రేషన్ రాలె! | Rachabanda do not have the goods coupon | Sakshi
Sakshi News home page

రేషన్ రాలె!

Published Tue, Dec 24 2013 2:25 AM | Last Updated on Wed, Jul 10 2019 8:02 PM

Rachabanda do not have the goods coupon

సాక్షి, మంచిర్యాల: జిల్లా వ్యాప్తంగా 6,54,782 రేషన్‌కార్డులు ఉన్నాయి. గత నెల 11న నిర్వహించిన రచ్చబండలో రేషన్‌కార్డులు లేని నిరుపేదలకు అధికారులు కూపన్లు అందజేశారు. ఈ కూపన్లపై బియ్యం, నూనె, చక్కెర, చింతపండు, ఉప్పు ఇవ్వాలి. రచ్చబండ కూపన్లు ఇచ్చిన తర్వాత జిల్లాకు బియ్యం, చ క్కెర కోటా పెరిగింది. పెరిగిన రచ్చబండ కార్డుదారులకు అనుగుణంగా సరిపడా కోటా మండల లెవల్ స్టాకిస్ట్(ఎంఎల్‌ఎస్) పాయింట్లకు చేరిందని పౌరసరఫరాల అధికారులు చెప్తున్నారు. కానీ, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కేవలం బియ్యం, చక్కెర మాత్రమే ఉండడంతో రేషన్‌డీలర్లు ఆ సరుకులు మాత్రమే తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. దీంతో రెండు సరుకులు ఇస్తుండడంతో పామాయిల్, పప్పు మిగతా సరుకుల కోసం లబ్ధిదారులు రేషన్‌డీలర్లను నిలదీస్తున్నారు.
 
 డీడీలు తీసేందుకు మొండికేస్తున్న డీలర్లు
 సాధారణంగా రేషన్‌డీలర్లు తమకు కేటాయించిన నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ప్రతి నెల 25వ తేదీలోగా డీడీలు తీసి అధికారులకు సమర్పిస్తారు. ఒకటో తేదీలోపు వారి రేషన్ కోట ఆయా షాపులకు చేరుతుంది. ఒకటో తేదీ నుంచి 15వ తేది వరకు డీలర్లు సరుకులు పంపిణీ చేస్తారు. అయితే.. చాలా ప్రాంతాల్లో రేషన్  డీలర్లు ఈ నెల పెరిగిన కోటా గురించి తెలియక పాత కోటా ప్రకారమే డీడీలు చెల్లించి సరుకులు తీసుకున్నారు. ఇంకొందరు పెరిగిన కోటా తీసుకునేందుకు నిరాసక్తత ప్రదర్శించారు. పాత కోటాకే సరిపడా డీడీ చెల్లించారు. మందమర్రి పట్టణంలో 1,134, మండలంలో 375 మందికి రచ్చబండలో కూపన్లు ఇచ్చారు. వీరిలో 16 మంది డీలర్లకు నాలుగైదు కార్డులలోపు కేటాయించారు. మిగిలిన వారికి 20 పైనే ఉన్నాయి. తక్కువ కార్డులున్న డీలర్లు గత నెలలో కూపన్ల సరుకులకు సంబంధించిన డబ్బులకు డీడీలు చెల్లించకుండా పాత కోటా ప్రకార మే డీడీ తీసి నిత్యావసర వస్తువులు పొందారు. దీంతో 60కిపైగా కూపన్‌దారులకు రేషన్ అందలేదు. నార్నూర్ మండలంలో 411 మందికి కూపన్లు జారీ చేస్తే.. ఒక్కరికి కూడా సరుకులు రాలేదు.
 
 కోటా విడుదల చేశాం..
 - వసంత్‌రావు దేశ్‌పాండే, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
 మూడో విడత రచ్చబండలో జారీ చేసిన కూపన్లకు సంబంధించిన సరుకులు విడుదల చేశాం. అయినా డీలర్లు సరుకులు ఎందుకు ఇవ్వడం లేదో మాకు తెలియదు. ఇప్పటి వరకు మాకు ఫిర్యాదులేవీ రాలేదు. కోటా మంజూరు చేయించుకున్న డీలర్లు  లబ్ధిదారులకు వెంటనే సరుకులు ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement