చంద్రన్న కానుకలో మూడే సరుకులు!
5 వేలకు పైగా రేషన్‌కార్డులు గల్లంతు
వాకాడు :రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సంక్రాంతి పురస్కరించుకుని చంద్రన్న కానుకగా ఉచితంగా అందిస్తామన్న ఆరు సరుకులకు గాను మూడే సరుకులే అందాయి. నిరుపేద తెల్లరేషన్ కార్డుదారులందరికీ అరకేజీ బెల్లం, అర లీటరు పామాయిల్, 100గ్రా. నెయ్యి, అరకిలో కందిపప్పు, కిలో ముడి శనగలు, కిలో గోధుమ పిండి ఉచితంగా ఈ నెల 12 తేదీ లోపల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రేషన్‌షాపులకు కేజీ గోధుమపిండి, అర కేజీ పామాయిల్, కేజీ ముడిశనగలు మాత్రమే వచ్చాయి.
వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు సంబంధించి వాకాడులో ఉన్న ఎంఎల్‌ఎస్ పాయింట్‌కి మూడు సరుకులు మాత్రమే రావడం, పండగ దగ్గరకు రావడంతో వాటిని మూడు మండలాల్లోని 96 రేషన్ షాపులకు తరలిస్తున్నారు. వాస్తవానికి ఎంఎల్‌ఎస్ పాయింట్ పరిధిలో సుమారు 45 వేలకు పైగా తెల్లరేషన్ కార్డుదారులు ఉండగా చంద్రన్న సంక్రాంతి కానుక కోసం రూపొం దించిన నూతన జాబితాలో 39,929 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి.
సుమారు 5 వేలకు పైగా తెల్ల రేషన్‌కార్డు దారుల పేర్లు గల్లంతయ్యాయి. ఈ విషయమై సంబంధిత డిప్యూటీ తహశీల్దార్‌ను సంప్రదించగా మళ్లీ ఆధార్, రేషన్‌కార్డు జెరాక్స్‌లు అందజేస్తే ఆన్‌లైన్ చేస్తామని తెలిపారు. అయితే తిరిగి జాబితాలో వస్తే రావచ్చు, రాకపోవచ్చునని అంటున్నారు.