= పత్తా లేని అదనపు రేషన్ కోటా
= నిరుపయోగంగా మారుతున్న కొత్త కూపన్లు
= దుకాణాల వద్ద లబ్ధిదారుల పడిగాపులు
= పట్టింపులేని సివిల్‌సప్లై అధికారులు
సాక్షి,సిటీబ్యూరో: అమ్మ అన్నం పెట్టదు..అడుక్క తిన్నివ్వదు అన్నట్లుంది నగరంలో తెల్లకార్డులదారుల పరిస్థితి. ఎంతో సబ్సిడీతో సరుకులు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెబుతున్న సర్కారు..రేషన్ పంపిణీలో ఎనలేని నిర్లక్ష్యం అవలంభిస్తోంది. ఫలితంగా ఇటీవల రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కూపన్లు పొందిన లబ్ధిదారులకు సరుకులు రాక తీవ్రఇబ్బంది పడుతున్నారు. సరుకుల కోసం రోజూ దుకాణాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా సర్కారు కనికరించడం లేదు.
చౌకధర దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేసే గడువు ముగస్తున్నప్పటికీ కొత్త రేషన్‌కార్డులకు కోటా కేటాయింపు జరగలేదు. వాటికి సంబంధించిన డైన మిక్ కీరిజిస్ట్రర్లు కూడా ఇప్పటివరకు డీలర్లకు అందలేదు. ఇప్పటికే చౌకధర దుకాణాలకు నెలసరి కోటా కేటాయింపులో మొదటివిడత కింద 65 శాతం సరుకులు మాత్రమే సరఫరా కాగా, మరో 35 శాతం సరఫరా చేయాల్సి ఉంది. మరోవైపు కొత్తకార్డుల కూపన్లు పొందిన లబ్ధిదారులు సరుకుల కోసం దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారు. కొంతమంది డీలర్లు కోటా కేటాయింపు జరగలేదని పేర్కొంటుండగా, మరికొందరు వచ్చేనెల కేటాయింపు ఉంటుందని చేతులు దులిపేస్తున్నారు.
ఊసేలేని కొత్త కార్డులకు సరుకులు : హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో కొత్త రేషన్‌కార్డులకు సంబంధించిన సరుకుల కోటా ఊసేలేకుండాపోయింది. వాస్తవంగా నెలసరి కోటాకుతోడు కొత్త కార్డులకు సంబంధించిన కోటా విడుదల కావాల్సి ఉంది. నవంబర్,డిసెంబర్ నెలలోనైనా కొత్త కార్డులకు కోటాయింపు ఉంటుందని భావించగా ఇప్పటివరకు పత్తా లేకుండా పోయింది.
60 శాతమే కూపన్ల జారీ : హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతంలో కనీసం 60శాతం మించి కూపన్లు పంపిణీకి నోచుకోలేదు. గత నెలలో జరిగిన మూడోవిడత రచ్చబండ సందర్భంగా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 1.11 లక్షల వరకు తెల్లకార్డులు మంజూరు కాగా, ఇందులో హైదరాబాద్‌లో 37 వేలు,రంగారెడ్డి జిల్లాలో 74వేలు ఉన్నాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాఅర్బన్‌లో బాలానగర్, ఉప్పల్, సరూర్‌నగర్ సివిల్‌సప్లై సర్కిల్స్ ఉండగా, రూరల్ ప్రాంతంలో 33 సర్కిళ్లు వేరుగా ఉన్నాయి. కొత్త తెల్లరేషన్‌కార్డులకు సంబంధించిన తాత్కాలికకార్డుతో కూడిన కూపన్ల జారీకి కుటుంబం సమేతంగా దిగి ఫొటో, వారి యూఐడీ, లేదా ఈఐడీల జీరాక్స్‌లను ముడిపెట్టడంతో పంపిణీ ప్రక్రియ నత్తనడకగా సాగుతోంది. తెల్లకార్డు లబ్ధిదారులకు కూపన్ల జారీ ప్రక్రియ పాత పరిస్థితులను మురిపిస్తోంది.
పామోలిన్ ఎక్కడ..? : గత రెండునెలలుగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని దుకాణాలకు పామోలిన్ సరఫరా కాకపోవడంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగమార్కెట్లో ఆయిల్ ధరలు భగ్గుమంటుండడంతో చాలామంది రేషన్ పామోలిన్ కోసం ఎదురుచూస్తుంటారు. రెండునెలలుగా పంపిణీ నిలిచిపోవడంతో నానాయాతన పడుతున్నారు. కాగా కొందరు డీలర్లు కావాలనే స్టాక్ లేదని చెబుతున్నారని, వస్తున్న కొద్దొగొప్పో స్టాక్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సరుకులు అందిస్తాం..
కొత్త తెల్లరేషన్‌కార్డులకు సంబంధించిన కూపన్ల జారీప్రక్రియ కొనసాగుతోంది. కూపన్లు పొందిన వారందరికీ సరుకులు ఇస్తాం. డీలర్ల వద్ద అందుకు సరిపడా సరుకులు అందుబాటులో ఉన్నాయి.
- రాజశేఖర్, డీఎస్‌వో, హైదరాబాద్
కూపన్లకు కోటా ఏది ?
Published Mon, Dec 23 2013 4:23 AM | Last Updated on Fri, Jul 27 2018 1:51 PM
Advertisement
Advertisement