కానుకలో చేతివాటం! | Gift-handed! | Sakshi
Sakshi News home page

కానుకలో చేతివాటం!

Published Tue, Jan 13 2015 2:43 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

కానుకలో చేతివాటం! - Sakshi

కానుకలో చేతివాటం!

అనంతపురం సెంట్రల్ :  ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ పంపిణీ కార్యక్రమం గందరగోళంగా తయారైంది. ప్రభుత్వం ముందు చూపులేకుండా ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు హడావిడిగా తీసుకున్న నిర్ణయం విమర్శలపాలవుతోంది. చౌక ధాన్యపు కేంద్రాల ద్వారా తెల్లరేషన్ కార్డుదారులందరికీ రూ.241 విలువైన ఆరు రకాల సరుకులు పండుగను పురస్కరించుకుని అందించాలని నిర్ణయించింది. ఇందులో కేజీ శనగలు, కేజీ గోధుమ పిండి, అరకిలో కంది పప్పు, అరకిలో పామాయిల్, అరకిలో బెల్లం, 100 గ్రాముల నెయ్యి అందిస్తున్నారు.

జిల్లాలో 10.22 లక్షల మంది తెల్లరేషన్‌కార్డు దారులు ఉన్నారు. వీరికి 2286 చౌకదాన్యపు డిపో కేంద్రాల ద్వారా ఈ ఆరు రకాల వస్తువులు అందజేయాల్సి ఉంది. అయితే పండుగకు కేవలం రెండు రోజులే సమయం ఉన్నా పూర్తి స్థాయిలో సరుకులు చేర్చడంలో రాష్ట్ర వ్యాప్తంగా టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు చేర్చలేకపోతున్నారు. గోదుమ పిండి 825 మెట్రిక్ టన్నులు(80.74 శాతం), కంది పప్పు 511 మెట్రిక్ టన్నులు (100శాతం), పామాయిల్ 1013 మెట్రిక్ టన్నులు (99 శాతం), శనగలు 1022 మెట్రిక్ టన్నులు (99 శాతం), బెల్లం 516 మెట్రిక్ టన్నులు(100శాతం), నెయ్యి 100 మిల్లీలీటర్ల ప్యాకెట్లు 8.42 లక్షలు (ఇంకా 1.79 లక్షల ప్యాకెట్లు రావాలి) జిల్లా కేంద్రానికి చేరారుు.

అరుుతే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వీటిలో సగం కూడా మండల కేంద్రాలు.. అట్నుంచి గ్రామాలకు వెళ్లలేదు. దీంతో ఏం చేయూలో తోచక అధికారులు ఆందోళనపడుతున్నారు. సరుకులను తెప్పించుకునేందుకు వారం రోజుల నుంచి సివిల్‌సప్లై డీఎం కార్యాలయ అధికారులు అర్ధరాత్రి వరకై సమీక్షలు జరుపుతున్నా పురోగతి కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు మాత్రం అక్కడక్కడ సరుకులను పంపిణీ చేస్తూ.. అంతా సవ్యంగా పంపిణీ సాగుతోందంటూ ఆర్భాటంగా ప్రకటనలిస్తున్నారు.  
 
అర్ధరాత్రి వరకూ తిప్పలు తప్పవా..?  
జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి మంగళవారంలోగా నిత్యవసర సరుకులు అందించాలని ఉత్తర్వులు వచ్చాయి. అవసరమైతే రాత్రివేళల్లో కూడా పంపిణీ చేయాలని మంత్రులు ఆదేశిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ. 241 వస్తువుల కోసం ప్రజలు అర్ధరాత్రి వరకూ ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక కేంద్రం నడుస్తోంది. దీంతో సరుకులు తీసుకోవడానికి కొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
 
తూకాల్లో మోసం
పేదలకు ఉచితంగా అందిస్తున్న సరుకులను డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారనే అరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మండల స్టాకు పాయింట్ల నుంచి బస్తాల్లో వచ్చిన సరుకులను కేజీ, అర కేజీల్లోకి డీలర్లు మారుస్తున్నారు. ఈ సమయంలో ఒక్కో ప్యాకెట్లో 100, 200 గ్రాముల వరకు నొక్కేస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో సోమవారం పంపిణీ చేసిన సరుకుల్లో కొన్నింటిని ‘సాక్షి’ తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.

బెల్లం అర కిలో ఇవ్వాల్సి ఉండగా రూ. 350 గ్రాములున్న ఒకే అచ్చు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మరో 50, 100 గ్రాముల వరకూ జోడిస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాలకు గోధుమ పిండి, పామాయిల్ చేరలేదు. తాడిపత్రి రూరల్, యాడికి మండలాలకు ఒక కిలో కూడా చేరలేదు. దీంతో మంగళవారం పంపిణీ ప్రక్రియ ఏ విధంగా చేపడతారో తేలాల్సి ఉంది. కొన్ని సరుకులు మళ్లీ ఇస్తాం అని చెప్పి పంపిణీ చేసే అవకాశాలున్నాయని తెలిసింది.
    
సరుకులను కిట్స్ రూపంలో అందించడానికి ప్రత్యేకంగా బ్యాగులను ముద్రించారు. అయితే ఈ బ్యాగులు ఇప్పటి వరకూ కేవలం 2 లక్షలు మాత్రమే జిల్లాకు వచ్చాయి. మరో 3 లక్షల వర కు పసుపు కలర్ కవర్లు అందించారు. మిగిలిన వారు ఇళ్ల నుంచే బ్యాగులు తెచ్చుకోవాల్సి ఉంది. అయితే   పండుగ తర్వాత ప్రతి ఇంటికీ బ్యాగులు అందిస్తామని స్వయాన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. సరుకులు ఇచ్చేటప్పుడు కాకుండా మళ్లీ ప్రత్యేకంగా బ్యాగుల పంపిణీ అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టరు ముసుగులో ఉన్న తెలుగు తమ్ముళ్లకు లబ్ధి చేకూర్చేందుకే ఈ నిర్ణయమనే భావన వ్యక్తమవుతోంది.
 
పండుగకు ప్రతి ఒక్కరికీ సరుకులు అందిస్తాం :
చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో ప్రభుత్వం ఇస్తున్న ఆరు రకాల నిత్యవసర సరుకులను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తాం. సోమవారం నాటికి 75 శాతం సరుకులు అన్ని కేంద్రాలకు చేరాయి. మిగిలిన వస్తువులు మంగళవారం ఉదయమే వెళతాయి. జిల్లాకు కేవలం గోధుమ పిండి మాత్రం 120 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. ఇది కూడా మంగళవారం వస్తుంది. కావున ప్రతి ఒక్కరికీ సరుకులు అందజేస్తాం.
 - వెంకటేశం, జిల్లా మేనేజర్, సివిల్‌సప్లై

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement