
పథకాలకు తెల్లకార్డుకు లింకు తీసేద్దాం!
సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌కార్డు లింకును తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫైలు సిద్ధమైంది.
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌కార్డు లింకును తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫైలు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కంటే తెల్ల రేషన్‌కార్డులు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిద్వారా తెల్లకార్డు ఉన్న వారందరికీ ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తాయన్న అభిప్రాయాన్ని తొలగించడంతో పాటు ఖజానాపై ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం గృహ నిర్మాణం, ఆరోగ్యశ్రీ. ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌కార్డే ఆధారం.
అయితే ఈ కార్డులు అవసరం కంటే ఎక్కువ ఇచ్చారన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. పథకాలన్నింటినీ తెల్లకార్డుతో అనుసంధానం చేయడంతో అవసరం ఉన్నా.. లేకపోయినా ప్రజలు వీటికోసం ప్రయత్నిస్తున్నారు. తెల్లరేషన్‌కార్డు వల్ల పౌర సరఫరాల సంస్థ సైతం పెద్దఎత్తున బియ్యం, చక్కెర కోసం నిధులు వ్యయం చేస్తోంది. ప్రస్తుతం తెల్లకార్డు ఉన్న వారికి రూపాయికే కిలో బియ్యం పథకం అమలు అవుతోంది. అయితే ఈ కార్డు ఉన్నవారు బియ్యం తీసుకోకపోయినా.. సబ్సిడీని మాత్రం ప్రభుత్వం చెల్లిస్తూనే ఉంది. ప్రజాప్రతినిధులు ఎక్కడకు వెళ్లినా.. తెల్లరేషన్‌కార్డుల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోవడం పరిపాటిగా మారింది. పథకాల కోసం ఆర్థికంగా ఉన్న కుటుంబాలు సైతం దొడ్డిదారిన తెల్లకార్డులను పొందుతున్నాయి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అసలు పథకాలకు తెల్లరేషన్‌కార్డు అనుసంధాన విధానాన్నే తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్థిక శాఖ ఫైలు సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డు లేకున్నా అర్హులందరికీ పథకాలు వర్తింప చేస్తామనే సంకేతం ఇస్తూనే.. కార్డుల సంఖ్యను తగ్గించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా భావిస్తున్నారు. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం కుటుంబాల సంఖ్య 84 లక్షల మేరకు ఉంటే.. రేషన్‌కార్డులు మాత్రం 91 లక్షలకు పైగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు. ఇలా తెల్లకార్డుల రూపంలో.. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న అభిప్రాయాన్ని అంతర్లీనంగా ఆయన వెల్లడించారు. తెల్లకార్డుల లింకును తొలగిస్తే ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను గుర్తించాలన్న అంశంపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.