పండగ కొందరికేనా...
మంగళగిరి/ తెనాలి అర్బన్ : చంద్రన్న సంక్రాంతి కానుక ఆచరణలో అభాసుపాలైంది. రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం అస్తవ్యస్తంగా మారింది. సంక్రాంతికి తెల్లరేషన్ కార్డుదారులకు ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పేరిట ఆరు రకాల సరకులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పేద ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన పథకం లబ్ధిదారులకు నిరాశే మిగిల్చింది.
పథకంలో భాగంగా బెల్లం, కందిపప్పు, పామాయిల్ అరకేజీ చొప్పున, గోధుమపిండి, శనగలు కిలో చొప్పున, వంద గ్రాముల నెయ్యి చంద్రబాబు ఫొటోలతో ముద్రించిన బ్యాగ్ ల్లో సిద్ధం చేశారు. ఈ సరుకుల కోసం లబ్ధిదారులు ఆదివారం ఉదయం 7 గంటల నుంచే రేషన్‌షాపుల వద్ద ఎండలోనే నిలబడి ఇబ్బందులు పడ్డారు. పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చే ప్రజాప్రతినిధుల కోసం గంటల తరబడి నిరీక్షించారు. జిల్లాలో కొన్ని చోట్ల మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం ప్రారంభించకపోవడంపై పేదలు అసహనం వ్యక్తం చేశారు.
చంద్రన్న కానుక పంపిణీ చేస్తామని ఆర్బాటంగా అధికారులు ప్రచారం చేసినా కొందరు డీలర్లు అసలు దుకాణాలే తెరవలేదు. కొన్ని చోట్ల ఈ పంపిణీ వ్యవహారం తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలా సాగింది. పలు గ్రామాల్లో ప్రధానంగా మంగళగిరిలో రేషన్‌షాపుల వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులపై పెత్తనం చెలాయించారు. నాయకులు వచ్చేవరకు సరుకులు ఇవ్వకుండా గంటల కొద్దీ మహిళలను నిలబెట్టారు.
నాణ్యత లేని సరుకులు..
ఉచితంగా అందజేసిన నిత్యావసర సరకులు లబ్ధిదారులందరికీ అందలేదు. సరుకులు పూర్తి స్థాయిలో జిల్లాకు చేరనే లేదు. కందిపప్పు, శనగలు మినహా మిగిలిన సరకులు అరకొరగానే వచ్చాయి. కానుకలోని ఆరు వస్తువులు తయారీ సంస్థల నుంచే పాకెట్‌ల రూపంలో పంపిణీ చేసి అవకతవకలకు తావులేకుండా చేస్తామని ప్రకటించింది. కానీ రేషన్ షాపులకు చేరే సమయానికే వాటిలో అనేక లోపాలు బయట పడ్డాయి.
గోధమ పిండి 20 శాతం మేర మాత్రమే దిగుమతి అయింది. అది కూడా లూజుగానే సరఫరా చేస్తున్నారు. నెయ్యి, పామాయిల్ పాకెట్లలో పది శాతం వరకు దెబ్బతిన్నాయి. నెయ్యి ప్యాకింగ్‌లో 90 గ్రాములే ఉంది. తెనాలి మండలంలో పామాయిల్, బెల్లం, గోధుమపిండి, నెయ్యి 25 శాతం అందాల్సి ఉందని సీఎస్‌డీటీ మెహర్‌కుమార్ వెల్లడించారు. ఇక సరకుల నాణ్యత విషయానికి వస్తే బెల్లం సరిలేదని విమర్శలు వచ్చాయి. నాదెండ్లలోనూ, రెంటచింతల తదితర ప్రాంతాల్లో నీరు కారిపోయిన బెల్లం పంపిణీ చేయడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.