కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కిరణ్ సర్కారు అదనపు రేషన్ కోటాకు మంగళం పాడింది. ఏటా పండుగలకు ఇచ్చే ప్రత్యేక సరుకులు ఈ ఏడాది కేటాయించ లేదు. రెగ్యూలర్ కోటాతోనే సరిపెట్టింది. ప్రతీ దసరా, దీపావళికి నెలవారి కోటాతోపాటు చక్కెర, పామాయిల్ సరుకులు అదనంగా పంపిణీ చేసేవారు. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సరుకులతో ఉపశమనం పొందుతామని భావించిన వినియోగదారులకు నిరాశే మిగిలింది. ప్రత్యేక కోటా రాలేదని, సాధారణ కోటా పంపిణీ చేయనున్నట్లు సహాయ పౌర సరఫరాల శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం పునరాలోచన చేసి పండుగలకు ప్రత్యేక కోటా విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అక్టోబర్ కోటా..
జిల్లాలో తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ రేషన్‌కార్డులు 6,74,916 ఉన్నాయి. ఇందులో తెలుపు కార్డుదారులు 5,68,328 మంది ఉన్నారు. ప్రతినెలా కోటా కింద 1.04 లక్షల క్వింటాళ్ల బియ్యం విడుదల అవుతాయి. అక్టోబర్‌లో పండుగలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సాధారణ కోటాను కేటాయిచింది. అమ్మహస్తం పథకం కింద చక్కెర కార్డుకు అరకిలో చొప్పున 3,378.97 క్వింటాళ్లు, 6,75,787 పామాయిల్ ప్యాకెట్లు, గోధుమలు కిలో చొప్పున 6,752.69 క్వింటాళ్లు, గోధుమ పిండి కిలో చొప్పున 6,748.33 క్వింటాళ్లు, కారంపొడి 250 గ్రాముల చొప్పున 6,74,772 ప్యాకెట్లు, పసుపు 100 గ్రాముల చొప్పున 6,75,192 ప్యాకెట్లు, చింతపండు 500 గ్రాముల చొప్పున 6,74,211 ప్యాకెట్లు, ఉప్పు 6,74,211 ప్యాకెట్లు, కందిపప్పు కిలోచొప్పున 6,751.95 క్వింటాళ్లు అక్టోబర్ కోటా కింద విడుదల య్యాయి. ఈ ప్యాకెట్లను తీసుకోవడానికి వినియోగదారులు అనాసక్తి చూపుతున్నారు. ఇప్పటికైనా దసరా, దీపావళి పండుగలకు అదనపు రేషన్ సరుకుల కోటా కేటాయించాలని వినియోగదారులు పేర్కొంటున్నారు.
మార్కెట్‌లో ధరలు భగ్గు..
బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. రేషన్ అదనంగా సరుకులు ఇచ్చే వారు ఈసారి ఇవ్వడం లేదు. పండుగకు అరకిలో చక్కెర ఏమి సరిపోతోంది. నూనే 2 నుంచి 3 కిలోల వరకు అవసరముంటుంది. మిగతా సమయాల్లో ఎక్కువగా ఇవ్వకున్నా, పండుగలప్పుడు అదనంగా ఇస్తే బాగుంటుంది.
- పార్వతీబాయి, కొత్త కరత్వాడ, బోథ్
తినడానికే సరిపోవు..
మా కుటుంబంలో నలుగురమున్నం. ఇద్దరికే రేషన్ వస్తుంది. నెలనెల కంట్రోల్ నుంచి తెచ్చుకున్న సరుకులు తినడానికే సరిపోవు. ఇంకా పండుగులకు ఏమి మిగులుతయి. పండుగలకు కనీసం 4 నుంచి 5 కిలోల వరకు ఇస్తే బాగుంటుంది. ఇప్పటికైనా
రేషన్ ద్వారా పండుగలకు సరిపడా సరుకులు ఇవ్వాలి.
- సుమన్‌బాయి, ఇందిరానగర్ కాలనీ, బేల
‘కోటా’ కట్!
Published Sat, Oct 5 2013 1:12 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement