ఇక తెల్లకార్డులకు కత్తెర ...?
* ఏరివేతకు రంగం సిద్ధం
* జనవరిలో కొత్త కార్డులు
* రాజకీయ జోక్యం ఉంటే అర్హులకు అన్యాయం...
విజయనగరం కంటోన్మెంట్: ఇక రేషన్‌కార్డుల కోత ప్రారంభం కానుంది. ఇటీవల ఆధార్, సమగ్ర విచారణ వంటి వంకతో వేలాది మంది నిరుపేద పింఛనర్లను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులపై దృష్టి సారించింది. అర్హత లేని వారికి కూడా తెల్ల రేషన్ కార్డులున్నాయనే నెపంతో భారీగా తెల్ల రేషన్‌కార్డులను తగ్గించుకోనుంది. పింఛన్ల ఏరివేతకు అనుసరించిన విధానంలాగే సర్వే చేపట్టనున్నారు. ప్రస్తుతం అధికారుల బదిలీల పర్వం నడుస్తుండడంతో అది పూర్తయ్యాక అనర్హుల ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించి, జనవరిలో కొత్త కార్డులను ఇవ్వనున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్‌లో సర్వే నిర్వహించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జనవరిలో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 7,05,592 రేషన్ కార్డులున్నాయి.
ఇందులో 44,296 పింక్ రేషన్ కార్డులు కాగా, మిగతా 6,61,296 తెల్ల రేషన్ కార్డులు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న తెల్ల రేషన్ కార్డుదారుల్లో చాలా మంది అనర్హులున్నారని ప్రభుత్వం భావిస్తోంది. 10 నుంచి 30 ఎకరాల సాగు భూములున్నవారు, నెలకు రూ.20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ లావాదేవీలు నిర్వహిస్తున్న వ్యాపారులు, వేలాది రూపాయల జీతాలు పొందుతున్న ప్రైవేటు ఉద్యోగులతో పాటు వేలాది మంది ధనిక వర్గీయులు తెల్ల రేషన్ కార్డులు పొందారని, వారందరికీ కార్డులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని భోగట్టా! ఇప్పటికే గతంలో నిర్వహించిన రచ్చబండలోనూ, ప్రస్తుతం నిర్వహించిన జన్మభూమిలోనూ వేలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా పెళ్లయిన వారు, త ల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు.
అసలు జిల్లాలో ఉన్న జనాభాకు, రేషన్ కార్డులకూ పొంతన లేకుండా ఉంది. జనాభాకూ, రేషన్ కార్డుల్లోని యూనిట్లతో(రేషన్ కార్డుల్లోని కుటుంబ సభ్యుల సంఖ్య) పోలిస్తే ఎక్కువగా ఉండడంతో అప్పట్లో యంత్రాంగం కలవరపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో దాదాపు 17వేల కార్డులు రద్దయ్యాయి. ఇంకా డీలర్ల వద్ద, ఇతర వ్యాపారుల వద్ద వేలాది కార్డులు బోగస్‌వి, తనఖా కార్డులు కూడా ఉన్నాయని అంటున్నారు.
రాజకీయ ప్రమేయం లేకుండా సాధ్యమా?
జిల్లాలో కొత్త రేషన్ కార్డులకు తెర లేచినా, పాత కార్డులను రద్దు చేసినా రాజకీయ నాయకుల పైరవీలు, పెత్తనాలు తప్పవు. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ఉన్నవారి కార్డులను ఉంచేసి అనుకూలం కాని వారి కార్డులను రద్దు చేసే పరిస్థితులున్నాయి. ఇటీవల పింఛన్ల విషయంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అదే జరిగే మళ్లీ పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.