Rashan Card
-
‘ఈ-రేషన్’తో అక్రమాలకు చెక్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: బోగస్ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాలశాఖ రంగం సిద్ధం చేసిం ది. వాటిని నిరోధించేందుకు ఇప్పటి వరకూ శతవిధాలా ప్రయత్నించినా అక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఆఖరి అస్త్రంగా ఈ - రేషన్‌ను తెరపైకి తెచ్చింది. ఈ విధానంతో బోగస్ కార్డులకు బ్రేక్ వేయడంతో పాటు కోట్లాది రూపాయల నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా చెక్ పెట్టేందుకు సన్నద్ధమైంది. అందులో భాగంగా రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా ఆధార్ ప్రక్రియ పూర్తయితే ఆ తరువాత నెల నుంచి నిత్యావసరాల కేటాయింపులు ఆ శాఖ కమిషనరేట్ చేయనుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాస్తవ కార్డుదారుడికి నిత్యావసరాలు పూర్తిస్థాయిలో అందనున్నాయి. జిల్లాలో 2107 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 9 లక్షల 10 వేల 693 రేషన్ కార్డులున్నాయి. అందులో 8 లక్షల 563 తెల్లకార్డులు, 56 వేల 946 మూడో విడత రచ్చబండ కార్డులు, 52 వేల 152 అంత్యోదయ, అన్న యోజన కార్డులు, 1032 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఈ కార్డులకు సంబంధించి ప్రతినెలా 10089.343 టన్నుల పీడీఎస్ బియ్యం, 1825.355 టన్నుల అంత్యోదయ, అన్నయోజన కార్డుల బియ్యం, 10.340 టన్నులు అన్నపూర్ణ కార్డుల బియ్యం కేటాయిస్తున్నారు. 426.329 టన్నుల పంచదార, 60.000 టన్నుల గోధుమలు, 8 లక్షల 53 వేల 52 లీటర్ల కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి అమ్మహస్తం పేరుతో తొమ్మిది రకాల నిత్యావసరాలను ప్రభుత్వం అందిస్తోంది. -
ఆదుకోని అమ్మహస్తం!
సాక్షి, కొత్తగూడెం: అమ్మహస్తం పథకం జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. తొమ్మిది రకాల సరుకులు అతి తక్కువ ధరకే అంటూ ప్రభుత్వం ఊదరగొట్టినా.. చివరకు నాణ్యత లేకపోవడంతో లబ్ధిదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. డీలర్లు కూడా కారం, చింతపండు, గోధుమ పిండికి ఆర్డర్ పెట్టకపోవడంతో జిల్లాలో మూడు నెలలుగా ఈ సరుకులు పంపిణీ కావడం లేదు. జిల్లాలో మొత్తం 7,68,538 తెల్ల రేషన్‌కార్డులున్నాయి. ప్రతినెల 10వతేదీలోపు సరుకులను లబ్ధిదారులకు అందజేయాలి. గతంలో బియ్యం, పామోలిన్, గోధుమలు, కిరోసిన్ లబ్ధిదారులకు అందజేసేవారు. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం అమ్మహస్తం పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ.185కే కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, పసుపు, పామోలిన్, కారం, ఉప్పు, చక్కెర, చింతపండు వంటి తొమ్మిది సరుకులు అందజేయనున్నట్లు ప్రకటించింది. బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలుచెప్పినా.. ఈహామీ నీటిమూటే అయింది. ప్రారంభంలో ఈసరుకులు బాగానే ఉన్నా రానురాను అసలే నాణ్యత లేకుండా పోయాయి. ప్రధానంగా చింతపండు నల్లగా ఉండడం, గోధుమ పిండిలో పురుగులు వస్తుండడం, కారం, పసుపు గడ్డ కడుతుండడంతో లబ్ధిదారులు వీటిని తీసుకునేందుకు ఇష్టపడడంలేదు. ఎలాగూ లబ్ధిదారులు తీసుకోవడం లేదని జిల్లాలో చాలా మంది డీలర్లు ఈ సరుకులకు డీడీలు కూడా తీయడం లేదు. లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నా.. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ఈ సరుకుల కొనుగోళ్లపై ప్రారంభంలో లబ్ధిదారులు ఆసక్తిచూపారు. అయితే అన్ని సరుకులూ నాణ్యత ఉండేలా చూడాలని లబ్ధిదారులు డీలర్ల వద్ద మొర పెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. చింతపండు నెలలుగా స్టాక్ ఉన్నది తేవడంతో వంట చేస్తే అసలు రుచే ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నాణ్యత లేని చింతపండును కొనుగోలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని లబ్ధిదారులు అంటున్నారు. ఇక పామోలిన్ ఏడాదిలో ఎప్పుడూ సక్రమంగా పంపిణీ చేయడం లేదు. ప్రధానంగా పండుగల సమయంలోనే ప్రభుత్వం లబ్ధిదారులకు రిక్తహస్తం చూపుతోంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చినా జిల్లాకు మాత్రం పామోలిన్ రాలేదు. ఎప్పుడూ కొరత ఉందన్న సాకుతో అధికారులు తప్పించుకుంటున్నారు. అయితే నిరుపేదలు మాత్రం కనీసం పండుగకు పామోలిన్ ఇవ్వారా..? అని ప్రశ్నిస్తున్నారు. సమీక్షలతోనే అధికారులు సరి.. సరుకుల నాణ్యత విషయంలో లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజాపంపిణీ విభాగానికి సంబంధించి మండల స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారే తప్ప.. అసలు సరుకుల్లో ఎందుకు నాణ్యత ఉండడం లేదన్న కోణంలో అధికారులు ఆలోచించడం లేదు. పామోలిన్‌కు లబ్ధిదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నా ఎప్పుడూ కూడా వారికి అవసరమైన రీతిలో పంపిణీ చేయలేదు. డీలర్లు పామోలిన్ ఉన్న సమయంలో కూడా తమకు ఇవ్వకుండా ఎక్కువ ధరకు బయట విక్రయిస్తున్నారని లబ్ధిదారులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతవకలు లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్న మాటలు అప్పటివరకే పరిమితమని, రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అమ్మహస్తం పథకం సరుకులపై దృష్టిసారిస్తే పేదలకు ప్రయోజనం చేకూరుతుందని పలువురు కోరుతున్నారు. -
పండుగకు పామాయిల్ లేనట్టే!
యాచారం, ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: మరో ఆరు రోజుల్లో సంక్రాంతి పండుగ.. తెల్ల రేషన్‌కార్డుదారులకు అమ్మహస్తం సరుకులతో పంపిణీ చేసే పామాయిల్ రెండు నెలలుగా అందడం లేదు. ఈ నేపథ్యంలో పండుగకు పిండివంటలు చేసుకోవడం పేదలకు కష్టంగా మారనుంది. మార్కెట్లో అధిక ధరకు వంటనూనె కొనుగోలుచేసే స్తోమత లేని పేదలు రేషన్‌దుకాణాల్లో పంపిణీ చేసే పామాయిల్ వైపే మొగ్గు చూపుతారు. అయితే యాచారం మండలంలో డిసెంబర్ నెలకు సంబంధించి డీలర్ల వద్ద డీడీలు కట్టించుకున్న అధికారులు అమ్మహస్తం సరుకుల్లో పామాయిల్‌ను సరఫరా చేయలేదు. మండలంలో 20గ్రామాల్లో దాదాపు 14వేల వరకు తెల్లరేషన్‌కార్డుల లబ్ధిదారులున్నారు. డిసెంబర్లో పామాయిల్ సరఫరా చేయకపోవడంతో జనవరిలోని స్టాక్‌కు డీడీలు తీయవద్దని ఉన్నతాధికారులు డీలర్లను ఆదేశించారు. దీంతో ఈ నెలలో కూడా పామాయిల్‌తోపాటు గోధుమపిండి కూడా పేదలకు అందే పరిస్థితి కన్పించడం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారులను, రెవెన్యూ అధికారులను అడిగినా పామాయిల్, గోధుమపిండి వస్తుందో, రాదో స్పష్టంగా చెప్పడం లేదని పలువురు డీలర్లు ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు. భగ్గుమంటున్న నూనె ధరలు పండుగ దగ్గర పడుతుండడంతో మార్కెట్లో వంటనూనె ధరలు భగ్గుమంటున్నాయి. వారం రోజుల క్రితం లీటర్ రూ.70 ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రస్తుతం రూ.99 దాటింది. అలాగే పల్లీనూనె రూ.65 నుంచి రూ.65కి చేరింది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. పేదలపై రూ.కోటి భారం! ఘట్కేసర్ మండలంలో మొత్తం 38 చౌకధర దుకాణాలుండగా, 35వేలకు పైగా తెల్లరేషన్‌కార్డుదారులకు సరుకులు అందజేస్తున్నారు. చౌకధర దుకాణాల్లో లీటర్ పామాయిల్‌ను రూ.40కి పంపిణీ చేస్తుండగా బహిరంగ మార్కెట్లో రూ.65-70కి విక్రయిస్తున్నారు. దీంతో ఒక పామాయిల్ పైనే లబ్ధిదారులకు లీటర్‌కు రూ.25-30 అదనపు భారం పడనుంది. దీంతో మండలంలో సంక్రాంతి పండుగకు పేదలపై సుమారు కోటి రూపాయల అదపనపు భారం పడుతోంది. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ సురేందర్‌ను వివరణ కోరగా పండుగకు అన్ని సరుకులతోపాటు పామాయిల్‌ను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే మండల కేంద్రంలోని పౌరసరఫరాల గోదామును ‘న్యూస్‌లైన్’ పరిశీలించగా బియ్యం నిల్వలు కూడా కన్పించలేదు. అధికారుల నిర్లక్ష్యమే.. సమయానికి సరుకులను తెప్పించి పేదలకు అందజేయకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. పండుగకు పేదలపై అదనపు భారం పడకుండా రేషన్ దుకాణాల ద్వారా అన్ని సరుకులతో పాటు పామాయిల్‌ను కూడా పంపిణీ చేయాలి. - అబ్బగోని మీనా, వార్డు సభ్యురాలు. ఘట్కేసర్ -
రేషన్ రాలె!
సాక్షి, మంచిర్యాల: జిల్లా వ్యాప్తంగా 6,54,782 రేషన్‌కార్డులు ఉన్నాయి. గత నెల 11న నిర్వహించిన రచ్చబండలో రేషన్‌కార్డులు లేని నిరుపేదలకు అధికారులు కూపన్లు అందజేశారు. ఈ కూపన్లపై బియ్యం, నూనె, చక్కెర, చింతపండు, ఉప్పు ఇవ్వాలి. రచ్చబండ కూపన్లు ఇచ్చిన తర్వాత జిల్లాకు బియ్యం, చ క్కెర కోటా పెరిగింది. పెరిగిన రచ్చబండ కార్డుదారులకు అనుగుణంగా సరిపడా కోటా మండల లెవల్ స్టాకిస్ట్(ఎంఎల్ఎస్) పాయింట్లకు చేరిందని పౌరసరఫరాల అధికారులు చెప్తున్నారు. కానీ, ఎంఎల్ఎస్ పాయింట్లలో కేవలం బియ్యం, చక్కెర మాత్రమే ఉండడంతో రేషన్‌డీలర్లు ఆ సరుకులు మాత్రమే తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. దీంతో రెండు సరుకులు ఇస్తుండడంతో పామాయిల్, పప్పు మిగతా సరుకుల కోసం లబ్ధిదారులు రేషన్డీలర్లను నిలదీస్తున్నారు. డీడీలు తీసేందుకు మొండికేస్తున్న డీలర్లు సాధారణంగా రేషన్‌డీలర్లు తమకు కేటాయించిన నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ప్రతి నెల 25వ తేదీలోగా డీడీలు తీసి అధికారులకు సమర్పిస్తారు. ఒకటో తేదీలోపు వారి రేషన్ కోట ఆయా షాపులకు చేరుతుంది. ఒకటో తేదీ నుంచి 15వ తేది వరకు డీలర్లు సరుకులు పంపిణీ చేస్తారు. అయితే.. చాలా ప్రాంతాల్లో రేషన్ డీలర్లు ఈ నెల పెరిగిన కోటా గురించి తెలియక పాత కోటా ప్రకారమే డీడీలు చెల్లించి సరుకులు తీసుకున్నారు. ఇంకొందరు పెరిగిన కోటా తీసుకునేందుకు నిరాసక్తత ప్రదర్శించారు. పాత కోటాకే సరిపడా డీడీ చెల్లించారు. మందమర్రి పట్టణంలో 1,134, మండలంలో 375 మందికి రచ్చబండలో కూపన్లు ఇచ్చారు. వీరిలో 16 మంది డీలర్లకు నాలుగైదు కార్డులలోపు కేటాయించారు. మిగిలిన వారికి 20 పైనే ఉన్నాయి. తక్కువ కార్డులున్న డీలర్లు గత నెలలో కూపన్ల సరుకులకు సంబంధించిన డబ్బులకు డీడీలు చెల్లించకుండా పాత కోటా ప్రకార మే డీడీ తీసి నిత్యావసర వస్తువులు పొందారు. దీంతో 60కిపైగా కూపన్‌దారులకు రేషన్ అందలేదు. నార్నూర్ మండలంలో 411 మందికి కూపన్లు జారీ చేస్తే.. ఒక్కరికి కూడా సరుకులు రాలేదు. కోటా విడుదల చేశాం.. - వసంత్‌రావు దేశ్‌పాండే, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మూడో విడత రచ్చబండలో జారీ చేసిన కూపన్లకు సంబంధించిన సరుకులు విడుదల చేశాం. అయినా డీలర్లు సరుకులు ఎందుకు ఇవ్వడం లేదో మాకు తెలియదు. ఇప్పటి వరకు మాకు ఫిర్యాదులేవీ రాలేదు. కోటా మంజూరు చేయించుకున్న డీలర్లు లబ్ధిదారులకు వెంటనే సరుకులు ఇవ్వాలి. -
పామాయిల్ కోత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రేషన్ లబ్ధిదారులకు సర్కారు పండుగ షాక్ ఇచ్చింది. దసరాలాంటి ముఖ్య పండుగల సమయంలో ప్రత్యేక ప్రోత్సాహకం కింద రేషన్ వినియోగదారులకు అదనపు కోటాకు మంగళం పాడిన ప్రభుత్వం.. తాజాగా అసలు కోటాకే ఎసరు పెట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో జిల్లాకు పూర్తిస్థాయి పామాయిల్ కోటా చేరలేదు. చివ రివరకు కోటా వస్తుందంటూ బుకాయించిన పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు.. తీరా పంపిణీ సమయంలో కోటా వచ్చే అవకాశం లేదంటూ చేతులెత్తేశారు. దీంతో జిల్లాలో సగానికిపైగా లబ్ధిదారులకు ఈ నెల రేషన్ సరుకుల్లో పామాయిల్ నూనె తీసుకునే భాగ్యం లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 10.24లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో తెల్ల రేషన్ కార్డుదారులు 9.58 లక్షలు, 66 వేల అంత్యోదయ రేషన్ కార్డుదారులున్నారు. వీరికిగాను ప్రతి నెల 1,024 కిలోలీటర్ల పామాయిల్ నూనెను పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. ఇందుకుగాను కృష్ణపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి కోటా ఇక్కడికి వస్తుంది. అయితే కోటా వచ్చే ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో గత మూడు నెలలుగా పామాయిల్ కోటా అరకొరగానే వస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇటీవల జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే నెలాఖరునాటికి కూడా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ నెలకు రావాల్సిన 1,024 కిలోలీటర్ల కోటాలో కేవలం 526 కిలోలీటర్ల నూనె మాత్రమే జిల్లాకు చేరింది. వీటిని ప్రాధాన్యత ప్రకారం అధికారులు రేషన్ డీలర్లకు చేరవేస్తున్నారు. 500 కిలోలీటర్ల పామాయిల్ హుష్..! ఈ నెలలో జిల్లాకు రాావాల్సిన కోటాలో కేవలం 526 కిలోలీటర్ల పామాయిల్ రావడంతో మిగతా 500 కిలోలీటర్ల కోటాపై సందిగ్ధం నెలకొంది. సాధారణంగా నెల ప్రారంభం నాటికే ఈ కోటా రేషన్ దుకాణాలకు చేరితే పంపిణీ ప్రక్రియ సులభతరమయ్యేది. అయితే ఈ నెలలో దసరా పండుగ ఉండడంతో పామాయిల్‌కు డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న కోటాను మాత్రమే రేషన్ దుకాణాలకు చేరవేశారు. మిగిలిన కోటా ఈ నెలలో వచ్చే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో 500 కిలోలీటర్ల కోటా ఇక లేదనే తెలుస్తోంది. గత మూడు నెలలుగా జిల్లాకు పామాయిల్ కోటా అరకొరగా వస్తుండడంతో ఈ నెలలో డీలర్లు కూడా 70 శాతమే స్పందించి డీడీలు కట్టగా.. వారిలో 52 శాతం మందికి మాత్రమే అరకొరగా పామాయిల్ కోటా చేరింది.