సాక్షి, రంగారెడ్డి జిల్లా: రేషన్ లబ్ధిదారులకు సర్కారు పండుగ షాక్ ఇచ్చింది. దసరాలాంటి ముఖ్య పండుగల సమయంలో ప్రత్యేక ప్రోత్సాహకం కింద రేషన్ వినియోగదారులకు అదనపు కోటాకు మంగళం పాడిన ప్రభుత్వం.. తాజాగా అసలు కోటాకే ఎసరు పెట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో జిల్లాకు పూర్తిస్థాయి పామాయిల్ కోటా చేరలేదు. చివ రివరకు కోటా వస్తుందంటూ బుకాయించిన పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు.. తీరా పంపిణీ సమయంలో కోటా వచ్చే అవకాశం లేదంటూ చేతులెత్తేశారు. దీంతో జిల్లాలో సగానికిపైగా లబ్ధిదారులకు ఈ నెల రేషన్ సరుకుల్లో పామాయిల్ నూనె తీసుకునే భాగ్యం లేకుండా పోయింది.
జిల్లా వ్యాప్తంగా 10.24లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో తెల్ల రేషన్ కార్డుదారులు 9.58 లక్షలు, 66 వేల అంత్యోదయ రేషన్ కార్డుదారులున్నారు. వీరికిగాను ప్రతి నెల 1,024 కిలోలీటర్ల పామాయిల్ నూనెను పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. ఇందుకుగాను కృష్ణపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి కోటా ఇక్కడికి వస్తుంది. అయితే కోటా వచ్చే ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో గత మూడు నెలలుగా పామాయిల్ కోటా అరకొరగానే వస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇటీవల జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే నెలాఖరునాటికి కూడా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ నెలకు రావాల్సిన 1,024 కిలోలీటర్ల కోటాలో కేవలం 526 కిలోలీటర్ల నూనె మాత్రమే జిల్లాకు చేరింది. వీటిని ప్రాధాన్యత ప్రకారం అధికారులు రేషన్ డీలర్లకు చేరవేస్తున్నారు.
500 కిలోలీటర్ల పామాయిల్ హుష్..!
ఈ నెలలో జిల్లాకు రాావాల్సిన కోటాలో కేవలం 526 కిలోలీటర్ల పామాయిల్ రావడంతో మిగతా 500 కిలోలీటర్ల కోటాపై సందిగ్ధం నెలకొంది. సాధారణంగా నెల ప్రారంభం నాటికే ఈ కోటా రేషన్ దుకాణాలకు చేరితే పంపిణీ ప్రక్రియ సులభతరమయ్యేది. అయితే ఈ నెలలో దసరా పండుగ ఉండడంతో పామాయిల్‌కు డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న కోటాను మాత్రమే రేషన్ దుకాణాలకు చేరవేశారు. మిగిలిన కోటా ఈ నెలలో వచ్చే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో 500 కిలోలీటర్ల కోటా ఇక లేదనే తెలుస్తోంది. గత మూడు నెలలుగా జిల్లాకు పామాయిల్ కోటా అరకొరగా వస్తుండడంతో ఈ నెలలో డీలర్లు కూడా 70 శాతమే స్పందించి డీడీలు కట్టగా.. వారిలో 52 శాతం మందికి మాత్రమే అరకొరగా పామాయిల్ కోటా చేరింది.
పామాయిల్ కోత
Published Wed, Oct 2 2013 6:58 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement