Ration quota
-
ఇక కిరోసిన్ వంతు..!
► రేషన్ కోటా నుంచి ఎత్తివేసే యోచన ► కొద్ది నెలల్లో సబ్సిడీ కోత ► జూన్ నుంచి నిలిచిపోనున్న చక్కెర పంపిణీ ► కేవలం బియ్యం పంపిణీ కేంద్రాలుగా రేషన్ దుకాణాలు సాక్షి, పెద్దపల్లి: జిల్లాకు సరఫరా అయ్యే సబ్సిడీ కిరోసిన్ కోటాకు ప్రభుత్వం కత్తెర పెట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తెల్లరేషన్ కార్డుదారులకు సరఫరా అయ్యే కోటాలో 60 వేల లీటర్లు తగ్గించింది. మే నెలకు సంబంధించి జిల్లాకు 2.88 లక్షల లీటర్ల కిరోసిన్ రావాల్సి ఉండగా, 2.28 లక్షల లీటర్లు మాత్రమే రానుంది. చక్కెరపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేసిన కొద్ది రోజుల్లోనే కిరోసిన్ కోటాకు కోత పెట్టింది. జిల్లాలో జూన్ నుంచి రేషన్ దుకాణాల్లో సబ్సిడీ చక్కెర పంపిణీ నిలిచిపోనుంది. పెద్దపల్లి జిల్లాలో 2,12,037 రేషన్‌కార్డులు ఉన్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఈ కుటుంబాలకు నెల నెలా రేషన్ దుకాణాల ద్వారా కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. వంట గ్యాస్లేని కుటుంబాలకు 2 లీటర్లు, ఉన్న కుటుంబానికి లీటర్ చొప్పున అందిస్తున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వంటగ్యాస్లేని వారికి 4 లీటర్లు, ఉన్నవారికి 2 లీటర్ల చొప్పున పంపిణీ చేసేవారు. మే నెలకు సంబంధించి జిల్లాకు 2.88 లక్షల లీటర్ల కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. కోటాలో 60 వేల లీటర్లు కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లాకు ఉత్తర్వులు పంపింది. తాజా ఆదేశాలు ఇవీ.. రాష్ట్ర పౌరసరఫరా శాఖ కమిషనర్ సీవీ.ఆనంద్ తాజా ఉత్తర్వుల ప్రకారం కిరోసిన్ కోటాను మున్సిపల్ కార్పొరేషన్, దాని పరిధిలోని గ్యాస్ కనెక్షన్ లేని వారికి 2 లీటర్లు, గ్రామీణులు, దీపం కనెక్షన్ ఉన్నవారికి లీటరు చొప్పున పంపిణీ చేయాలని పేర్కొన్నారు. మే నుంచి దీనిని అమలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కిరోసిన్ కోటా తగ్గించినందున ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. తగ్గిపోతున్న సరుకులు చౌక ధరల దుకాణాల ద్వారా గతంలో తొమ్మిద రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవారు. బియ్యం, చక్కెర, గోధుమలు, కందిపప్పు, పామాయిల్, కారంపొడి, పసుపు, చింతపండు, ఉప్పు, గోధుమ పిండి ఉండేవి. రాష్ట్ర విభజనకు ముందే పలు సరుకులకు మంగళం పాడారు. అప్పట్లోనే గోధుమపిండి, ఉప్పు, కారంపొడి, చింతపండు, కందిపప్పు సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత పామాయిల్‌ను ఆపేశారు. ప్రస్తుతం చక్కెరకు ఫుల్స్టాప్ పెట్టారు. తాజాగా కిరోసిన్ కోటాను కుదించారు. ఇక బియ్యం, గోధుమలు మాత్రం పంపిణీ చేయాల్సి ఉన్నా, చాలా చోట్ల బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పక్కదారి పడుతున్నందుకేనా..? కేంద్ర ప్రభుత్వం చక్కెర, కిరోసిన్ పంపిణీపై వివరాలు సేకరించింది. చక్కెర, కిరోసిన్, బియ్యం కోటాలు పేదలకు అందకుండానే పెద్దఎత్తున పక్కదారి పడుతున్నాయని గుర్తించింది. వంట గ్యాస్ కనెక్షన్లు ఉండడంతో, చాలా మంది కిరోసిన్‌ను తీసుకోవడం లేదని, తీసుకున్నా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని, డీలర్లు కూడా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని అధికారులు నివేదించడంతో కోటా కుదించినట్లు సమాచారం. అదే ఉద్దేశంతోనే చెక్కర పంపిణీ కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్ది నెలల్లో కిరోసిన్‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల యథావిధిగా చక్కెర పంపిణీ బహిరంగ మార్కెట్లో చక్కెర కిలో రూ.43 ఉండగా, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రూ.13.50కే తెల్ల రేషన్‌కార్డుదారులకు అందిస్తోంది. సబ్సిడీ భారాన్ని ఇక మోయలేమని కేంద్ర ప్రభుత్వం మార్చిలో స్పష్టం చేసింది. సబ్సిడీ చక్కెర పంపిణీ కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపకపోవడంతో చక్కెర పంపిణీ నిలిచిపోనుంది. గతంలో సరఫరా చేసిన చక్కెర గోధాముల్లో నిల్వ ఉండడంతో గత నెలలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. ఇంకా నిల్వలు ఉండడంతో ఈ నెలలో కూడా పంపిణీ చేయనున్నారు. -
రేషన్ సరుకుల కోసం గ్రామస్తుల ఆందోళన
ప్రకాశం జిల్లా దర్శి మండలం అబ్బాయిపాలెం గ్రామస్తులు రేషన్ సరుకుల కోసం శనివారం ధర్నాకు దిగారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సరుకులను ఇంతవరకు డీలర్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 25 ఏళ్లుగా ఉన్న రేషన్ డీలర్‌ను రాజకీయ కారణాలతో తొలగించి నాలుగు నెలల క్రితం ఇరుగు పోల్‌రెడ్డి అనే వ్యక్తికి డీలర్షిప్ అప్పగించారని గ్రామస్తులు అంటున్నారు. కొత్తగా వచ్చిన డీలర్ సరుకులను పంపిణీ చేయకుండా అక్రమంగా విక్రయించుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ కోటా డీలర్‌కు వచ్చిననప్పటికీ వాటిని ఇంతవరకు ఇవ్వలేదని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయం తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కూపన్లకు కోటా ఏది ?
= పత్తా లేని అదనపు రేషన్ కోటా = నిరుపయోగంగా మారుతున్న కొత్త కూపన్లు = దుకాణాల వద్ద లబ్ధిదారుల పడిగాపులు = పట్టింపులేని సివిల్సప్లై అధికారులు సాక్షి,సిటీబ్యూరో: అమ్మ అన్నం పెట్టదు..అడుక్క తిన్నివ్వదు అన్నట్లుంది నగరంలో తెల్లకార్డులదారుల పరిస్థితి. ఎంతో సబ్సిడీతో సరుకులు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెబుతున్న సర్కారు..రేషన్ పంపిణీలో ఎనలేని నిర్లక్ష్యం అవలంభిస్తోంది. ఫలితంగా ఇటీవల రచ్చబండ కార్యక్రమంలో రేషన్కూపన్లు పొందిన లబ్ధిదారులకు సరుకులు రాక తీవ్రఇబ్బంది పడుతున్నారు. సరుకుల కోసం రోజూ దుకాణాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా సర్కారు కనికరించడం లేదు. చౌకధర దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేసే గడువు ముగస్తున్నప్పటికీ కొత్త రేషన్‌కార్డులకు కోటా కేటాయింపు జరగలేదు. వాటికి సంబంధించిన డైన మిక్ కీరిజిస్ట్రర్లు కూడా ఇప్పటివరకు డీలర్లకు అందలేదు. ఇప్పటికే చౌకధర దుకాణాలకు నెలసరి కోటా కేటాయింపులో మొదటివిడత కింద 65 శాతం సరుకులు మాత్రమే సరఫరా కాగా, మరో 35 శాతం సరఫరా చేయాల్సి ఉంది. మరోవైపు కొత్తకార్డుల కూపన్లు పొందిన లబ్ధిదారులు సరుకుల కోసం దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారు. కొంతమంది డీలర్లు కోటా కేటాయింపు జరగలేదని పేర్కొంటుండగా, మరికొందరు వచ్చేనెల కేటాయింపు ఉంటుందని చేతులు దులిపేస్తున్నారు. ఊసేలేని కొత్త కార్డులకు సరుకులు : హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో కొత్త రేషన్‌కార్డులకు సంబంధించిన సరుకుల కోటా ఊసేలేకుండాపోయింది. వాస్తవంగా నెలసరి కోటాకుతోడు కొత్త కార్డులకు సంబంధించిన కోటా విడుదల కావాల్సి ఉంది. నవంబర్,డిసెంబర్ నెలలోనైనా కొత్త కార్డులకు కోటాయింపు ఉంటుందని భావించగా ఇప్పటివరకు పత్తా లేకుండా పోయింది. 60 శాతమే కూపన్ల జారీ : హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతంలో కనీసం 60శాతం మించి కూపన్లు పంపిణీకి నోచుకోలేదు. గత నెలలో జరిగిన మూడోవిడత రచ్చబండ సందర్భంగా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 1.11 లక్షల వరకు తెల్లకార్డులు మంజూరు కాగా, ఇందులో హైదరాబాద్‌లో 37 వేలు,రంగారెడ్డి జిల్లాలో 74వేలు ఉన్నాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాఅర్బన్లో బాలానగర్, ఉప్పల్, సరూర్‌నగర్ సివిల్సప్లై సర్కిల్స్ ఉండగా, రూరల్ ప్రాంతంలో 33 సర్కిళ్లు వేరుగా ఉన్నాయి. కొత్త తెల్లరేషన్‌కార్డులకు సంబంధించిన తాత్కాలికకార్డుతో కూడిన కూపన్ల జారీకి కుటుంబం సమేతంగా దిగి ఫొటో, వారి యూఐడీ, లేదా ఈఐడీల జీరాక్స్‌లను ముడిపెట్టడంతో పంపిణీ ప్రక్రియ నత్తనడకగా సాగుతోంది. తెల్లకార్డు లబ్ధిదారులకు కూపన్ల జారీ ప్రక్రియ పాత పరిస్థితులను మురిపిస్తోంది. పామోలిన్ ఎక్కడ..? : గత రెండునెలలుగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని దుకాణాలకు పామోలిన్ సరఫరా కాకపోవడంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగమార్కెట్లో ఆయిల్ ధరలు భగ్గుమంటుండడంతో చాలామంది రేషన్ పామోలిన్ కోసం ఎదురుచూస్తుంటారు. రెండునెలలుగా పంపిణీ నిలిచిపోవడంతో నానాయాతన పడుతున్నారు. కాగా కొందరు డీలర్లు కావాలనే స్టాక్ లేదని చెబుతున్నారని, వస్తున్న కొద్దొగొప్పో స్టాక్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరుకులు అందిస్తాం.. కొత్త తెల్లరేషన్‌కార్డులకు సంబంధించిన కూపన్ల జారీప్రక్రియ కొనసాగుతోంది. కూపన్లు పొందిన వారందరికీ సరుకులు ఇస్తాం. డీలర్ల వద్ద అందుకు సరిపడా సరుకులు అందుబాటులో ఉన్నాయి. - రాజశేఖర్, డీఎస్వో, హైదరాబాద్ -
‘కోటా’ కట్!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కిరణ్ సర్కారు అదనపు రేషన్ కోటాకు మంగళం పాడింది. ఏటా పండుగలకు ఇచ్చే ప్రత్యేక సరుకులు ఈ ఏడాది కేటాయించ లేదు. రెగ్యూలర్ కోటాతోనే సరిపెట్టింది. ప్రతీ దసరా, దీపావళికి నెలవారి కోటాతోపాటు చక్కెర, పామాయిల్ సరుకులు అదనంగా పంపిణీ చేసేవారు. బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సరుకులతో ఉపశమనం పొందుతామని భావించిన వినియోగదారులకు నిరాశే మిగిలింది. ప్రత్యేక కోటా రాలేదని, సాధారణ కోటా పంపిణీ చేయనున్నట్లు సహాయ పౌర సరఫరాల శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం పునరాలోచన చేసి పండుగలకు ప్రత్యేక కోటా విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. అక్టోబర్ కోటా.. జిల్లాలో తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ రేషన్‌కార్డులు 6,74,916 ఉన్నాయి. ఇందులో తెలుపు కార్డుదారులు 5,68,328 మంది ఉన్నారు. ప్రతినెలా కోటా కింద 1.04 లక్షల క్వింటాళ్ల బియ్యం విడుదల అవుతాయి. అక్టోబర్‌లో పండుగలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సాధారణ కోటాను కేటాయిచింది. అమ్మహస్తం పథకం కింద చక్కెర కార్డుకు అరకిలో చొప్పున 3,378.97 క్వింటాళ్లు, 6,75,787 పామాయిల్ ప్యాకెట్లు, గోధుమలు కిలో చొప్పున 6,752.69 క్వింటాళ్లు, గోధుమ పిండి కిలో చొప్పున 6,748.33 క్వింటాళ్లు, కారంపొడి 250 గ్రాముల చొప్పున 6,74,772 ప్యాకెట్లు, పసుపు 100 గ్రాముల చొప్పున 6,75,192 ప్యాకెట్లు, చింతపండు 500 గ్రాముల చొప్పున 6,74,211 ప్యాకెట్లు, ఉప్పు 6,74,211 ప్యాకెట్లు, కందిపప్పు కిలోచొప్పున 6,751.95 క్వింటాళ్లు అక్టోబర్ కోటా కింద విడుదల య్యాయి. ఈ ప్యాకెట్లను తీసుకోవడానికి వినియోగదారులు అనాసక్తి చూపుతున్నారు. ఇప్పటికైనా దసరా, దీపావళి పండుగలకు అదనపు రేషన్ సరుకుల కోటా కేటాయించాలని వినియోగదారులు పేర్కొంటున్నారు. మార్కెట్లో ధరలు భగ్గు.. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. రేషన్ అదనంగా సరుకులు ఇచ్చే వారు ఈసారి ఇవ్వడం లేదు. పండుగకు అరకిలో చక్కెర ఏమి సరిపోతోంది. నూనే 2 నుంచి 3 కిలోల వరకు అవసరముంటుంది. మిగతా సమయాల్లో ఎక్కువగా ఇవ్వకున్నా, పండుగలప్పుడు అదనంగా ఇస్తే బాగుంటుంది. - పార్వతీబాయి, కొత్త కరత్వాడ, బోథ్ తినడానికే సరిపోవు.. మా కుటుంబంలో నలుగురమున్నం. ఇద్దరికే రేషన్ వస్తుంది. నెలనెల కంట్రోల్ నుంచి తెచ్చుకున్న సరుకులు తినడానికే సరిపోవు. ఇంకా పండుగులకు ఏమి మిగులుతయి. పండుగలకు కనీసం 4 నుంచి 5 కిలోల వరకు ఇస్తే బాగుంటుంది. ఇప్పటికైనా రేషన్ ద్వారా పండుగలకు సరిపడా సరుకులు ఇవ్వాలి. - సుమన్‌బాయి, ఇందిరానగర్ కాలనీ, బేల