పామో‘నిల్లు’
- రేషన్ దుకాణాలకు నిలిచిపోయిన పామోలిన్
- ఆరునెలలుగా ఇదే సమస్య
- సందిట్లో సడేమియలా ప్రైవేటు ఆయిల్ విక్రయిస్తున్న డీలర్లు
- పట్టింపేలేని పౌరసరఫరాలశాఖ
సాక్షి,సిటీబ్యూరో: తెల్లరేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం సబ్సిడీపై తక్కువ ధరకు సరఫరా చేస్తున్న పామోలిన్ కొద్దినెలలుగా పత్తా లేకుండా పోయింది. కార్డుకు ఒక ప్యాకెట్ చొప్పున ఇస్తుండగా సరఫరా లేదన్న సాకుతో ప్రభుత్వం కొద్దిరోజులుగా పంపిణీ చేయడం లేదు. ఫలితంగా కార్డుదారులు బహిరంగమార్కెట్లో అధికధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించింది.
ఒక్కటికాదు..రెండుకాదు..ఆరునెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా పౌరసరఫరాలశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గతంలో సీమాంధ్ర ఉద్యమ సెగతో పామోలిన్ సరఫరాకు అడ్డంకులు ఏర్పడగా తాజాగా నెల్లూరు,విశాఖ ప్రాంతాల నుంచి సరఫరా నత్తనడకగా సాసగుతోంది. సరఫరా లేదన్న సాకుతో రేషన్‌డీలర్లు సందిట్లో సడేమియాలా ప్రైవేటు కంపెనీ పామోలిన్ ప్యాకెట్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
గట్టిగా అడిగిన వారికి ప్రభుత్వం సరఫరా చేయకుంటే మేమేం చేయాలని..బదులిస్తుండగా, అడగని వారికి మాత్రం మెల్లగా అంటగడుతున్నారు. ప్రైవేటు బ్రాండ్ల పామోలిన్‌ను చౌకధర దుకాణాల ద్వారా విక్రయిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో కార్డుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీడీలు కట్టినా..: హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలో 12 పౌరసరఫరాల సర్కిళ్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 15 లక్షలపైచిలుకు వరకు తెల్లరేషన్ కార్డుదారులున్నారు. వీరికోసం ప్రతినెలా కనీసం 15 లక్షల లీటర్ల వరకు పామోలిన్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ఆరునెలలు నుంచి కనీసం 30శాతం కూడా పామోలిన్ సరఫరా జరగడం లేదు. అనేకమార్లు డీలర్లు ఆయిల్ కోసం డీడీలు కట్టినా పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో ఈ మధ్యకాలంలో పామోలిన్ కోసం డీడీలు కట్టడం మానేశారు. దీని రవాణా చాలా ఆలస్యంగా జరుగుతుండడంతో పౌరసరఫరా అధికారులు కూడా డీలర్లపై డీడీల కోసం ఒత్తిడి తేవడం తగ్గించారు.
భగ్గుమంటున్న ధరలు : ప్రస్తుతం బహిరంగమార్కెట్‌లో వంటనూనె ధరలు భగ్గుమంటున్నాయి. కనీసం లీటర్ ధర రూ.85 నుంచి రూ.100కు తగ్గకుండా విక్రయిస్తున్నారు. ఇంకా కొన్ని బ్రాండ్ల ధరలు ఎక్కువే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పామోలిన్ ధరకు రెక్కలు రావడంతో మార్కెట్లో ఆయా కంపెనీలు రూ.58 నుంచి 65 వరకు అమ్ముతున్నారు.
కొన్ని కంపెనీలు గిమ్మిక్కులు చేసి ప్యాకెట్ తూకం తగ్గించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. చౌకధర దుకాణాల ద్వారా లీటరు రూ.40కే లభిస్తుండగా..బహిరంగమార్కెట్‌లో దీని ధరలు మండిపోతుండడంతో కార్డుదారులు పా మోలిన్ కోసం రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నా రు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పామోలిన్‌ను సరఫరా చేయాలని కార్డుదారులు కోరుతున్నారు.