సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న హైదరాబాద్‌లో రెండు శాతం వరకు పేద కుటుంబాలు కిరోసిన్‌పైనే ఆధారపడి వంటావార్పు కొనసాగిస్తున్నాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఢిల్లీ, చండీగఢ్ తరహాలో కిరోసిన్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే పాలకుల ప్రయత్నాలు అటకెక్కాయి. పౌరసరఫరాల శాఖ నగరంలో కిరోసిన్ వినియోగం నివారించేందుకు నడుం బిగించినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడంలేదు. రేషన్ కార్డులు కలిగి ఉన్న బీపీఎల్ కుటుంబాలను సర్కిల్‌వారీగా గుర్తించి ఎల్పీజీ కనెక్షన్లు మంజూరు చేసే విధంగా ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. కేవలం కొత్త కార్డుల జారీలో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి నిబంధనను అమలు చేసి..పాత కార్డుదారులకు మాత్రం కనెక్షన్లు మంజూరు చేయించడాన్ని గాలికి వదిలేసింది.
ఉజ్వల అంతంతే...
కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(దీపం) పథకం అమల్లో సైతం పౌరసరఫరాల శాఖ వెనుకబడింది. అప్పట్లో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పౌరసరఫరాల విభాగాలు ఉజ్వల యోజన పథకం కింద సుమారు 1,67,198 కుటుంబాలను గుర్తించాయి. అందులో 1,66,522 కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్ల కోసం సిఫార్సు చేయగా, ఆయిల్ కంపెనీల డి్రస్టిబ్యూటర్లు మాత్రం 84,713 కుటుంబాలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
చదవండి: మద్యం మత్తులో పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టాడు
ఇంకా కిరోసిన్ లబ్దిదారులు
గ్రేటర్ పరిధిలోని నిరుపేద కుటుంబాలు ఇంకా కిరోసిన్‌పైనే ఆధారపడి వంటావార్పు కొనసాగించడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం మొత్తం 17,21,212 రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలు ఉండగా, అందులో 3,41,823 కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేక కిరోసిన్ లబ్దిదారులుగా కొనసాగుతున్నారు.
చదవండి: రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
గ్రేటర్‌లో కిరోసిన్ లబ్దిదారులు ఇలా
జిల్లా | మొత్తం కార్డుల సంఖ్య | కిరోసిన్ కార్డులు | నెలసరి కిరోసిన్ కోటా (లీటర్లలో) |
హైదరాబాద్ | 6,36,661 | 1,26,214 | 207817.0 |
మేడ్చల్ జిల్లా | 5,24,594 | 89,158 | 110470.0 |
రంగారెడ్డి జిల్లా | 5,59,957 | 1,26,451 | 168225.0 |
Comments
Please login to add a commentAdd a comment