పామా..యిల్లే
నిలిచిపోయిన సరఫరా
ప్రజా పంపిణీ అస్తవ్యస్తం
నెలకో నిత్యావసర వస్తువుకు మంగళం
తెల్లకార్డుదారుల అవస్థలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తెల్లరేషన్ కార్డుదారులకు చుక్కలు చూపిస్తోంది. ఏ వస్తువు ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోను.. ప్రస్తుత రాష్ట్రపతి పాలనలోనూ దీనిని పట్టించుకున్న నాథులే లేకుండా పోయారు. నెలాకో నిత్యావసర వస్తువు సరఫరా నిలిచిపో తోంది. తాజాగా పామాయిల్ సరఫరా ఆగిపోయింది.
బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు వంటనూనెను కొనుగోలు చేయలేక కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో దాదాపుగా 12.5 లక్షల మంది తెల్లరేషన్‌కార్డుదారులు ఉన్నారు. వైఎస్ హయాంలో ప్రతినెలా నిత్యావసర సరుకులు సక్రమంగా సరఫరా అయ్యేవి. ఆయన మరణానంతరం ఈ పంపిణీ వ్యవస్థను రాజకీయ లబ్ధికి వినియోగించుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా అమ్మహస్తం పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.185కే తొమ్మిది సరుకులంటూ ఊదరగొట్టింది.
గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఒక్క నెల కూడా సక్రమంగా నిత్యావసర వస్తువులను కార్డుదారులకు అందించ లేదు. ప్రతి నెలా జిల్లాకు కేటాయింపులు తగ్గిస్తూ వచ్చింది. ఇప్పటికే కారం, పసుపు, చింతపండు కేటాయింపులను నిలిపి వేసింది. సరఫరా చేసే వస్తువుల్లో కూడా నాణ్యత లోపించడంతో కార్డుదారులు కొన్ని సరుకులపై అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉప్పు, గోధుమ పిండి అధ్వానంగా ఉండడంతో వాటిపై ప్రజలు ఆసక్తి చూపించడం లేదు.
ఒక్కోసారి కందిపప్పు కూడా బాగోవడం లేదని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా జిల్లాకు నెల నెలా కేటాయింపులు తగ్గిపోతూ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పటివరకు చౌక దుకాణాల ద్వారా కార్డుదారులు బియ్యం, పామాయిల్‌లనే అధికంగా తీసుకుంటున్నారు. తాజాగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. సాధారణంగా పామాయిల్‌ను మలేషియా నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది.
ఒక షిప్ పామ్‌క్రూడ్‌కు సుమారు రూ. 80 కోట్లు ఖర్చు చేస్తోంది. మలేషియా నుంచి ఆ షిప్ కాకినాడకు వస్తుంది. అక్కడ రిఫైన్ చేసిన తరువాత ప్యాకింగ్‌లు చేసి జిల్లాలకు సరఫరా చేస్తుంది. గత నెలలో పామాయిల్‌ను కొనుగోలు చేసే విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో పామాయిల్ సరఫరా నిలిచిపోయింది.
ఫలితంగా చౌక దుకాణాల్లో రూ.40జుజ లభించే ఈ వంటనూనెను కార్డుదారులు బహిరంగ మార్కెట్‌లో రూ.70 వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేద, బలహీనవర్గాల వారు అంత ధరకు నూనెను కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. వచ్చే నెలలో కూడా పామాయిల్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనిపై అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేదు.
ఎలా బతకగలం
రేషన్ డిపోలో ఆరునెలలుగా నూనె ఇవ్వడంలేదు. రూ. 40లకు ఇచ్చే దానిని బయట మార్కెట్‌లో రూ.70 లకు కొనుగోలు చేస్తున్నాం. అంచెలంచెలుగా సరుకులన్నీ ఇలాగే ఇవ్వడం మానేస్తే మాలాంటి పేదోళ్ళం ఎలా బతకగలం. ప్రభుత్వం రేషన్ గురించి పట్టించుకోవడంలేదు.
- అట్ట ఈశ్వరమ్మ, ఖాజీపాలెం
ఎప్పుడేమిస్తారో తెలియదు
రేషన్‌డిపోలో ఏ నెలలో ఎన్ని సరుకులు ఇస్తారో తెలి యడంలేదు. నూనె ఇవ్వడం మానేశారు. బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అధికారులు ఇవ్వడంలేదో డీలర్లు అమ్మేసుకుంటున్నారో అర్థం కాలేదు. పలానా సరుకులు ఇస్తామని అధికారుల చెప్పడంలేదు. డీలర్ల ఇష్టారాజ్యమైపోతోంది.
- సీరపు లక్ష్మి, మార్టూరు