amma hastham scheme
-
217 మెట్రిక్ టన్నుల కాలం చెల్లిన సరుకులు
- ప్రభుత్వానికి రూ.1.43 కోట్ల నష్టం - ప్రభుత్వ పనితీరును తప్పుపట్టిన కాగ్ హైదరాబాద్ : దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) లబ్దిదారులకు 'అమ్మ హస్తం' పథకం ద్వారా సరఫరా చేసే సరుకులను కమిషన్లకు కక్కుర్తిపడి అవసరానికి మించి కొనుగోలు చేయడంతో వాటిలో చాలా వరకు మిగిలిపోయి వాడుకోవడానికి వీలులేకుండా పనికి రాకుండా పోయాయి. అమ్మహస్తం పథకాన్ని 2013 ఏప్రిల్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని 2014 ఆగస్టులో రద్దు చేశారు. అమ్మహస్తం పథకం ద్వారా కిలో కందిపప్పు, లీటర్ పామోలిన్, కిలో గోధుమ పిండి, కిలో గోధుమలు, అర కిలో పంచదార, కిలో ఉప్పు, 250 గ్రాముల కారం పొడి, అరకిలో చింతపండు, 100 గ్రాముల పసుపుతో కూడిన తొమ్మిది నిత్యావసర సరుకులను ప్రత్యేక సంచిలో ఉంచి పౌరసరఫరాల శాఖ ద్వారా రూ.185లకే తెల్ల రేషన్ కార్డుదారులకు రాయితీపై అందించారు. అయితే అవసరానికి మించి సరుకులను కొనుగోలు చేయడంతో 217.44 మెట్రిక్ టన్నుల కాలం చెల్లిన సరుకులను బహిరంగంగా విక్రయించడం వల్ల రూ. 1.43 కోట్ల మేర పౌరసరఫరాల సంస్థకు నష్టం వాటిల్లిందని కాగ్ గుర్తించి ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. అదేవిధంగా ఈ పథకం కోసం ప్రత్యేకించి రూపొందించిన రూ.11.74 లక్షల విలువైన సంచులు పంపిణీ చేయకుండా నిరుపయోగంగా ఉన్నట్లు కాగ్ గుర్తించింది. రాష్ట్రంలో ఉన్న 1.30 కోట్ల కుటుంబాలకు సరఫరా చేసేందుకు ప్రతి సరుకు ఎంత మొత్తంలో అవసరమౌతోంది.. అందుకు ప్రతిగా వాస్తవంలో (2013 మే- 2014 ఆగస్టు మధ్య కాలంలో) ఎంత విడుదల చేశారు అన్న అంశాన్ని ఆడిట్లో విశ్లేషించగా తొమ్మిదిలో ఆరు సరుకులను (కందిపప్పు, పామోలిన్, పంచదార మినహా) తగు మొత్తంలో సరఫరా చేయలేదని కాగ్ పరిశీలనలో వెల్లడైంది. -
అమ్మహస్తం ...అస్తవ్యస్తం
మార్కాపురం, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన అమ్మ హస్తం పథకం పశ్చిమ ప్రకాశంలో అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పథకం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను తెల్లరేషన్ కార్డుదారులకు అందించాలని ప్రభుత్వం భావించింది. *185 లకే అరకిలో పంచదార, ఆయిల్ ప్యాకెట్, కంది పప్పు కిలో, గోధుమలు కిలో, గోధుమపిండి కిలో, 250 గ్రాముల కారంపొడి, అరకిలో చింతపండు, 100గ్రా పసుపు, కిలో అయోడైజ్డ్ ఉప్పు ప్యాకెట్‌ను దారిద్య్రరేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ 17న దీన్ని ప్రారంభించారు. పథకం ఆచరణలో విఫలం కావడంతో లబ్ధిదారులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. 2 నెలల నుంచి పూర్తి స్థాయిలో పథకం అమలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 9,10,385 రేషన్‌కార్డులుండగా, ఇందులో ఫొటో లేని రేషన్‌కార్డులు 20,970 ఉన్నాయి. 6,151 రేషన్‌కార్డులు పౌరసరఫరాల జాబితా నుంచి గల్లంతయ్యాయి. మొత్తం మీద 8,83,264 మంది కార్డుదారులకు పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఒంగోలు డివిజన్లో 924, కందుకూరు డివిజన్లో 751, మార్కాపురం డివిజన్లో 432 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి ద్వారా అమ్మహస్తం వస్తువులతో పాటు కిరోసిన్, బియ్యం అందజేస్తారు. ఫిబ్రవరి 22వ తేదీ నాటికి సైతం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం తదితర నియోజకవర్గాల్లోని మండలాల్లో కారంపొడి, పసుపు, చింతపండు, అయోడైజ్డ్ఉప్పు, గోధుమలు, గోధుమపిండి పంపిణీ కాలేదు. పౌరసరఫరాల శాఖాధికారులు డీలర్ల వద్ద నుంచి అమ్మహస్తం పథకంలోని అన్ని వస్తువులకు డీడీలు కట్టించుకుని సరఫరా చేయకపోవడంతో అటు డీలర్లు, సకాలంలో వసూలు కాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పౌరసరఫరాల శాఖ నివేదికల ప్రకారం మార్కాపురం పట్టణంలో 15,108 రేషన్ కార్డుదారులకు, రూరల్ పరిధిలో 11,614 కార్డుదారులకు, పెద్దారవీడులో 11,866, కంభంలో 10,728, గిద్దలూరులో 19,586, యర్రగొండపాలెంలో 16,899, బేస్తవారిపేటలో 13,011, కొండపిలో 11,998, కందుకూరు పట్టణంలో 11,837, అద్దంకిలో 24,094, పర్చూరులో 14,593, చీమకుర్తిలో 21,478, మద్దిపాడులో 13,967, సంతనూతలపాడులో 18,187 మంది రేషన్‌కార్డుదారులకు రేషన్ పంపిణీ చే యాల్సి ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో లబ్ధిదారులు తక్కువ ధరకు వస్తాయని ఎదురు చూసి చౌకధరల దుకాణాలకు వెళ్లి నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సకాలంలో రేషన్‌షాపులకు వస్తువులను సరఫరా చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారిణి వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. -
ఆదుకోని అమ్మహస్తం!
సాక్షి, కొత్తగూడెం: అమ్మహస్తం పథకం జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. తొమ్మిది రకాల సరుకులు అతి తక్కువ ధరకే అంటూ ప్రభుత్వం ఊదరగొట్టినా.. చివరకు నాణ్యత లేకపోవడంతో లబ్ధిదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. డీలర్లు కూడా కారం, చింతపండు, గోధుమ పిండికి ఆర్డర్ పెట్టకపోవడంతో జిల్లాలో మూడు నెలలుగా ఈ సరుకులు పంపిణీ కావడం లేదు. జిల్లాలో మొత్తం 7,68,538 తెల్ల రేషన్‌కార్డులున్నాయి. ప్రతినెల 10వతేదీలోపు సరుకులను లబ్ధిదారులకు అందజేయాలి. గతంలో బియ్యం, పామోలిన్, గోధుమలు, కిరోసిన్ లబ్ధిదారులకు అందజేసేవారు. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం అమ్మహస్తం పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ.185కే కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, పసుపు, పామోలిన్, కారం, ఉప్పు, చక్కెర, చింతపండు వంటి తొమ్మిది సరుకులు అందజేయనున్నట్లు ప్రకటించింది. బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలుచెప్పినా.. ఈహామీ నీటిమూటే అయింది. ప్రారంభంలో ఈసరుకులు బాగానే ఉన్నా రానురాను అసలే నాణ్యత లేకుండా పోయాయి. ప్రధానంగా చింతపండు నల్లగా ఉండడం, గోధుమ పిండిలో పురుగులు వస్తుండడం, కారం, పసుపు గడ్డ కడుతుండడంతో లబ్ధిదారులు వీటిని తీసుకునేందుకు ఇష్టపడడంలేదు. ఎలాగూ లబ్ధిదారులు తీసుకోవడం లేదని జిల్లాలో చాలా మంది డీలర్లు ఈ సరుకులకు డీడీలు కూడా తీయడం లేదు. లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నా.. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ఈ సరుకుల కొనుగోళ్లపై ప్రారంభంలో లబ్ధిదారులు ఆసక్తిచూపారు. అయితే అన్ని సరుకులూ నాణ్యత ఉండేలా చూడాలని లబ్ధిదారులు డీలర్ల వద్ద మొర పెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. చింతపండు నెలలుగా స్టాక్ ఉన్నది తేవడంతో వంట చేస్తే అసలు రుచే ఉండడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నాణ్యత లేని చింతపండును కొనుగోలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని లబ్ధిదారులు అంటున్నారు. ఇక పామోలిన్ ఏడాదిలో ఎప్పుడూ సక్రమంగా పంపిణీ చేయడం లేదు. ప్రధానంగా పండుగల సమయంలోనే ప్రభుత్వం లబ్ధిదారులకు రిక్తహస్తం చూపుతోంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చినా జిల్లాకు మాత్రం పామోలిన్ రాలేదు. ఎప్పుడూ కొరత ఉందన్న సాకుతో అధికారులు తప్పించుకుంటున్నారు. అయితే నిరుపేదలు మాత్రం కనీసం పండుగకు పామోలిన్ ఇవ్వారా..? అని ప్రశ్నిస్తున్నారు. సమీక్షలతోనే అధికారులు సరి.. సరుకుల నాణ్యత విషయంలో లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజాపంపిణీ విభాగానికి సంబంధించి మండల స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారే తప్ప.. అసలు సరుకుల్లో ఎందుకు నాణ్యత ఉండడం లేదన్న కోణంలో అధికారులు ఆలోచించడం లేదు. పామోలిన్‌కు లబ్ధిదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నా ఎప్పుడూ కూడా వారికి అవసరమైన రీతిలో పంపిణీ చేయలేదు. డీలర్లు పామోలిన్ ఉన్న సమయంలో కూడా తమకు ఇవ్వకుండా ఎక్కువ ధరకు బయట విక్రయిస్తున్నారని లబ్ధిదారులు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతవకలు లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్న మాటలు అప్పటివరకే పరిమితమని, రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అమ్మహస్తం పథకం సరుకులపై దృష్టిసారిస్తే పేదలకు ప్రయోజనం చేకూరుతుందని పలువురు కోరుతున్నారు. -
‘అమ్మహస్తం’..నిష్ర్పయోజనం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ హస్తం పథకం అటు ప్రజలకు ప్రయోజనం కల్పించకపోగా, ఇటు రేషన్ డీలర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ పథకం ద్వారా వారికి ఉపాధి సంగతి దేవుడెరుగు.. అసలుకే ఎసరు వస్తోంది. ఈ పథకం కింద పంపిణీ చేస్తున్న సరుకుల్లో నాణ్యత లేదంటూ వినియోగదారులు అనాసక్తి చూపిస్తున్నారు. దీంతో నెలల తరబడి స్టాకు అమ్ముడుపోక డీలర్లు తీవ్ర నష్టాలపాలవుతున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే సాధారణ సరుకులతో పాటు అదనంగా చింతపండు, పసుపు, మిర్చిపొడి, గోధుమ పిండి కలుపుకుని అమ్మహస్తం పథకం పేరిట రూ.185లకే తొమ్మిది సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఉగాది పండుగ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. అయితే మొదటి నెలలోనే సరుకుల నాణ్యతపై లబ్ధిదారుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అ యినప్పటికీ పరిస్థితి అనుకూలించక పోదా అనుకున్న డీల ర్లు.. ప్రస్తుతం సరుకుల పంపిణీ అంటేనే వణికిపోతున్నారు. చింతపండు బాగా లేదు... జిల్లాలో మొత్తం 10.24లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో 9.58లక్షలు తెల్ల రేషన్ కార్డులు కాగా, మిగిలిన 66వేల కార్డులు అంత్యోదయ కార్డులు. ప్రతి నెల అమ్మ హస్తం పథకం కింద ఒక్కో కార్డుదారునికి తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో బియ్యం, గోధుమలు, పామాయిల్, చక్కెర, ఉప్పు ప్యాకెట్లకు మాత్రమే డిమాండ్ ఉంది. గోధుమ పిండి, పసుపు, కారంపొడి, చింతపండు తీసుకోవటానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. చింతపండు వాసనలో తేడా ఉందని డీలర్లే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు పసుపు, కారంపొడిలో నాణ్యతలేదని కార్డుదారులు అంటున్నారు. దీంతో ఈ సరుకులకు డిమాండ్ లేకపోవడంతో నెలల తరబడి రేషన్ దుకాణాల్లోనే మూలన పడి ఉంటున్నాయి.ఈ సరుకులు తేవడానికి వెచ్చించిన డబ్బు వృథా అయిందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదాముల్లో మూల్గుతున్న సరుకులు... కార్డుదారులు తీసుకోకపోవడం, సరుకులు దుకాణాల్లోనే నిల్వ ఉంటుండటంతో కొత్త స్టాకు తీసుకోవడానికి డీలర్లు ముందుకు రావడం లేదు. దీంతో అవన్నీ పౌర సరఫరాల శాఖ గోదాముల్లో మూలుగుతున్నాయి. పరిగిలోని మినీ గోదాములో దాదాపు రూ.10లక్షల విలువ చేసే చింతపండు, కారంపొడి సంచులు నెలల తరబడి నిల్వ ఉన్నాయి. జిల్లాలోని పలు గోదాముల్లో ఇదే తరహాలో సరుకులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు రెగ్యులర్‌గా ఇచ్చే సరుకుల కోటాలో కోతలు పెట్టడంతో వినియోగదారులనుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలలుగా జిల్లాకు సరిపడా పామాయిల్ కోటా రావడం లేదు. దసరా పండగ నేపథ్యంలో పామాయిల్ స్టాకు లేకపోవడంతో పలు గ్రామాల్లో రేషన్ డీలర్లతో పలువురు వినియోగదారులు గొడవకు దిగడం గమనార్హం. నాసిరకం సరుకులిస్తున్నరు ‘అమ్మ హస్తం’ అంటూ తక్కువ ధరకే సరుకులను ఇస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ప్రచారం కోసమే రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఈ సరుకుల్లో నాణ్యత మాత్రం లేదు. పసుపు, చింతపండు, కారంపొడి నాసిరకంగా ఉంటున్నాయి. అందుకే వాటిని తీసుకోవడం లేదు. ప్రచారం కోసం చేసే ఖర్చులో కొంతైనా నాణ్యత పైన పెడితే మాకు సరుకులు మంచివి లభిస్తాయి. - భీంరామ్ నాయక్, కుర్మిద్ద తండా, యాచారం