
కరీంనగర్ జిల్లా వన్నారంలో వృద్ధుడి ఆకస్మిక మృతి
కొరివి పెట్టకుండా ఠాణా మెట్లెక్కిన కొడుకులు
మానకొండూర్(కరీంనగర్ జిల్లా): కొడుకులు పుట్టారని సంబరపడితే.. కొరివి పెట్టకుండా కొట్టుకుంటున్నారు. కని, పెంచి, ప్రయోజకులను చేస్తే అనాథ శవంగా అంత్యక్రియలు జరపకుండా శవజాగరణ చేయించారు. దీంతో వృద్ధుడి మృతదేహం మూడ్రోజులు జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉండగా.. శనివారం పోలీసులు, గ్రామస్తుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తిచేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వన్నారం గ్రామానికి చెందిన జంగిలి కొమురయ్య (74), రాజకొమురవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు జంగిలి ఓదెలు, జంగిలి రవి, ఇద్దరు కూతుళ్లు సంతానం. రాజకొమురవ్వ కొంతకాలం కిందటే చనిపోయింది. ఓదెలు, రవి మధ్య చాలా రోజులుగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఈనెల 24న ఇంటి వద్ద జంగిలి కొమురయ్య చనిపోయాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన కొడుకులిద్దరూ.. తన తండ్రి మృతిపై అనుమానం ఉందని, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. శనివారం బ్లూకోల్ట్స్ సిబ్బంది వెంకట్రామయ్య ఫిర్యాదుతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కొడుకు తలకొరివి పెట్టాడు. కొమురయ్యది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ సీఐ బి.సంజీవ్ తెలిపారు.