పండగకు పామాయిల్ లేనట్టే
=రావాల్సింది 1200 టన్నులు
=వచ్చింది 400 టన్నులు
=మున్సిపాలిటీల్లోకి పంపిణీ చేసే అవకాశం
=గ్రామాల్లో సంక్రాంతి నాటికి అనుమానమే
విజయవాడ సిటీ/ నూజివీడు, న్యూస్‌లైన్ : జిల్లాలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ ఏడాది ముఖ్యమైన పండగలకు ప్రభుత్వం పామాయిల్ సరఫరాకు ఎగనామం పెట్టింది. పర్వదినాలకు అదనంగా సరఫరా చేయాల్సి ఉండగా, అసలుకే ఎసరుపెట్టి పూర్తిగా బంద్ చేసింది. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్‌లో పామాయిల్ సరఫరాను పౌరసరఫరాల అధికారులు నిలిపివేశారు. జనవరి ఒకటో తేదీ నుంచి కనీసం మున్సిపాలిటీలకైనా సరఫరా చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పై నుంచి సరకు రాకపోయినా జిల్లాలో నిల్వ ఉన్న సరకును పోగుచేసి పట్టణాలకు పంపిణీ చేయాలని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్డుదారులకు సంక్రాంతి పండగకు కూడా పామాయిల్ అందే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. సింగపూర్ నుంచి షిప్పులో పామాయిల్ సరఫరాలో జాప్యం జరగటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలకు పామాయిల్ అందుబాటులో లేకపోవడం జిల్లాలోని పదిన్నర లక్షల తెల్ల కార్డుదారుల కుటుంబాలను నిరాశకు గురిచేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగానికి ముందస్తు వ్యూహం లేకపోవటం వల్లే పామాయిల్ సరఫరాకు ఆటంకం కలిగిందని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.
డీడీలు కట్టిన డీలర్ల అగచాట్లు...
జిల్లాలో డీలర్లు అందరూ పామాయిల్ కోసం ఈ నెల ఐదో తేదీలోగా డీడీలు చెల్లించారు. ప్రతి డీలరు తమ కోటాను బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కట్టారు. పదిన్నర లక్షల లీటర్ల పామాయిల్‌కు డబ్బు కట్టినా సరఫరా కాలేదని, తమ డీడీలు వేరే సరకుకు మార్చుకునేందుకు కూడా అధికారులు అనుమతించటం లేదని వారు చెబుతున్నారు.
నగరంలో డీలర్ల వద్దకు చేరిన పామోలిన్
విజయవాడ నగరంలో మాత్రం 1,90,825 కార్డుదారుల కోసం పామాయిల్ సరఫరా చేశారు. జిల్లాలో కొన్ని కేంద్రాలలో నిల్వ ఉన్న సరకును ఇక్కడికి తరలించారు. నగరంలో 205 దుకాణాలకు సరకును డీలర్లకు పంపారు. వచ్చే నెల ఒకటో తేదీ వరకు పామాయిల్ సరఫరా చేయొద్దని డీలర్లకు ఆదేశాలందాయి. సరకు వచ్చిందని తెలుసుకున్న వినియోగదారులు డీలర్లపై ఒత్తిడి చేస్తున్నారు.
400 టన్నులే వచ్చింది...
జిల్లాకు 1200 టన్నుల పామాయిల్ అవసరం ఉందని, డిసెంబర్‌కు 400 టన్నులు మాత్రమే వచ్చిందని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ చిట్టిబాబు తెలిపారు. దీంతో పామాయిల్‌ను తుపాను ప్రభావం పడిన తీరప్రాంత మండలాలకు, విజయవాడ అర్బన్‌కు పంపిణీ చేశామని చెప్పారు. దాదాపు 32 మండలాలకు ఈ నెలకు పామాయిల్ లేనట్టేనని తెలిపారు. సరకు వస్తే ఇక సంక్రాంతి ముందు ఇస్తామని చెప్పారు.