అమ్మో ఏపీకా? | IT giants say bye to Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అమ్మో ఏపీకా?

Published Sat, Jul 6 2024 5:00 AM | Last Updated on Sat, Jul 6 2024 5:00 AM

IT giants say bye to Andhra Pradesh

వద్దు బాబోయ్‌.. అంటూ ముఖం చాటేస్తున్న ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు 

విశాఖకు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయిన ప్రముఖ సంస్థ క్యాప్‌జెమినీ 

ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు జడిసిన ఐటీ దిగ్గజం 

రూ.1000 కోట్లతో చెన్నైలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన 

5 వేల మంది ఉద్యోగులతో నడిచేలా 2027 నాటికి ఏర్పాటు 

విశాఖలో ఉండాల్సిన కంపెనీ తరలిపోవడానికి టీడీపీ అరాచకాలే కారణం 

వరుస దాడులతో బెంబేలెత్తుతున్న వివిధ సంస్థల ప్రతినిధులు 

ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రోజూ విధ్వంసాలే 

పరిశ్రమలపైనా దాడులు, వ్యాపారులకు బెదిరింపులు 

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యునైటెడ్‌ బ్రూవరీస్‌ ఫ్యాక్టరీపై దాడి 

మామూళ్లివ్వలేదని దాల్మియా సిమెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల ధ్వంసం 

మేం ఫలానా వాళ్ల తాలూకా అంటూ వాహనాలపై పేర్లు రాసుకుని బెదిరింపులు  

సాక్షి, విశాఖపట్నం : పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడదామనుకున్న వారు మరో దారి చూసుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌తో వెలుగులీనిన విశాఖ నగరం... ఇప్పుడు విలవిల్లాడుతోంది. 

ఒక్క విశాఖ నగరమే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ వైపు ఐటీ పరిశ్రమలు రావాలంటేనే మొహం చాటేస్తున్నాయి. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలంటే.. అమ్మో.. ఏపీకా.. అంటూ భయపడుతున్నాయి. నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని నిశి­తంగా పరిశీలిస్తున్న ఐటీ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్‌కుబై బై చెబుతున్నాయి. విశాఖలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభించేందుకు సుముఖంగా ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమినీ ఇప్పుడు వెనకడుగు వేసి, చెన్నైకి చెక్కేసింది. 

ఆరు నెలలుగా విస్తరణ పనులు చురుగ్గా నిర్వహించిన విప్రో కూడా ఆలోచనలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు, విధ్వంసాలు, పారి­శ్రామికవేత్తలకు బెదిరింపులు, హింసా వాతావరణంతో ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల ప్రతినిధులు, ఇతర పెట్టుబడిదారులు జంకుతున్నారు. 

ఒక్కసారిగా కుదుపు
విభిన్నమైన ఐటీ పాలసీని మెచ్చి.. గత మూడేళ్లుగా దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఏపీలో పెట్టు­బడులు పెడుతూ ముందుకొచ్చాయి. ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్‌ఎస్, అమెజాన్‌ వంటి సంస్థలు వరుసగా క్యూ కట్టాయి. దివంగత వైఎస్సార్‌ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ.. ఆరు నెలల క్రితం కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నట్లు ప్రక­టించింది. 

ఇలా.. దిగ్గజ కంపెనీల­న్నీ.. ఏపీలో శాఖ­­లు విస్తరించేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ప్రభుత్వం మారిన తర్వాత.. ప్రశాంత వాతావరణం కాస్తా.. అశాంతి వాతావరణంగా మారడంతో అన్ని సంస్థలూ పునరాలోచనలో పడిపోయాయి. ఏపీలో అడు­గు పెట్టాలంటేనే ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు భయ­ప­డిపోతున్నాయి. ఇందుకు క్యాప్‌జెమినీనే ఉదాహరణ. 

అడుగడుగునా దాడులు.. బెదిరింపులు 
నెల రోజులుగా రాష్ట్రంలో వరుస దాడులు అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార దిగ్గజాలను బెం­బేలె­త్తిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపైనే కాకుండా వ్యాపార సంస్థలపై కూడా వరుస దాడులు జరిగాయి. రైస్‌ మిల్లులు, ఫ్యాక్ట­రీలను మూయిస్తున్నారు. నిన్నటికి నిన్న   మామూ­ళ్లివ్వలేదని దాల్మియా సిమెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనా­లను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ‘మామూళ్లు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి.. మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే’ అంటూ ట్రాన్స్‌­పోర్ట్‌ సంస్థల యజమానులను టీడీపీ నాయకులు బెదిరించారు.  

నిజాయితీగా వ్యా­పా­రం చేసుకుంటున్న తామెందుకు డబ్బులివ్వాలని ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులు ప్రశ్నించడంతో ఏకంగా 11 లారీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లా వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజక­వర్గం మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడి దాల్మియా సిమెంట్‌ ఫ్యాక్టరీలోకి ప్రతిరోజూ వివిధ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలకు చెందిన వందలాది లారీలు సిమెంట్‌ రవాణా కోసం వస్తుంటాయి. కొన్ని రోజు­లుగా ఈ కంపెనీల యజమానులను టీడీపీ నాయ­కులు మామూళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

వారు పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకుని లారెన్స్‌ ట్రాన్స్‌­పోర్ట్‌కు చెందిన 11 లారీల అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. వెంటనే మామూళ్లు ఇవ్వక­పోతే మిగతా కంపెనీల లారీలకూ ఇదే గతి పడు­తుందని హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగి­రిలో ఓ రైస్‌ మిల్లును మూయించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని యునైటెడ్‌ బ్రూవరీస్‌ ఫ్యాక్టరీపై దాడి చేశారు. ముడి సరుకు తీసుకొస్తున్న లారీలను ఆపేశారు. ఊరూరా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను పగులగొడుతు­న్నారు. ఊళ్లొదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. 

వ్యాపారాల్లో ఉచిత వాటాలు కోరుతూ.. ఒప్పుకోని వారిపై కక్షగట్టి దాడులు చేస్తున్నారు. మేం ఫలానా వాళ్ల తాలూకా.. మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూ­కా.. మేం లోకేశ్‌ తాలూకా.. అంటూ బండ్లు, వాహ­నాలపై పేర్లు రాసుకుని బెదిరింపులకు దిగుతుండటం కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల బండ్ల నంబర్‌ ప్లేట్లు తీసేసి ఇలా రాసుకుని తిరుగుతూ వ్యాపారులను, ప్రజలను భయపెడుతున్నారు. 

అందుకే పలు సంస్థలు మరో దారి 
రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఇప్పటికే ఇక్కడకు రావాలని నిర్ణయించిన పలు సంస్థలు మరో దారి చూసుకుంటున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం సాహసమే అవుతుందని ఆలోచిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేసే విషయమై.. దేశంలోని ఇతర నగరాలకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. లక్నో, ఇండోర్, జైపూర్, కొచ్చి, నాగ్‌పూర్, చండీగఢ్‌ తదితర నగరాలవైపు అడుగులు వేస్తున్నాయి. విస్తరణ పనులు చురుగ్గా నిర్వహించిన విప్రో సంస్థ కూడా.. పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. 

వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విస్తరించేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్రంలో పరిస్థితి వారిని కలవరపెడుతోందని సమాచారం. కొన్నాళ్లు వేచి చూసి.. తదుపరి నిర్ణయం తీసుకోవాలని విప్రో ప్రతినిధులు భావిస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని ఐటీ అనుబంధ సంస్థలు, బీపీవోలు కూడా విశాఖలో శాఖలు ఏర్పాటు చేయాలని భావించినా, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయని ఐటీ రంగ ప్రముఖుడొకరు తెలిపారు. అధికార పార్టీ నేతల తీరు వల్ల ఐటీ రంగం మళ్లీ కునారిల్లే దుస్థితి వచ్చిందని ఐటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విశాఖ కంటే.. చెన్నై బెటర్‌ 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐటీ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, బీచ్‌ ఐటీ కాన్సెప్ట్‌తో ఆకర్షితులైన సంస్థలు తమ కార్యక లా­పాల్ని సాగరనగరిలో విస్త­రించేందుకు గతంలో సన్నద్ధమైంది. క్యాప్‌ జెమినీ సంస్థ కూడా తమ శాఖను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఇతర నగరాల్లో కార్యకలాపాలను విస్త­రించేందుకు ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల మధ్య క్యాప్‌ జెమినీ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ జాబితాలో వైజాగ్‌ని కూడా చేర్చింది. క్యాప్‌­జెమినీలో పని చేస్తున్న వారిలో ఇప్పటి వరకు సింహభాగం ఉద్యోగులు విశాఖను ఎంపిక చేసుకున్నారు. 

గతంలో ఇన్ఫోసిస్‌లో కూడా ఇదే విధమైన సర్వే చేశారు. ఫిబ్రవరిలో క్యాప్‌ జెమిని సంస్థ ప్రతినిధులు సైతం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. త్వర­లోనే విశాఖలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్లు క్యాప్‌జెమినీ సంస్థ సూత్ర­ప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే నెల రోజులుగా రాష్ట్రంలో పరిస్థితుల్ని పరిశీలించిన సంస్థ.. చెన్నైలో విస్తరణ కార్యక­లాపాలు ప్రారంభి­స్తున్నట్లు ప్రకటించింది. 

రూ.1,000కోట్ల పెట్టు­­­బడితో 5 వేల మందికి ఉపాధి అవకా­శాలు కల్పించేలా 2027నాటికి డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సంస్థ గతంలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో అను­కూల వాతా­వరణం కని­పించి ఉంటే కచ్చితంగా ఈ సంస్థ శాఖ విశాఖలో విస్తరించేది. టీడీపీ, జనసేన నేతల దాడులు, విధ్వంస పర్వంతో రాష్ట్రంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తుండటంతో ఇది సరైన వేదిక కాదని మానసు మార్చుకుని క్యాప్‌జెమినీ సంస్థ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement