మార్కాపురం, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన అమ్మ హస్తం పథకం పశ్చిమ ప్రకాశంలో అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పథకం ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులను తెల్లరేషన్ కార్డుదారులకు అందించాలని ప్రభుత్వం భావించింది. *185 లకే అరకిలో పంచదార, ఆయిల్ ప్యాకెట్, కంది పప్పు కిలో, గోధుమలు కిలో, గోధుమపిండి కిలో, 250 గ్రాముల కారంపొడి, అరకిలో చింతపండు, 100గ్రా పసుపు, కిలో అయోడైజ్డ్ ఉప్పు ప్యాకెట్‌ను దారిద్య్రరేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ 17న దీన్ని ప్రారంభించారు. పథకం ఆచరణలో విఫలం కావడంతో లబ్ధిదారులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. 2 నెలల నుంచి పూర్తి స్థాయిలో పథకం అమలు కావడం లేదు.
జిల్లా వ్యాప్తంగా 9,10,385 రేషన్‌కార్డులుండగా, ఇందులో ఫొటో లేని రేషన్‌కార్డులు 20,970 ఉన్నాయి. 6,151 రేషన్‌కార్డులు పౌరసరఫరాల జాబితా నుంచి గల్లంతయ్యాయి. మొత్తం మీద 8,83,264 మంది కార్డుదారులకు పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఒంగోలు డివిజన్‌లో 924, కందుకూరు డివిజన్‌లో 751, మార్కాపురం డివిజన్‌లో 432 చౌకధరల దుకాణాలున్నాయి. వీటి ద్వారా అమ్మహస్తం వస్తువులతో పాటు కిరోసిన్, బియ్యం అందజేస్తారు. ఫిబ్రవరి 22వ తేదీ నాటికి సైతం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం తదితర నియోజకవర్గాల్లోని మండలాల్లో కారంపొడి, పసుపు, చింతపండు, అయోడైజ్డ్‌ఉప్పు, గోధుమలు, గోధుమపిండి పంపిణీ కాలేదు. పౌరసరఫరాల శాఖాధికారులు డీలర్ల వద్ద నుంచి అమ్మహస్తం పథకంలోని అన్ని వస్తువులకు డీడీలు కట్టించుకుని సరఫరా చేయకపోవడంతో అటు డీలర్లు, సకాలంలో వసూలు కాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
పౌరసరఫరాల శాఖ నివేదికల ప్రకారం మార్కాపురం పట్టణంలో 15,108 రేషన్ కార్డుదారులకు, రూరల్ పరిధిలో 11,614 కార్డుదారులకు, పెద్దారవీడులో 11,866, కంభంలో 10,728, గిద్దలూరులో 19,586, యర్రగొండపాలెంలో 16,899, బేస్తవారిపేటలో 13,011, కొండపిలో 11,998, కందుకూరు పట్టణంలో 11,837, అద్దంకిలో 24,094, పర్చూరులో 14,593, చీమకుర్తిలో 21,478, మద్దిపాడులో 13,967, సంతనూతలపాడులో 18,187 మంది రేషన్‌కార్డుదారులకు రేషన్ పంపిణీ చే యాల్సి ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో లబ్ధిదారులు తక్కువ ధరకు వస్తాయని ఎదురు చూసి చౌకధరల దుకాణాలకు వెళ్లి నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సకాలంలో రేషన్‌షాపులకు వస్తువులను సరఫరా చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారిణి వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.
అమ్మహస్తం ...అస్తవ్యస్తం
Published Wed, Feb 26 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
Advertisement
Advertisement