ఇక కిరోసిన్ వంతు..! | Government scissors for subsidized kerosene quota | Sakshi
Sakshi News home page

ఇక కిరోసిన్ వంతు..!

Published Tue, May 2 2017 3:39 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

ఇక కిరోసిన్ వంతు..!

ఇక కిరోసిన్ వంతు..!

► రేషన్‌ కోటా నుంచి ఎత్తివేసే యోచన 
కొద్ది నెలల్లో సబ్సిడీ కోత
► జూన్‌ నుంచి నిలిచిపోనున్న చక్కెర పంపిణీ
► కేవలం బియ్యం పంపిణీ కేంద్రాలుగా రేషన్‌ దుకాణాలు


 సాక్షి, పెద్దపల్లి:
జిల్లాకు సరఫరా అయ్యే సబ్సిడీ కిరోసిన్‌ కోటాకు ప్రభుత్వం కత్తెర పెట్టింది. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని తెల్లరేషన్‌ కార్డుదారులకు సరఫరా అయ్యే కోటాలో 60 వేల లీటర్లు తగ్గించింది. మే నెలకు సంబంధించి జిల్లాకు 2.88 లక్షల లీటర్ల కిరోసిన్‌ రావాల్సి ఉండగా, 2.28 లక్షల లీటర్లు మాత్రమే రానుంది. చక్కెరపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేసిన కొద్ది రోజుల్లోనే కిరోసిన్‌ కోటాకు కోత పెట్టింది. జిల్లాలో జూన్‌ నుంచి రేషన్‌ దుకాణాల్లో సబ్సిడీ చక్కెర పంపిణీ నిలిచిపోనుంది.

పెద్దపల్లి జిల్లాలో 2,12,037 రేషన్‌కార్డులు ఉన్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఈ కుటుంబాలకు నెల నెలా రేషన్‌ దుకాణాల ద్వారా కిరోసిన్‌ పంపిణీ చేస్తున్నారు. వంట గ్యాస్‌లేని కుటుంబాలకు 2 లీటర్లు, ఉన్న కుటుంబానికి లీటర్‌ చొప్పున అందిస్తున్నారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వంటగ్యాస్‌లేని వారికి 4 లీటర్లు, ఉన్నవారికి 2 లీటర్ల చొప్పున పంపిణీ చేసేవారు. మే నెలకు సంబంధించి జిల్లాకు 2.88 లక్షల లీటర్ల కిరోసిన్‌ సరఫరా చేయాల్సి ఉంది. కోటాలో 60 వేల లీటర్లు కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లాకు ఉత్తర్వులు పంపింది.

తాజా ఆదేశాలు ఇవీ..
రాష్ట్ర పౌరసరఫరా శాఖ కమిషనర్‌ సీవీ.ఆనంద్‌ తాజా ఉత్తర్వుల ప్రకారం కిరోసిన్‌ కోటాను మున్సిపల్‌ కార్పొరేషన్, దాని పరిధిలోని గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారికి 2 లీటర్లు, గ్రామీణులు, దీపం కనెక్షన్‌ ఉన్నవారికి లీటరు చొప్పున పంపిణీ చేయాలని పేర్కొన్నారు. మే నుంచి దీనిని అమలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కిరోసిన్‌ కోటా తగ్గించినందున ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.

తగ్గిపోతున్న సరుకులు
చౌక ధరల దుకాణాల ద్వారా గతంలో తొమ్మిద రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవారు. బియ్యం, చక్కెర, గోధుమలు, కందిపప్పు, పామాయిల్, కారంపొడి, పసుపు, చింతపండు, ఉప్పు, గోధుమ పిండి ఉండేవి. రాష్ట్ర విభజనకు ముందే పలు సరుకులకు మంగళం పాడారు. అప్పట్లోనే గోధుమపిండి, ఉప్పు, కారంపొడి, చింతపండు, కందిపప్పు సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత పామాయిల్‌ను ఆపేశారు. ప్రస్తుతం చక్కెరకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. తాజాగా కిరోసిన్‌ కోటాను కుదించారు. ఇక బియ్యం, గోధుమలు మాత్రం పంపిణీ చేయాల్సి ఉన్నా, చాలా చోట్ల బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు.

పక్కదారి పడుతున్నందుకేనా..?
కేంద్ర ప్రభుత్వం చక్కెర, కిరోసిన్‌ పంపిణీపై వివరాలు సేకరించింది. చక్కెర, కిరోసిన్, బియ్యం కోటాలు పేదలకు అందకుండానే పెద్దఎత్తున పక్కదారి పడుతున్నాయని గుర్తించింది. వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండడంతో, చాలా మంది కిరోసిన్‌ను తీసుకోవడం లేదని, తీసుకున్నా బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని, డీలర్లు కూడా పెద్ద ఎత్తున బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని అధికారులు నివేదించడంతో కోటా కుదించినట్లు సమాచారం. అదే ఉద్దేశంతోనే చెక్కర పంపిణీ కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్ది నెలల్లో కిరోసిన్‌పై సబ్సిడీ పూర్తిగా ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ నెల యథావిధిగా చక్కెర పంపిణీ
బహిరంగ మార్కెట్లో చక్కెర కిలో రూ.43 ఉండగా, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రూ.13.50కే తెల్ల రేషన్‌కార్డుదారులకు అందిస్తోంది. సబ్సిడీ భారాన్ని ఇక మోయలేమని కేంద్ర ప్రభుత్వం మార్చిలో స్పష్టం చేసింది. సబ్సిడీ చక్కెర పంపిణీ కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు జరపకపోవడంతో చక్కెర పంపిణీ నిలిచిపోనుంది. గతంలో సరఫరా చేసిన చక్కెర గోధాముల్లో నిల్వ ఉండడంతో గత నెలలో రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. ఇంకా నిల్వలు ఉండడంతో ఈ నెలలో కూడా పంపిణీ చేయనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement