చౌకదుకాణాల్లో అక్రమాల జోరు
కనిపించని ఎలక్ట్రానిక్ తూకాలు
సమయపాలన సంగతి సరేసరి
పురుగుల బియ్యం, గింజల చింతపండు, నాశిరకం కారప్పొడి సరఫరా
సీఎం నియోజకవర్గంలో నాశిరకం ప్రయివేట్ వస్తువుల అమ్మకం
తెల్ల రేషన్‌కార్డుదారుల నిలువుదోపిడీ
జిల్లాలోని చౌక దుకాణాల్లో అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. సరుకులు సివిల్ సప్లయిస్ గోడౌన్ల ద్వారా పంపడం నుంచి రేషన్‌కార్డుదారుల సంచుల్లో నింపే వరకు ప్రతి చోటా దోపిడీ సాగుతోంది. చాలా దుకాణాల్లో నిబంధనలు అమలు కావడం లేదు. బోర్డుల్లో సరుకుల ధరలు, స్టాక్ వివరాలు, ఇచ్చే సమయం ప్రదర్శించాలి. కొన్ని వందల చౌకదుకాణాల్లో ఈ తరహా బోర్డులు లేవు. ఇస్తున్న సరుకులూ నాశిరకంగా ఉంటున్నాయి. డీలర్లు, రెవెన్యూ సిబ్బంది చాలా చోట్ల కుమ్మక్కై అక్రమాలకు పాల్పడి జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సాక్షి, చిత్తూరు:
జిల్లాలో 10.32 లక్షల తెల్లరేషన్‌కార్డుదారులు ఉన్నా రు. చౌకదుకాణాల ద్వారా వీరికి సరుకులు సక్రమంగా అందడంలేదు. కొందరు డీలర్లు, రెవెన్యూ సిబ్బంది అక్రమాలకు తెగబడుతున్నారు. తిరుపతి, మదనపల్లె, చిత్తూరు రెవెన్యూ డివిజన్లలో చాలా చోట్ల అమ్మహస్తం పథకంలో తొమ్మిది రకాల సరుకులు ఇవ్వడం లేదు. చింతపండు బయటమార్కెట్ కన్నా చౌకదుకాణంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. బియ్యం, పామాయిల్, చక్కెర, కందిపప్పు, గోధుమపిండి, గోధుమలకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఈ నెలలో 2,04,585 మందికి ఉప్పు పంపిణీ చేసేందుకు డీలర్లు డీడీలు కట్టారు. కారప్పొడి నాణ్యత సరిగ్గా ఉండదన్న భావనతో చౌకదుకాణ డీలర్లే డబ్బులు కట్టేందుకు ముందుకు రావడం లేదు. కేవలం 36,976 పసుపు ప్యాకెట్లకే ఇండెంట్ ఇచ్చారు. చింతపండుకు 1478 ప్యాకెట్లకు మాత్రమే డిమాండ్ ఉంది. పామాయిల్‌కు డిమాండ్ ఉన్నా 7,55,695 లీటర్లకే డీడీలు కట్టారు.
తూకాల్లో మోసాలు
ప్రతి నెలా 1 నుంచి 18వ తేదీ వరకు చౌకదుకాణాల్లో సరుకులను వినియోగదారులకు ఇవ్వాలి. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సరుకులు పంపిణీ చేయాలి. సరుకుల పంపిణీ చివరి తేదీ వరకు తెరిచే ఉంచాలి. అయితే డీలర్లు దుకాణాలు ఎప్పుడు తెరుస్తారో, మూస్తారో తెలియని పరిస్థితి చాలా పల్లెల్లో, పట్టణాల్లో నెలకొంది.
సుమారు 80 శాతం దుకాణాల్లో ఎలక్ట్రానిక్ తూకాలు లేవు. సరైన ప్రమాణాలు లేని తూకపురాళ్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో సరుకులు పక్కదారి పడుతున్నాయి. దీనికి సంబంధించి మండల సివిల్ సప్లయిస్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఎక్కడా లేదు. డీలర్లతో సత్సంబంధాలు ఉండడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో ఇలా..
పలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాలకు 177 చౌకదుకాణాలు ఉన్నాయి. ఎక్కడా సమయపాలన పాటించడం లేదు. ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు వాడడం లేదు. రేకు డబ్బాలు పెట్టి ఐదు కేజీలు, మూడు కేజీలు అని రాళ్లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ధరలు, సమయవేళల పట్టిక బోర్డుల మాటే లేదు. కిలో చింతపండును చౌకదుకాణంలో 29.75 రూపాయలకు విక్రయిస్తున్నారు. బయట మార్కెట్‌లో 20 రూపాయలకే అమ్ముతున్నారు. చౌక దుకాణాల్లోని చింతపండు స్టాక్‌కు పురుగులు ఉంటున్నాయి. దీంతో జనం ఇక్కడ చింతపండు కొనడం లేదు. జగమర్ల యానాది కాలనీ వాసులు 15 కిలోమీటర్ల దూరంలోని పలమనేరుకు వచ్చి సరుకులు తీసుకెళుతున్నారు. ఆరు రూపాయలు విలువ చేసే ఆరు కిలోల బియ్యం కోసం ఆటోలకు రూ.50 ఖర్చు పెడుతున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మండలంలో చౌకదుకాణాల్లో సరుకులు సరిగ్గా ఇవ్వడం లేదు. ప్రతి నెలా వారం రోజులు ఇస్తున్నారు. తర్వాత వెళితే వచ్చే నెలలో తీసుకోమంటారు. ఇతర వస్తువులూ తీసుకోవాలని ఇబ్బంది పెడుతున్నారు. సమయపాలన లేదు.
మదనపల్లె నియోజకవర్గంలో అమ్మహస్తం కింద 9రకాల సరుకులు రూ.185 ఇవ్వాలి. అయితే బి య్యం, చక్కెర, గోధుమపిండి, పామాయిల్ మా త్రమే ఇస్తున్నారు. డీల్లర్లు సమయపాలన పాటిం చడం లేదు. తూకాలు తక్కువ ఉంటున్నాయి.
తిరుపతిలోని జీవకోన, మంగళం, తిమ్మినాయుడుపాళెం తదితర చోట్ల చౌకదుకాణాల్లో ఒక నెలలో పామాయిల్ ఇస్తే మరుసటి నెలలో ఇవ్వడం లేదు. బియ్యం చాలా నాశిరకంగా ఉన్నాయి. అన్నం వండితే ముద్ద కడుతోంది. ఎక్కువగా మట్టిపెళ్లలు ఉంటున్నాయి.
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని చౌకదుకాణాల్లో చింతపండు, కారం, పసుపు సరాఫరా కావడం లేదు. ప్రజలు వీటిని అడగడం లేదని డీలర్లు చెబుతున్నారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్.ఆర్.పురం, పాలసముద్రం, జీడీ నెల్లూరు మండలాల్లోని అన్ని చౌకదుకాణాల్లో తొమ్మిది రకాల సరుకులు ఇవ్వడం లేదు. చింతపండులో గింజలు ఉంటున్నాయి. పసుపుపొడిలో నాణ్యత లేదు. మిరపపొడి తెల్లగా ఉందని వినియోగదారులు అడగడం లేదు. పెనుమూరు, కొత్తపల్లిమిట్ట, పచ్చికాపల్లం గ్రామాల్లో ఉదయం పూట చౌకదుకాణాలు తెరవడం లేదు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులోని ఒక దుకాణంలోనూ ఎలక్ట్రానిక్ తూకాలు లేవు. ఎక్కడా సమయ పాల న పాటిండచం లేదు. దీనిని రెవెన్యూ అధికారులూ పట్టించుకోవడం లేదు. పీలేరు టౌన్‌లోని కొన్ని చౌకదుకాణాల్లో అనధికారికంగా నాశిరకం ప్రయివేటు వస్తువులు తెచ్చి వినియోగదారుల నెత్తిన బలవంతంగా రుద్దుతున్నారు.
నగరి నియోజకవర్గంలో 194 దుకాణాలు ఉన్నాయి. పుత్తూరు మండలంలో ఏడు రకాల సరుకులే ఇస్తున్నారు. నగిరి పట్టణంలోనూ ఇదే పరిస్థితి. నిండ్రలో బియ్యం, చక్కెర, కిరోసిన్ మాత్రమే ఇస్తున్నారు.
}M>-âహస్తి నియోజకవర్గంలో 219 చౌకదుకాణాలు ఉన్నాయి. చింతపండు నాణ్యత ఉండడం లేదు. కిరోసిన్ నెల మార్చి నెల ఇస్తున్నారు. మగ్గిన బియ్యం అంటగడుతున్నారు. సమయ పాలన సంగతి సరేసరి. ఎలక్ట్రానిక్ తూకాల మాటేలేదు. గ్రామాల్లో పాత రాయిలను తూకాలుగా వినియోగిస్తున్నారు.