సాక్షి, రంగారెడ్డి జిల్లా :
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ హస్తం పథకం అటు ప్రజలకు ప్రయోజనం కల్పించకపోగా, ఇటు రేషన్ డీలర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ పథకం ద్వారా వారికి ఉపాధి సంగతి దేవుడెరుగు.. అసలుకే ఎసరు వస్తోంది. ఈ పథకం కింద పంపిణీ చేస్తున్న సరుకుల్లో నాణ్యత లేదంటూ వినియోగదారులు అనాసక్తి చూపిస్తున్నారు. దీంతో నెలల తరబడి స్టాకు అమ్ముడుపోక డీలర్లు తీవ్ర నష్టాలపాలవుతున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే సాధారణ సరుకులతో పాటు అదనంగా చింతపండు, పసుపు, మిర్చిపొడి, గోధుమ పిండి కలుపుకుని అమ్మహస్తం పథకం పేరిట రూ.185లకే తొమ్మిది సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఉగాది పండుగ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. అయితే మొదటి నెలలోనే సరుకుల నాణ్యతపై లబ్ధిదారుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అ యినప్పటికీ పరిస్థితి అనుకూలించక పోదా అనుకున్న డీల ర్లు.. ప్రస్తుతం సరుకుల పంపిణీ అంటేనే వణికిపోతున్నారు.
చింతపండు బాగా లేదు...
జిల్లాలో మొత్తం 10.24లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో 9.58లక్షలు తెల్ల రేషన్ కార్డులు కాగా, మిగిలిన 66వేల కార్డులు అంత్యోదయ కార్డులు. ప్రతి నెల అమ్మ హస్తం పథకం కింద ఒక్కో కార్డుదారునికి తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో బియ్యం, గోధుమలు, పామాయిల్, చక్కెర, ఉప్పు ప్యాకెట్లకు మాత్రమే డిమాండ్ ఉంది. గోధుమ పిండి, పసుపు, కారంపొడి, చింతపండు తీసుకోవటానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. చింతపండు వాసనలో తేడా ఉందని డీలర్లే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు పసుపు, కారంపొడిలో నాణ్యతలేదని కార్డుదారులు అంటున్నారు. దీంతో ఈ సరుకులకు డిమాండ్ లేకపోవడంతో నెలల తరబడి రేషన్ దుకాణాల్లోనే మూలన పడి ఉంటున్నాయి.ఈ సరుకులు తేవడానికి వెచ్చించిన డబ్బు వృథా అయిందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోదాముల్లో మూల్గుతున్న సరుకులు...
కార్డుదారులు తీసుకోకపోవడం, సరుకులు దుకాణాల్లోనే నిల్వ ఉంటుండటంతో కొత్త స్టాకు తీసుకోవడానికి డీలర్లు ముందుకు రావడం లేదు. దీంతో అవన్నీ పౌర సరఫరాల శాఖ గోదాముల్లో మూలుగుతున్నాయి. పరిగిలోని మినీ గోదాములో దాదాపు రూ.10లక్షల విలువ చేసే చింతపండు, కారంపొడి సంచులు నెలల తరబడి నిల్వ ఉన్నాయి. జిల్లాలోని పలు గోదాముల్లో ఇదే తరహాలో సరుకులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు రెగ్యులర్‌గా ఇచ్చే సరుకుల కోటాలో కోతలు పెట్టడంతో వినియోగదారులనుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలలుగా జిల్లాకు సరిపడా పామాయిల్ కోటా రావడం లేదు. దసరా పండగ నేపథ్యంలో పామాయిల్ స్టాకు లేకపోవడంతో పలు గ్రామాల్లో రేషన్ డీలర్లతో పలువురు వినియోగదారులు గొడవకు దిగడం గమనార్హం.
నాసిరకం సరుకులిస్తున్నరు
‘అమ్మ హస్తం’ అంటూ తక్కువ ధరకే సరుకులను ఇస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. ప్రచారం కోసమే రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఈ సరుకుల్లో నాణ్యత మాత్రం లేదు. పసుపు, చింతపండు, కారంపొడి నాసిరకంగా ఉంటున్నాయి. అందుకే వాటిని తీసుకోవడం లేదు. ప్రచారం కోసం చేసే ఖర్చులో కొంతైనా నాణ్యత పైన పెడితే మాకు సరుకులు మంచివి లభిస్తాయి.
- భీంరామ్ నాయక్, కుర్మిద్ద తండా, యాచారం
‘అమ్మహస్తం’..నిష్ర్పయోజనం!
Published Sun, Oct 13 2013 11:36 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement