ఆదుకోని అమ్మహస్తం!
సాక్షి, కొత్తగూడెం: అమ్మహస్తం పథకం జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. తొమ్మిది రకాల సరుకులు అతి తక్కువ ధరకే అంటూ ప్రభుత్వం ఊదరగొట్టినా.. చివరకు నాణ్యత లేకపోవడంతో లబ్ధిదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. డీలర్లు కూడా కారం, చింతపండు, గోధుమ పిండికి ఆర్డర్ పెట్టకపోవడంతో జిల్లాలో మూడు నెలలుగా ఈ సరుకులు పంపిణీ కావడం లేదు.
జిల్లాలో మొత్తం 7,68,538 తెల్ల రేషన్‌కార్డులున్నాయి. ప్రతినెల 10వతేదీలోపు సరుకులను లబ్ధిదారులకు అందజేయాలి. గతంలో బియ్యం, పామోలిన్, గోధుమలు, కిరోసిన్ లబ్ధిదారులకు అందజేసేవారు. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం అమ్మహస్తం పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ.185కే కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, పసుపు, పామోలిన్, కారం, ఉప్పు, చక్కెర, చింతపండు వంటి తొమ్మిది సరుకులు అందజేయనున్నట్లు ప్రకటించింది. బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలుచెప్పినా.. ఈహామీ నీటిమూటే అయింది. ప్రారంభంలో ఈసరుకులు బాగానే ఉన్నా రానురాను అసలే నాణ్యత లేకుండా పోయాయి. ప్రధానంగా చింతపండు నల్లగా ఉండడం, గోధుమ పిండిలో పురుగులు వస్తుండడం, కారం, పసుపు గడ్డ కడుతుండడంతో లబ్ధిదారులు వీటిని తీసుకునేందుకు ఇష్టపడడంలేదు. ఎలాగూ లబ్ధిదారులు తీసుకోవడం లేదని జిల్లాలో చాలా మంది డీలర్లు ఈ సరుకులకు డీడీలు కూడా తీయడం లేదు.
లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నా..
బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ఈ సరుకుల కొనుగోళ్లపై ప్రారంభంలో లబ్ధిదారులు ఆసక్తిచూపారు. అయితే అన్ని సరుకులూ నాణ్యత ఉండేలా చూడాలని లబ్ధిదారులు డీలర్ల వద్ద మొర పెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. చింతపండు నెలలుగా స్టాక్ ఉన్నది తేవడంతో వంట చేస్తే అసలు రుచే ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నాణ్యత లేని చింతపండును కొనుగోలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని లబ్ధిదారులు అంటున్నారు. ఇక పామోలిన్ ఏడాదిలో ఎప్పుడూ సక్రమంగా పంపిణీ చేయడం లేదు. ప్రధానంగా పండుగల సమయంలోనే ప్రభుత్వం లబ్ధిదారులకు రిక్తహస్తం చూపుతోంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చినా జిల్లాకు మాత్రం పామోలిన్ రాలేదు. ఎప్పుడూ కొరత ఉందన్న సాకుతో అధికారులు తప్పించుకుంటున్నారు. అయితే నిరుపేదలు మాత్రం కనీసం పండుగకు పామోలిన్ ఇవ్వారా..? అని ప్రశ్నిస్తున్నారు.
సమీక్షలతోనే అధికారులు సరి..
సరుకుల నాణ్యత విషయంలో లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజాపంపిణీ విభాగానికి సంబంధించి మండల స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారే తప్ప.. అసలు సరుకుల్లో ఎందుకు నాణ్యత ఉండడం లేదన్న కోణంలో అధికారులు ఆలోచించడం లేదు. పామోలిన్‌కు లబ్ధిదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నా ఎప్పుడూ కూడా వారికి అవసరమైన రీతిలో పంపిణీ చేయలేదు. డీలర్లు పామోలిన్ ఉన్న సమయంలో కూడా తమకు ఇవ్వకుండా ఎక్కువ ధరకు బయట విక్రయిస్తున్నారని లబ్ధిదారులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతవకలు లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్న మాటలు అప్పటివరకే పరిమితమని, రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అమ్మహస్తం పథకం సరుకులపై దృష్టిసారిస్తే పేదలకు ప్రయోజనం చేకూరుతుందని పలువురు కోరుతున్నారు.