
ఎన్టీఆర్ కార్డు పంపిణీలో వసూళ్ల దందా!
► కార్డుకు రూ.10 నుంచి రూ.20 వసూలు
► ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు
డబ్బు కొట్టు.. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్డు పట్టు అన్నట్లు రేషన్ డీలర్ల వ్యవహారం తయారైంది. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఇందుకు ఇంత ఖర్చయింది.. వీరికి అంత ఇస్తున్నాం.. అంటూ దబాయిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కార్డులు ఉచితంగా పంపిణీ జరగాల్సిఉండగా ప్రజల నుంచి ముక్కుపిండి నగదు వసూలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
తెనాలి అర్బన్ : జిల్లా పరిధిలో సుమారు 13,58,883 తెల్ల, అన్నపూర్ణ, అంత్యోదయ రేషన్ కార్డులున్నాయి. వీరందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. రాజీవ్ ఆర్యోగశ్రీ కార్డులను ఉచితంగా అందజేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్పు చేసింది. అంతటితో ఆగకుండా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఫొటోలతో ఉన్న కొత్త కార్డులను జారీ చేసింది. వాటిని రెవెన్యూ అధికారులు తెల్లకార్డుదారులందరికీ అందజేయాల్సి ఉండగా ఆ బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించారు. ఇది రేషన్ షాపుల నిర్వాహకులకు వరంగా మారింది.
కాసులు కురిపిస్తున్నఆరోగ్యసేవ కార్డుల పంపిణీ..
జిల్లా పరిధిలో ఉన్న రేషన్ డీలర్లు తమ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు కార్డులను అందజేసినందుకు గాను రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే కార్డు లామినేషన్ చేయించామని, కార్డులు రెవెన్యూ కార్యాలయం నుంచి తెచ్చామని ఇలా రకరకాల కారణాలు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే కార్డు ఇవ్వకుండా సాకులు చెప్పటం.. రేషన్ ఇవ్వమని బెదిరించటం వంటివి చేసి తిప్పి పంపుతున్నారు. చేసేది లేక లబ్ధిదారులు వారడిగిన నగదును ముట్టజెప్పి కార్డు తీసుకెళుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కోసం ఇచ్చే నగదుతో ఒక నెల 5 కేజీల రేషన్ బియ్యం తెచ్చుకోవచ్చని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు..
జిల్లా పరిధిలో ఉన్న 13,58,883 కార్డులకు సంబంధించి లబ్ధిదారులు సగటున రూ.10 ఇచ్చినా సుమారు రూ.1.37 కోట్ల నగదు డీలర్లకు అదనంగా వచ్చే ఆదాయంగా చెప్పవచ్చు. ఈ వసూలు నగదులో కొంత మొత్తం కొందరు రెవెన్యూ అధికారులకు ముట్టచెబుతున్నట్లు ఆరోపణ ఉంది. అందువల్లే దీనిపై లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిఇలా ఉంటే కొద్ది నెలల క్రితం తెల్లరేషన్ కార్డు దారులందరికీ కూపన్ల బదులు ఒక చార్టును ఇచ్చారు. వాటి పంపిణీ సమయంలో కూడా ఒక్కొక్కరి నుంచి రూ.15 వసూలు చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై తెనాలి తహశీల్దార్ జీవీ సుబ్బారెడ్డిని వివరణ కోరగా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డును లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాల్సి ఉందని తెలిపారు. నగదు వసూలు చేస్తున్నారనే విషయం తన దృష్టికి రాలేదన్నారు. వెంటనే దీనిపై విచారణ జరుపుతానని చెప్పారు.