నెయ్యితో పప్పన్నం డౌటే!
ఏలూరు (టూటౌన్) :జిల్లాలోని తెల్లరేషన్ కార్డుల వారందరికి ఉచితంగా ఇవ్వనున్న చంద్రన్న కానుకలో భాగంగా కందిపప్పు అరకేజీ, పామాయిల్ అరకేజీ, బెల్లం అరకేజీ, నెయ్యి 100 గ్రాములు, గోధుమపిండి కేజీ, శనగలు కేజీతో కూడిన సంచి ఇవ్వాలని, ఈనెల 12వ తేదీ నాటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా 14 మార్కెట్ యార్డులలో రెండురోజుల పాటు ప్యాకింగ్ నిర్వహించినప్పటికీ పూర్తికాలేదు. బెల్లం ప్యాకింగ్‌కు ఇచ్చే చార్జి తమకు గిట్టుబాటు కాదని మహిళలు ప్యాకింగ్ మధ్యలో ఆపేశారు.
కందిపప్పు అరకేజీ ప్యాక్ చేసేందుకు 25 పైసలు, అరకేజీ బెల్లం ప్యాకింగ్‌కు 50 పైసలు చొప్పున ఇస్తామని అధికారులు చెప్పటంతో తమకు చాలదంటూ మహిళలు ప్యాకింగ్‌కు రావడానికి ఇష్ట పడటం లేదు. బెల్లం గడ్డలు పగులకొట్టి ప్యాకింగ్ చేయాలి కాబట్టి అరకేజీ ప్యాకింగ్‌కు రెండు రూపాయలు ఇవ్వాలని అడ గటంతో అధికారులు ఆ బాధ్యతలను డీలర్లకు అప్పగించారు. స్థానిక డ్వాక్రా మహిళలతో పాటు జన్మభూమి కమిటీలతో ప్యాకింగ్ చేయించుకుని ప్రజలకు అందించాలని అధికారులు డీలర్లను ఆదేశించారు. కానీ అధికారులు అనుకున్న స్థాయిలో ప్యాకింగ్ ముందుకు సాగటం లేదు. మంచినూనె మాత్రం అరకేజీ ప్యాకింగ్‌తో రావటంతో అధికారులకు కొంత ఊరట కలిగించింది. మిగిలిన ఐదు సరుకులు ప్యాకింగ్ చేయటమే అధికారులకు పెద్ద సమస్యగా మారింది.
అరకొరగా సరుకులు
జిల్లావ్యాప్తంగా 48 మండలాలలో 11లక్షల 27వేల 551 మందికి 2వేల 122 రేషన్ షాపుల ద్వారా చంద్రన్న కానుక అందించాల్సి ఉంది. దీనికి 570 టన్నుల బెల్లం అవసరం ఉండగా 370 టన్నులే అందుబాటులో ఉంది. మరో 200 టన్నుల బెల్లాన్ని రప్పించినా నాసిరకంగా ఉండటంతో అధికారులు శుక్రవారం ఏలూరు మార్కెట్ యార్డు నుంచి తిప్పి పంపేశారు. దాని స్థానంలో మంచి బెల్లాన్ని అర కేజీ ప్యాకింగ్ ద్వారా అందించాలని పంపిణీదారుడికి అధికారులు సూచించారు. శనగలు 1127 టన్నులు అవసరం కాగా 700 టన్నులు మాత్రమే వచ్చారుు. నెయ్యి 112 టన్నులకు 45 టన్నులు, కందిపప్పు 570 టన్నులకు 300 టన్నులు, గోధుమపిండి 1127 టన్నులకు 450 టన్నులు మాత్రమే వచ్చింది.
అధికారులకు తిప్పలు
సరుకుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ప్రజలు తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబర్ 9963479152ను కేటాయించారు. ప్రభుత్వం మరో రెండు రోజులు గడువు పెంచితే తమకు ఈ తిప్పలు తప్పేవని జిల్లాకు చెందిన ఒక అధికారి తన సిబ్బంది వ్యాఖ్యానించటం వెనుక అధికారులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అర్థమవుతుంది. ఆదివారం జిల్లాలో కొన్నిచోట్ల చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ లాంఛనంగా ప్రారంభించినా ఆరు సరుకులను మాత్రం అందించలేదు. కొన్నిచోట్ల మూడింటిని ఇచ్చి మిగిలినవి వచ్చాక ఇస్తాం అని డీలర్లు చెప్పారు.
పూర్తిస్థాయిలో సరుకులు సోమవారం వస్తాయి
చంద్రన్న కానుక కు ఇచ్చే సరుకులలో పామాయిల్ పూర్తి స్థారుులో వచ్చింది. మిగిలిన సరుకులు 70 శాతం వచ్చాయి. 30 శాతం సోమవారం ఉదయానికి వచ్చే ఏర్పాట్లు చేశాం. వచ్చిన వెంటనే ఆయా రేషన్‌షాపులకు పంపిస్తాం. కొంత ఆలస్యం అయినా పూర్తిస్థాయిలో తెల్లరేషన్‌కార్డు దారులందరికీ చంద్రన్న కానుక అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పెద్ద మొత్తంలో సరుకులు తీసుకువచ్చి ప్యాకింగ్ చేయూల్సి రావడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. జిల్లాకు ప్రస్తుతం వచ్చిన సరుకులన్నీ ప్యాకింగ్ నిమిత్తం డీలర్లకు పంపించి వేశాం. వారు డ్వాక్రా మహిళలు, జన్మభూమి కమిటీలతో ప్యాకింగ్ చేరుుస్తున్నారు.
- డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి