Telangana: రేషన్‌ కార్డ్‌ కష్టాలు ఇంతింత కాదయా? | People Confusion Over New Ration Cards Issue | Sakshi
Sakshi News home page

Telangana: రేషన్‌ కార్డ్‌ కష్టాలు ఇంతింత కాదయా?

Published Tue, Mar 25 2025 1:05 PM | Last Updated on Tue, Mar 25 2025 1:56 PM

People Confusion Over New Ration Cards Issue

రేషన్‌ కార్డు కోసం పేర్లు డిలీట్‌ చేసుకున్న కొత్త జంటలు

రాజీవ్‌ యువ వికాసం, సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్య శ్రీ పథకాలకు దూరం

రేషన్‌కార్డులు వచ్చే వరకు  పథకాలు లేనట్లే

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

ఈ యువకుడి పేరు కట్కూరి నరేశ్‌. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌. డిగ్రీ చదివి హమాలీ పని చేస్తున్నాడు. ఐదేళ్లక్రితం స్వప్నతో వివాహమైంది. అమ్మానాన్నలతో ఉన్న రేషన్‌ కార్డు నుంచి తన పేరును తొలగించుకున్నాడు. కొత్తరేషన్‌ కార్డుకు దరఖాస్తు చేయగా.. ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు రాజీవ్‌ యువ వికాసంలో స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కోల్పోయాడు. నరేశ్‌కు రేషన్‌కార్డు లేకపోవడంతో కిరాణా దుకాణంపై స్వయం ఉపాధి పొందాలనుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి.


         కట్కూరి నరేశ్‌

ఇతను కడార్ల అరుణ్‌ తేజ. కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌. స్వర్ణకారుడిగా ఉపాధి పొందుతున్నాడు. అయిదేళ్ల క్రితం వరకు తల్లిదండ్రులతో రేషన్‌కార్డులో ఉండగా.. వివాహం కావడంతో పాతకార్డులో పేరు తొలగించుకుని, కొత్తకార్డు కోసం దరఖాస్తు చేశాడు. ఏళ్లు గడుస్తున్నా కొత్త కార్డు లేదు. ఇటీవల యువ వికాస పథకంతో లబ్ధి పొందాలని భావించాడు. దరఖాస్తు చేద్దామని మీసేవకు వెళితే రేషన్‌కార్డు తప్పనిసరి చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వ పథకాలకు పొందలేకపోతున్నానని ఆవేదన చెందుతున్నాడు.


      కడార్ల అరుణ్‌ తేజ

ఈ యువకుడు జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం సిరికొండ గ్రామానికి చెందిన కాసోజి ప్రతాప్‌. తమ కుటుంబంలో ఉన్న నలుగురు అన్నదమ్ములందరికీ పెళ్లిలు అయ్యాయి. రేషన్‌ కార్డులు కుటుంబాలవారీగా తీసుకునేందుకు తమ తల్లిదండ్రుల కార్డుల్లో పేరు తొలగించుకున్నారు. కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. దీంతో రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నాడు.


        కాసోజి ప్రతాప్‌

ఈ యువకుడు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బూస రాకేశ్‌. వివాహం అనంతరం తన భార్యతో కలిసి కొత్త రేషన్‌కార్డు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అధికారులు పాతకార్డులో పేరు తీసివేశారు. కొత్త రేషన్‌ కార్డు జారీచేయలేదు. దీంతో పాత కార్డులో పేరు ఉండక, కొత్త రేషన్‌ కార్డు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాడు.

 
             బూస రాకేశ్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్‌కార్డును ప్రామాణికం చేయడంతో కొత్తకార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వకాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా చేర్పులు, మార్పులకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీకి హామీ ఇచ్చినా.. ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లయినవారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్‌కార్డు నుంచి పేర్లు రద్దు చేసుకుని కొత్తకార్డుల కోసం దరఖా స్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టి న రాజీవ్‌ యువ వికాసం పథకానికి సైతం రేషన్‌కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే ఉన్న నాలుక ఊడిపోయిన చందంలా మారినట్లయింది.

కొత్త కార్డులొస్తాయని ఆశతో...
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతో మంది కొత్తగా వివాహం అయినవారు రేషన్‌కార్డు పొందేందుకు, తమ తల్లిదండ్రులతో ఉన్న తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్తరేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి రాకపోగా, ఉన్న పాత రేషన్‌కార్డులో పేరు డిలీట్‌ కావడంతో ప్రభుత్వం అందించే సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, తదితర ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్‌యువ వికాసం పథకం సైతం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,78,620 రేషన్‌కార్డులుండగా, కొత్త కార్డుల కోసం సుమారు 50వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా.. రేషన్‌ కార్డులు ఉన్న పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నా లేని పేదల సంగతేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా.. కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదలు నష్టపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement