13 మధ్యాహ్నంలోగా సంక్రాంతి కానుక
కడప సెవెన్‌రోడ్స్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా అందిస్తున్న ఆరు రకాల సరుకులను ఈనెల 13వ తేదీ మధ్యాహ్నంలోగా పంపిణీ చేయాలని తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ కేవీ రమణ ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,03,114 మంది తెల్లరేషన్‌కార్డుదారులున్నారన్నారు.
వీరికి 1735 చౌక దుకాణాల ద్వారా చంద్రన్న సంక్రాంతి కానుక కింద అర కిలో కందిపప్పు, అర లీటరు పామోలిన్, కిలో శనగపప్పు, అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, నూరు గ్రాముల నెయ్యి ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా పేదలకు అందిస్తున్న ఆరు వస్తువులను సక్రమంగా పంపిణీ చేయాలన్నారు.
పంపిణీ కేంద్రాల వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేసి అవసరమైన పక్షంలో స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. అలాగే వివరాలతో కూడిన ఫ్లెక్సీలను పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలకు కనబడే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రభాకర్‌రావు, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ బొల్లయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.