తెల్లకార్డుంటేనే సీఎం రిలీఫ్‌ఫండ్
- కఠిన నిబంధనలతో మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
- ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ షరతు
- ‘ఆరోగ్యశ్రీ’లో పేర్కొనని రోగాలకే సీఎంఆర్‌ఎఫ్
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్ కార్డు ఉండడంతోపాటు, ఆరోగ్యశ్రీలో పేర్కొనని రోగాలకే ఇక మీదట ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్) నుంచి సాయం అందుతుంది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పొందే సాయం చాలావరకు దుర్వినియోగం అవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నవారు రూ.2 లక్షల వరకూ ఉచితంగా వైద్యం చేయించుకుంటున్నారు.
ఈ రెండు లక్షల రూపాయలకు మించితే అదనపు సాయానికి ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా వచ్చిన మార్గదర్శకాల ప్రకారం అలాంటి సాయం ఇకపై అందదు. దీనికి సంబంధించి అత్యంత కఠిన నిబంధనలకు ప్రభుత్వం రూపొందించింది. సీఎంఆర్‌ఎఫ్ నుంచి అర్హులకే సాయం అందేలా ప్రభుత్వం వివిధ రకాలుగా విచారణ జరిపించింది.
థర్డ్‌పార్టీ ద్వారా తటస్థ విచారణ నిర్వహించింది. వీటన్నింటి అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్‌పై ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ఆ నివేదిక ప్రకారం మార్గదర్శకాలు విడుదల చేసింది. వైద్య చికిత్సకు ముందుగా అనుమతి తీసుకోవడం, చికిత్స అనంతరం బిల్లులు సమర్పించడం, ఆర్థిక సాయం కోరడం వంటివి వాటిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది.
మార్గదర్శకాలు ఇవీ...
తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు.
లబ్ధిదారుడికి ఆధార్ కార్డు ఉండాలి.
సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు ఫారంతోపాటు తాజా ఫొటో, ఫోన్ నంబర్, రోగి సంతకం ఉండాలి. దాంతోపాటు దరఖాస్తులో అన్ని వివరాలు నింపాలి.
మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, జిల్లా కలెక్టర్లలో ఎవరైనా ఒకరి సిఫారసు లెటర్ ఉండాలి.
రోగి ఒరిజినల్ తుది బిల్లు వివరాలు సమగ్రంగా ఉండాలి.
ముందస్తు, తుది నగదు చెల్లింపు ఒరిజినల్ రశీదు ఉండాలి.
ఒరిజినల్ మందుల బిల్లులు ఉండాలి.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఉండే ఒరిజినల్ కాపీ, చికిత్స వివరాలు, పొడిగింపు వివరాలు ఉండాలి.
చికిత్సకు ముందు, తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలు, రికార్డులు సమర్పించాలి.
ఒరిజినల్ బిల్లులపై మెడికల్ సూపరింటెండెంట్, డెరైక్టర్, సంబంధిత డాక్టర్ స్టాంప్, సంతకం, రిజిస్ట్రేషన్‌లలో ఏదో ఒకటి సమర్పించాలి.
గరిష్టంగా ఆరు నెలల కాలపరిమితి ఉన్న బిల్లులనే అనుమతిస్తారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రుల బిల్లులనే పరిగణలోకి తీసుకుంటారు.
ఔట్‌పేషెంట్ బిల్లులను పరిగణించరు.
చనిపోయిన రోగికి సంబంధించి పూర్తి వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలి. మెడికల్ సూపరింటెండెంట్ లేదా సంబం ధిత అధికారి సంతకంతో పత్రం ఇవ్వాలి.
ఏదైనా పథకం కింద ఆర్థిక సాయం పొందినట్లయితే దాన్ని పరిగణలోకి తీసుకోరు.