
పేద కంచాలకు కొత్త గండం
ఇప్పటి వరకూ బినామీ కార్డుల పేరుతో అర్హుల అన్నపు కంచాలకు ఎసరు పెట్టిన ప్రభుత్వం ఇంకా భారం తగ్గించుకునేందుకు మరో కొత్త దారిని
సాక్షి, రాజమండ్రి :ఇప్పటి వరకూ బినామీ కార్డుల పేరుతో అర్హుల అన్నపు కంచాలకు ఎసరు పెట్టిన ప్రభుత్వం ఇంకా భారం తగ్గించుకునేందుకు మరో కొత్త దారిని వెతుకుతోంది.రేషన్ కార్డుల సంఖ్యకు భారీగా కోత్త పెట్టయినా పేదలకు ఇస్తున్న బియ్యం ఆదా చేయాలని సర్కారు ఆలోచిస్తోంది. తెల్లరేషన్ కార్డుదారులు ఆరు నెలలుగా రేషన్ తీసుకోకుండా ఉంటే వారి కార్డులు ఇకపై రద్దయిపోనున్నాయి. ఈ మేరకు జిల్లాలో పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 15.26 లక్షల రేషన్ కార్డులు ఉండగా వాటిలో 14.40 లక్షల తెల్ల రేషన్ కార్డులు, 91,000 అంత్యోదయ కార్డులు, 1632 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. గత మూడు నెలల్లో చేపట్టిన ఆధార్ ఆధారిత వడబోతల్లో 60,232 కార్డులు తొలగించారు. అంతే కాకుండా 1.86 లక్షల కార్డులకు సంబంధించి సుమారు ఆరు లక్షల యూనిట్లు (ఆ కార్డుల ద్వారా లబ్ధిపొందే వారు) ఆదా చే శామని చెప్పుకుంటున్నారు.
వీటి ద్వారా రూ.7.63 కోట్ల విలువైన సరుకులు మిగులుతుండడంతో పాటు సగటున సంవత్సరానికి 91.73 కోట్ల సబ్సిడీ ఆదా అవుతోందని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. అంతటితో ఆగకుండా నెల నెలా రేషన్ సరుకులు తీసుకోని వారి ద్వారా కూడా భారీ మొత్తంలో ఆదా అవుతోందని విన్నవించారు. గత ఏడాది 2.15 లక్షల మంది కార్డులపై బియ్యం, ఇతర వస్తువులు తీసుకోలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు కమిషనర్ బి.రాజశేఖర్‌కు తాజాగా పంపిన నివేదికలో పేర్కొన్నారు. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వానికి ఆదా అవుతున్న సబ్సిడీ విలువ బోగస్ కార్డుల వల్ల వాటిల్లే నష్టం కన్నా ఎక్కువ ఉంటోందని చెపుతున్నారు. నెలకు రూ. 8.90 కోట్ల వంతున ఏడాదికి రూ. 106.8 కోట్లు ఆదా అవుతోందని లెక్కలు చూపుతున్నారు. దీంతో అర్హులైన కార్డుదారులై ఉన్నా ఆరు నెలలు వరుసగా సరుకులు తీసుకోని వారిని గుర్తించి కార్డులు రద్దు చేయాలని కమిషనర్ చెప్పడంతో జిల్లాలో అధికారులు గణాంకాలు సేకరిస్తున్నారు.
వలస కూలీల లబ్ధికి ఎసరు..
స్థానికంగా పనుల్లేక చాలా మంది వ్యవసాయ కూలీలు ఇతర జిల్లాలకు వలస పోతుంటారు. వ్యవసాయ సీజన్‌లో ఆరు నెలలు అక్కడ ఉండి మిగిలిన రోజులు తమ గ్రామాల్లో పొట్ట పోసుకుంటారు. వారి పిల్లలు, ముసలి తల్లిదండ్రులు ఇళ్లల్లోనే ఉన్నా ఆధార్ కార్డు ప్రకారం యజమాని లేని కారణంగా ఇప్పుడు వారి కార్డులు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరే కాకుండా వయోవృద్ధులు కొందరు ఇళ్లు కదిలి బయటికి రాలేక రేషన్ సరుకులు తెచ్చుకోలేక పోతున్నారు. వీరు కూడా తాజా నిర్ణయానికి బాధితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఇలాంటి వారి కార్డులు మరొక 60 వేల వరకూ ఉంటాయని అంచనా. వారందరి కార్డులు కూడా రద్దు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ కుటుంబాలకు కార్డులు కేవలం నిత్యావసరాలు తెచ్చేవే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలుకు కూడా ఉపయోగ పడుతున్నాయి. అధికారులు కచ్చితమైన సర్వే లేకుండా తొలగింపు ప్రారంభిస్తే వేలాది కుటుంబాలు ఆరోగ్యశ్రీకి అనర్హులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
‘ఈ-పాస్’ అనంతరం ఈ గణాంకాలు
జిల్లాలో 2,641 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో వంద దుకాణాల్లో ఈ-పాస్ విధానం ద్వారా ఆన్‌లైన్ మానిటరింగ్ పద్ధతిలో రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఈ దుకాణాల్లో ఆన్‌లైన్ గణాంకాల ఆధారంగా ముందుగా వంద దుకాణాల లెక్కలు అధికారులు తేల్చారు. తర్వాత మిగిలిన దుకాణాల్లో సేవింగ్స్‌ను అధికారులు అంచనా వేశారు. వీటిని గంపగుత్త లెక్కల ద్వారా భూతద్దంలో కాగితాలకు ఎక్కించిన అధికారులు ఆదాను కోట్లలో చూపిండంతో ప్రభుత్వం ‘సరుకు తీసుకోని కార్డులు’ పేరుతో’ మరోసారి కోత పెట్టేందుకు ఒడిగడుతోంది.