విశాఖలోని ‘గైస్’లో డిప్లమో కోర్సులకు అవకాశం
మరోరెండు ప్రయివేటు కాలేజీలకూ సాయంకాలం కోర్సులకు అనుమతి
పదోన్నతులు పొందాలనుకున్న వారికి అరుదైన అవకాశం
మురళీనగర్(విశాఖ ఉత్తర): పరిశ్రమలు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారు పదోన్నతులు పొందేందుకు గాను తమ విద్యార్హతలను పెంచుకునే అవకాశం లభిస్తే.. భలే ఉంటుంది కదూ. డిప్లమో కోర్సులను సాయం కాలం చదివే అరుదైన అవకాశం విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇస్టిట్యూట్(గైస్) అందిస్తోంది.
రాష్ట్రంలో 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా సాయంకాలం కోర్సులు నిర్వహణకు విశాఖలోని గైస్‌ను ఏఐసీటీఈ ఎంపిక చేయడం విశేషం. అలాగే మరో రెండు ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలలు.. బెహరా(నరవ), ప్రశాంతి(అచ్యుతాపురం)లలోనూ సాయంత్రం కోర్సుల నిర్వహణకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతిచ్చిoది.
వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు
కెమికల్ ఇంజనీరింగ్, పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ విభాగాల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌గా 2024–25 విద్యా సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు కోర్సులను నవంబర్ 1న ప్రారంభిస్తారు. ప్రతి కోర్సులోనూ 33 సీట్లుండగా.. వీటిలో 3 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఉంటాయి.
వీరు ఈ నెల 21 నుంచి 26వ వరకు సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బెహరా పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్, మెకానికల్, ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీ(అచ్యుతాపురం)లో సివిల్ , మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు.
టైమింగ్స్: రోజూ సాయంత్రం 6.30 నుంచి 9 గంటల వరకు, ఆదివారం, సెలవు దినాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 వరకూ తరగతులు నిర్వహిస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన పరిశ్రమల్లో, లేదా కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో, ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇంటర్ ఎంపీసీ/ బైపీసీ/ఐవీసీ/లేదా ఐటీఐ సర్టిఫికెట్‌తో కెమికల్ ప్లాంట్ మెయింటెనెన్స్ మెకానిక్/అటెండెంట్ ఆపరేటర్, లేబొరేటరీ అసిస్టెంట్/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ తదితర విభాగాల్లో ఏడాది రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తూ.. పై 3 కళాశాలకు 50 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నెల 26 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.
Comments
Please login to add a commentAdd a comment