జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చౌక దుకాణాల్లో అందజేస్తున్న కందిపప్పును అరకొరగా ఇస్తూ.. ప్రభుత్వం లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. జిల్లాకు దాదాపు 2వేల టన్నుల కంది అవసరం కాగా.. అందులో నాలుగోవంతు మాత్రమే పంపిణీ చేశారు. ఫలితంగా పప్పన్నం కొందరికేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చిత్తూరు కలెక్టరేట్: ప్రతి తెల్ల రేషన్‌కార్డుకు కందిపప్పు అందించి, ఇంటింటా పప్పన్నం తినిపిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. జూలైకు అందించాల్సిన కందిపప్పు చౌక దుకాణాల్లో కానరాకపోవడమే ఇందుకు నిదర్శనం.
జిల్లాలో మొత్తం 2,880 చౌకదుకాణలు ఉన్నాయి. వీటిలో 11,07,810 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా ఈ కార్డుదారులకు ప్రభుత్వం ప్రజా పంపిణీ పేరుతో బియ్యం, చక్కెర, రాగులు అందిస్తోంది. వీటితో పాటు జూలై నుంచి ప్రతికార్డుకు 2 కిలోల చొప్పున కందిపప్పు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని కార్డులకు పంపిణీ చేయాలంటే 2,215 టన్నుల మేరకు కందిపప్పు అవసరం ఉంది. అయితే పౌరసరఫరాల శాఖ అధికారులు కేవలం 502 టన్నుల మేరకు మాత్రమే ఎంఎల్ పాయింట్లకు చేరవేశారు. అక్కడి నుంచి ఎంపిక చేసిన కొన్ని దుకాణాలకు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. వీటిలోనూ అధికశాతం కందిపప్పును చంద్రన్న మాల్స్‌కే తరలించడం గమనార్హం. దీంతో చౌక దుకాణాలకు వచ్చే కార్డుదారులందరికీ కంది పప్పు అందడం లేదు.
ఆదేశాలు తూచ్..
కందిపప్పును సరఫరా చేసుకునేందుకు డీలర్లు కేజీకి రూ. 39.50 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇంత మొత్తంలో డీలర్లు చెల్లించడం కష్టం అని భావించిన ప్రభుత్వం అప్పుగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఆయితే ఆ ఆదేశాలను జిల్లా అధికారులు బేఖాతర్ చేశారు. డీలర్లకు పూర్తిస్థాయిలో కందిపప్పు సరఫరా చేయలేకపోయారు. జిల్లాకు వచ్చిన 502 టన్నుల కందిపప్పు కేవలం 2.50 లక్షల కార్డుదారులకు మాత్రమే సరిపోతుంది. మిగిలిన 8.50 లక్షల కార్డుదారులు రిక్తహస్తాలు తప్పడం లేదు.
బకాయిల సాకుగా చూపి..
జిల్లాకు వచ్చిన 502 టన్నుల కందిపప్పును కూడా అధికారులు పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. డీలర్లు గతంలో తీసుకున్న నిత్యావసర సరుకులకు చెల్లించాల్సిన మొత్తాలు పెండింగ్‌లో ఉండడంతో కందిపంపిణీని నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాత బకాయిలు చెల్లిస్తేనే.. కంది పప్పు అందిస్తామని తేల్చి చెబుతున్నారు.
విమర్శల వెల్లువ..
గత ప్రభుత్వ హయాంలో ప్రజాపంపిణీ ద్వారా 12 రకాల నిత్యావసర సరుకులను అందించేవారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులకు క్రమేణా కోత విధిస్తూ వచ్చింది. ఆఖరుకు చౌకదుకాణాల ద్వారా కార్డుదారులకు బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. దీనిపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం అరకిలో చక్కెర, ఆతర్వాత రాగులు పంపిణీ చేస్తూ వస్తోంది. ఇక ఈ నెల నుంచి కందిపప్పు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేసింది. అయితే షాపులకు పూర్తిస్థాయిలో పప్పు సరఫరా చేయలేకపోయింది. దీంతో జిల్లా ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
బకాయిలు ఉన్న డీలర్లకు అందించలేదు..
జిల్లాలో ఇప్పటి వరకు 502 టన్నుల మేరకు కందిపప్పును ఎంఎల్ పాయింట్లకు అందించాం. అందులో బకాయిలు ఉన్న డీలర్లను మినహాయించి మిగిలిన వారికి మాత్రమే అందజేశాం. ఎన్ని చౌకదుకాణాలకు ఇవ్వలేదనే పక్కా సమాచారం మా వద్దలేదు.– మంజుభార్గవి,పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment