ను వివరణ కోరగా పండుగకు అన్ని సరుకులతోపాటు పామాయిల్‌ను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే మండల కేంద్రంలోని పౌరసరఫరాల గోదామును ‘న్యూస్‌లైన్’ పరిశీలించగా బియ్యం నిల్వలు కూడా కన్పించలేదు.
 
 అధికారుల నిర్లక్ష్యమే..
 సమయానికి సరుకులను తెప్పించి పేదలకు అందజేయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం.
 పండుగకు పేదలపై అదనపు భారం పడకుండా రేషన్ దుకాణాల ద్వారా అన్ని సరుకులతో పాటు పామాయిల్‌ను కూడా పంపిణీ చేయాలి.
 - అబ్బగోని మీనా, వార్డు సభ్యురాలు. ఘట్‌కేసర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement