‘సాంస్కృతిక సారథి’గా రసమయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. జూబ్లీహిల్స్‌లోని సాంస్కృతికశాఖ భవనాన్ని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యక్రమాల కోసం వినియోగించాలని కోరారు.
చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్ తదితర కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సాం ఘిక దురాచారాలు, మూఢనమ్మకాలపై ప్రచారయుద్ధం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 500 కళాబృందా లు విస్తృతంగా పర్యటించాలన్నారు. కళాకారులకు శిక్షణ ఇవ్వడానికి సాంస్కృతిక సారథి సమన్వయ బాధ్యతలు నిర్వహించాలన్నారు.
ఇది పాటకు దక్కిన గౌరవం : రసమయి
సాంస్కృతిక సారథి చైర్మన్ బాధ్యతలను తనకు అప్పగించడం ద్వారా పాటకు గౌరవం, ప్రాతి నిధ్యం ఇచ్చినట్ట్టయిందని రసమయి బాలకిషన్ అన్నారు. తనను చైర్మన్‌గా నియమించినందుకు మంత్రులు టి.రాజయ్య, ఈటెల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన సీఎం వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో నిర్బంధాన్ని ధిక్కరించి నినదించిన గొంతుకు, ఉద్యమపాటకు, తెలంగాణ ధూంధాంకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. ఉద్యమంలో గొంతెత్తినట్టుగానే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ అదే స్ఫూర్తితో పనిచేస్తామన్నారు.