సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రతి ఆరు నెలలకోసారి నూతన బియ్యం కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టింది. తొలి అర్ధ సంవత్సరం జూన్‌లో, చివరి అర్ధ సంవత్సరం డిసెంబర్‌లో.. అప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను అందిస్తోంది. తాజాగా 26 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 70,807 రైస్ కార్డులను మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి వీటిని పంపిణీ చేయనుంది.
ఈ మేరకు కార్డుల ముద్రణను దాదాపు పూర్తి చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1.39 కోట్ల కార్డులు మాత్రమే ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కార్డుల సంఖ్యను 1,45,43,996కు పెంచింది. వీటి కింద 4.24 కోట్ల మందికి 2.31 టన్నుల బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేవాటితో కలిపితే మొత్తం కార్డుల సంఖ్య 1,46,14,803 అవుతుంది. అదనంగా 1.66 లక్షల మందికి ప్రతి నెలా 8.30 లక్షల టన్నుల రేషన్‌ను పంపిణీ చేయనుంది.
ఇందుకుగాను ప్రభుత్వంపై నెలకు రూ.3.40 కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీతో పాటు, దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన(సార్టెక్స్) బియ్యం ఇస్తోంది. అందువల్ల ప్రతి నెలా 90 శాతానికి పైగా ప్రజలు రేషన్ తీసుకుంటున్నారు.
ఆరు దశల ధ్రువీకరణ ముఖ్యం
రాష్ట్రంలో బియ్యం కార్డుల మంజూరులో ప్రభుత్వం ఆరు దశల ధ్రువీకరణ(సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్) విధానాన్ని అవలంబిస్తోంది. ఇందులో అర్హులైతేనే కొత్త కార్డులిస్తోంది. ఈ క్రమంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో వెసులుబాటు కల్పించాం. వీటిపై వచ్చే దరఖాస్తులను సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పునఃపరిశీలన జరిపి అర్హులని తేలితే.. ఆ మేరకు సరిచేసి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం.
– హెచ్.అరుణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment