జిల్లాలో 5,30,700 తెల్ల రేషన్ కార్డులున్నాయి. వాటిలో విశాఖలో 15 లక్షల 44 మందికి 3,75,011 కార్డులుండగా.
గ్రాస్ డొమెస్టిక్ ప్రోగ్రెస్ (జీడీపీ)లో దూసుకుపోతున్న విశాఖ జిల్లాలో కిలో రూపాయి బియ్యంతో కడుపు నింపుకునే నిరుపేదలు కూడా ఉన్నారు. ప్రతి నెలా చౌక దుకాణం వద్ద క్యూలో నిలబడి రేషన్ తెచ్చుకుంటేనే వారికి రోజులు గడిచేది. అలాంటి వారికి అందాల్సిన బియ్యం, పంచదార, గోధుమలను పక్కదారి పట్టిస్తూ కొందరు డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు అనేక నిబంధనలతో ప్రభుత్వం రేషన్ కార్డులను తొలగించి పేదలను పస్తులుంచుతోంది. అంతేకాకుండా నెల నెలా రావాల్సిన కోటాను తగ్గించేస్తూ ఆ మేరకు రేషన్‌లో కోత విధిస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో 5,30,700 తెల్ల రేషన్ కార్డులున్నాయి. వాటిలో విశాఖలో 15 లక్షల 44 మందికి 3,75,011 కార్డులుండగా. 14,75,443 మంది ఆధార్ సీడింగ్ చేయించుకున్నారు. సరైన వివరాలు లేకపోవడంతో 9,714 మందికి ఆధార్ కార్డులు మంజూరు చేయలేదు. 14,877 మంది ఆధార్ కార్డులు తీయించుకోలేదు. రూరల్ పరిధిలో 1,55,689 కార్డులుండగా 1,47,904 కార్డులకు ఆధార్‌ను అనుసంధానించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అంటే 7,785 కార్డులకు ఆధార్ సీడింగ్ జరగలేదు.
ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 32,376 మందికి ఆధార్ లేని కారణంగా రేషన్ ఇవ్వడం లేదు. ఆధార్ కార్డు ఉంటేనే సరకులు ఇస్తామని ప్రభుత్వం నిబంధన విధించడంతో పేదలకు కోటా బియ్యం కూడా అందడం లేదు. ఆధార్ ఉన్నా కోటా తక్కువగా ఉండటంతో పంచదార, గోధుమలు ఇవ్వడం లేదు.
విశాఖ పరిధిలో రేషన్ తెల్లకార్డులకు 5603.906 మెట్రిక్ టన్నులు, అంత్యోదయ కార్డులకు 281.601 మెట్రిక్ టన్నులు, అన్నపూర్ణ కార్డులకు 4.750 మెట్రిక్ టన్నులు బియ్యం ఇస్తున్నారు. 5890.257 మెట్రిక్ టన్నులు ఇస్తున్నారు. నిజానికి దాదాపు 6200 మెట్రిక్ టన్నులు అవసరం. 1,87,541 కిలోల పంచదార అవసరం కాగా 1,83,377 కిలోలు ఇస్తున్నారు. 4,164 కిలోల కొరత ఉంది. గోధుమలు 11,21,009 కిలోలు అవసరం కాగా 11,18,619కిలోలు ఇస్తున్నారు. 2,390 కిలోలు కొరత ఉంది.
- రూరల్ పరిధిలో 6వేల మెట్రిక్ టన్నులు బియ్యం ఇస్తున్నారు. కానీ ఇక్కడ కార్డుదారులందనికీ ఇవ్వాలంటే మరో 400 మెట్రిక్ టన్నులు అవసరం.
- 3,72,963.5 కిలోల పంచదార అవసరం కాగా 3,72,201 కిలోలు సరఫరా చేస్తున్నారు. 762.5 కిలోలు కొరత ఉంది. గోధుమలు 7,45,927 కిలోలు అవసరం కాగా 7,45,386 కిలోలు ఇస్తున్నారు. 541 కిలోల కొరత ఉంది.అంటే ఆ మేరకు పేదలకు ఇవ్వాల్సిన కోటాలో కోత పెడుతున్నారు.