సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా బియ్యం కార్డుల మంజూరు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ప్రభుత్వం ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్‌లో అర్హులకు కొత్త కార్డులు అందజేస్తోంది. ఇప్పటివరకు 1,63,333 కొత్త రైస్ కార్డులకు ఆమోదం లభించగా తహసీల్దార్ల డిజిటల్ సంతకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తయిన వెంటనే కార్డులను ముద్రించి వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. జగనన్న సురక్షలో బియ్యం కార్డుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఈ దఫాలోనే కార్డులు అందించనున్నారు. దీనికి ఈ నెల 31వతేదీ వరకు అవకాశం కల్పించిన నేపథ్యంలో కొత్తగా జారీ చేసే బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరగనుంది.
కొత్తగా 3,81,061 మందికి లబ్ధి
రాష్ట్రంలో ఇప్పటివరకు 1.46 కోట్ల కార్డులకుగాను 4.25 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కొత్త కార్డుల మంజూరు ద్వారా అదనంగా 3,81,061 మందికి ప్రతి నెలా పీడీఎస్ ద్వారా లబ్ధి చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. నాణ్యమైన (సార్టెక్స్)బియ్యాన్ని ఇంటివద్దకే అందించడంతో ప్రతి నెలా రేషన్ తీసుకువారి సంఖ్య పెరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం ఇచ్చినా దాన్ని తినేవారు తక్కువగా ఉండేవారు.
పేదలకు ఇచ్చే బియ్యం ముక్కిపోవటం, పురుగులు పట్టడం, రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండటంతో పాటు గింజ రంగు మారిపోయేది. బియ్యాన్ని లబ్ధిదారులు శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడిస్తున్న నాణ్యమైన సార్టెక్స్ బియ్యం పేదల ఆకలి తీరుస్తోంది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన నాణ్యమైన రేషన్ బియ్యమే ఎంతో మంది పేదలను ఆదుకుంది. బియ్యం సార్టెక్స్ కోసం కిలోకు రూపాయి చొప్పున నెలకు రూ.20 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది.
పీడీఎస్ వ్యవస్థ బలోపేతం..
టీడీపీ హయాంలో రేషన్ సబ్సిడీపై రూ.13 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చూపినా పేదలకు ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు నాలుగేళ్లలో ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతమైంది. 100.13 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం, 2.99 లక్షల టన్నుల కందిపప్పు, 2.34 లక్షల టన్నుల పంచదారను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందుకు సుమారు రూ.23,680 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
పంచదార, కందిపప్పుపై గతంతో పోలిస్తే మూడు రెట్లకు పైగా సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. వీటికి తోడు 18 జిల్లాల్లో నాణ్యమైన బలవర్థక బియ్యాన్ని (ఫోర్టిఫైడ్) అందిస్తోంది. ఏప్రిల్ నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాగి, జొన్నలు, అన్ని మున్సిపాల్టీల్లో గోధుమ పిండి పంపిణీని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కేవలం జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డులకు మాత్రమే రేషన్ ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నాన్–ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకు సైతం రేషన్ సరఫరా చేస్తూ పేదలకు అండగా నిలుస్తోంది.
ఉచితంగా కిలో రూ.40 విలువైన బియ్యం
ఒకవేళ రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుందనే ఆందోళనతో కొందరు ప్రతి నెలా సరుకులు తీసుకుని దళారులకు విక్రయిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మంది కార్డుదారుల వాట్సాప్ నంబర్లకు వీడియో సందేశాలను చేరవేసింది.
ఎండీయూ వాహనాల ద్వారా కూడా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం కిలోకు రూ.40 చొప్పున ఖర్చు చేస్తూ పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ఇంత ఖరీదైన బియ్యాన్ని వృథా చేయకుండా ప్రజలు భోజనంగానే కాకుండా దోశలు, ఇడ్లీలు, మురుకులు, స్వీట్లు లాంటి చిరుతిళ్ల తయారీకి కూడా వినియోగించవచ్చని సూచిస్తోంది.
కార్డు రద్దు చేయడం లేదు..
రేషన్ తీసుకోకుంటే ఎక్కడా కార్డును రద్దు చేయడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార రేషన్‌ను ప్రజలు తక్కువగా చూడొద్దు. కొన్ని చోట్ల మధ్యవర్తులకు తక్కువ రేటుకు రేషన్ బియ్యన్ని విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. రేషన్ బియ్యం విక్రయాలు, అక్రమ రవాణాను పూర్తిగా అరికడతాం. కొత్త కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా జూన్, డిసెంబర్‌లో అర్హులకు కార్డులు మంజూరు చేస్తున్నాం. తాజాగా జగనన్న సురక్ష దరఖాస్తులను పరిశీలించి వారికి కూడా కార్డులు ఇస్తున్నాం.
– హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment