rasamayi balakisan
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్ : మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారగా.. తాజాగా బాలకిషన్ చేసిన వాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ.. మంత్రి ఈటల రాజేందర్ కు, తనకు నిజాలు మాట్లాడటమే వచ్చన్నారు. తాము కడుపులో ఏమీ దాచుకోమని.. ఉద్యమంలో కొట్లాడినోళ్లమని.. తమకు అబద్దాలు రావంటూ రసమయి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రసమయి మాట్లాడుతుండగా.. మధ్యలో కల్పించుకున్న ఈటల నవ్వుతూ ‘జాగ్రత్తగా మాట్లాడు’ అంటూ సూచించారు. ‘ఏమీ కాదన్నా’ అనుకుంటూనే రసమయి బాలకిషన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. (చదవండి : ‘నా మంత్రి పదవి ఎవరి భిక్ష కాదు’) ఆ తర్వాత మాట్లాడిన ఈటల.. రసమయికి కాస్త స్వేచ్ఛ ఎక్కువ అని, ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన ఓ సభలో మంత్రి ఈటల మాట్లాడుతూ...మంత్రి పదవి తనకు ఎవరో వేస్తే వచ్చిన భిక్ష కాదని, మంత్రి పదవి కోసం కులం పేరుతో కొట్లాడలేదు.. తెలంగాణ కోసం చేసిన ఉద్యమమే తనను మంత్రిని చేసింందని వాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
గద్దర్, అందెశ్రీ ఈర్ష్య పడ్డారు
అందుకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నాతో మాట్లాడలేదు: బాలకిషన్ సాక్షి, హైదరాబాద్: మానకొండూరు శాసనసభ్యుడిగా తాను ఎన్నికయ్యానని గద్దర్ అసూయకు గురయ్యారని.. అందుకే ఆయన తనకు ఫోన్ కూడా చేయడం మానేశారని సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. ఇదే కారణంతో అందెశ్రీ కూడా రెండేళ్లుగా మాట్లాడలేదని అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో బాబూ జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాల కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఈర్ష్యద్వేషాలు పక్కనపెట్టి, దళితులంతా కలసి పోరాడి హక్కులు సాధించుకోవాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు సుంకపాక దేవయ్య మాదిగ, ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక గౌరవాధ్యక్షుడు ఎం. విజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రామలక్ష్మణ్, ఉత్సవాల కమిటీ చైర్మన్ దండు నరేంద్ర మాదిగ, దళిత నాయకుడు జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు విలువ ఇవ్వడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారులు ఎవరూ ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని, కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేలకు కనీసం విలువ ఇవ్వక పోగా, ‘ఉద్యమంలో పనిచేసివచ్చారు, వీళ్లకేం తెలుసు’ అనే భావనలో అధి కారులు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ఆరునెలల ముందు కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, సీఎల్పీ నేత జానారెడ్డి కూడా టీఆర్ఎస్లోకి వస్తారని జోస్యం చెప్పారు. -
వర్గీకరణను మరుగున పెట్టిన కాంగ్రెస్
గువ్వల, రసమయి విమర్శ సాక్షి, హైదరాబాద్: వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎస్సీల ఎ,బి,సి,డి వర్గీకరణ చేయాలని నిర్ణయించినా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ విషయాన్ని మరుగున పెట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంగళవారం వారు విలేకరులతో మాట్లా డారు. ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ సమస్యలపై సభ్యులు మాట్లాడుతున్న సంద ర్భంలో కొందరు సభ్యులు అభ్యంతరకరంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టిందన్నారు. మాదిగ జాతి కోసం ఏకగ్రీవ తీర్మానం చేసిన ఘనత సీఎం కేసీ ఆర్కే దక్కుతుందన్నారు. పక్క రాష్టంలో ఇప్పటి వరకు కనీసం తీర్మానం చెయ్యలేదని, రేవంత్‌రెడ్డి తమ నేత, ఏపీ సీఎం చంద్ర బాబుతో తీర్మానం చేయిస్తే మాదిగ జాతి రేవంత్‌ను అక్కున చేర్చుకుంటుందన్నారు. దళితుల పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవా లని ఆరాట పడ్డ పార్టీలుగా టీడీపీ, కాంగ్రెస్ మిగిలాయన్నారు. కానీ వర్గీకరణను తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. -
పోలీస్‌స్టేషన్ పై గ్రామస్తుల దాడి
పండుగ రోజు జరిగిన గొడవకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులే అతడి మరణానికి కారణమని ఆరోపిస్తూ గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన కరవత్తుల శ్రావణ్(24) సహా మరికొందరిని కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా పోలీసులు అతడిని వేధించారు. మళ్లీ బుధవారం స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని చెప్పారు. గ్రామానికి వెళ్లిన శ్రావణ్ రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి శ్రావణ్ మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. వేధింపులే అతడిని బలి తీసుకున్నాయని ఆరోపించారు. తీవ్ర ఆగ్రహంతో పోలీస్‌స్టేషన్‌లోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఎస్పీ సీరియస్.. కరీంనగర్ జిల్లా మానకొండూర్‌లో యువకుడి ఆత్మహత్య, పోలీస్‌స్టేషన్‌పై గ్రామస్తుల దాడిని పోలీస్ బాస్ సీరియస్ గా తీసుకున్నారు. శ్రవణ్ మృత దేహంతో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తోపాటు గ్రామస్తులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే పోలీసు అధికారులతో మాట్లాడారు. స్పందించిన ఎస్పీ కమలాసన్‌రెడ్డి వెంటనే మానకొండూర్ చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన ఎస్సై వంశీకృష్ణతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు రూ.10 లక్షల సాయం అందజేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. -
కాంగ్రెస్‌ది మంత్రసాని పాత్ర
♦ అసెంబ్లీలో దుమారం లేపిన రసమయి వ్యాఖ్యలు ♦ తీవ్రంగా స్పందించిన సీఎల్పీనేత జానారెడ్డి ♦ తెలంగాణ రాష్ట్రానికి జన్మనిచ్చిందే కాంగ్రెస్ అంటూ ఆగ్రహం ♦ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే సభ జరగనివ్వమని హెచ్చరిక ♦ వెనక్కి తీసుకున్న రసమయి.. శాంతించిన విపక్షం సాక్షి, హైదరాబాద్ : ‘రాజోలిబండ తూములు పగులగొట్టి నీళ్లు దోచుకెళ్తుంటే తీవ్ర జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా పాదయాత్ర చేసి రైతు పక్షాన నిలిచిన కేసీఆర్‌కు రైతుల సమస్యలు తెలియవా... తెలంగాణ ఉద్యమాన్ని రైతు విముక్తి ఉద్యమంగా నడిపిన ఘనత ఆయనది. అసలు రైతుల విషయంలో మాది కన్నతల్లి పాత్ర. మీది కాన్పు చేసే మంత్రసాని పాత్ర’ అంటూ అధికారపార్టీ సభ్యుడు రసమయి బాలకిషన్ కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బుధవారం శాసనసభలో దుమారం లేపాయి. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించిన వెంటనే రసమయికి అవకాశం వచ్చింది. కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, ఆ ఊపులోనే తల్లిపాత్ర... మంత్రసాని పాత్ర అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి సీఎల్పీనేత జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘అర్థంపర్థంలేని, అవగాహన లేని మాటలేంటి. తెలంగాణను ఇచ్చిందే కాంగ్రెస్ అని మరవద్దు. మంత్రసానిలాగా మీరు ఎదురుచూస్తుంటే కన్నతల్లిలాగా తెలంగాణ అనే బిడ్డను ఇచ్చింది కాంగ్రెస్. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. వాటిని ఉపసంహరించుకోకపోతే సభను జరగనివ్వం’ అంటూ జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినీ బాధించేం దుకు తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నో అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చిన తనకు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవటంలో భేషజాలు లేవని రసమయి ప్రతిస్పందించారు. వాటిని పట్టించుకోని కాంగ్రెస్ సభ్యులు సీట్ల నుంచి లేచి ముందు వరస వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ‘వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు అం టున్నారు. నేను ఉపసంహరించుకున్నట్టు చెప్పాను. విత్‌డ్రా అంటే ఏంటో నాకు తెలియదు, నాకు ఇంగ్లిష్ రాదు’ అని రసమయి చెప్పారు. మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు చెప్పిన తర్వాత కూడా రాద్ధాంతం చేయటం సరికాదన్నారు. చెరువులో ఏముంటాయి ‘చెరువులో ఏముంటాయి..’ అని తాను ఉపాధ్యాయుడిగా ఉండగా మూడో తరగతి విద్యార్థిని అడిగితే.. లొట్టపీచు చెట్లుంటాయి అని సమాధానం చెప్పాడని, పుట్టి బుద్ధెరిగిన తర్వాత పిల్లలు చెరువుల్లో నీళ్లు చూసిన దాఖలాలు లేకపోవటమే దీనికి కారణమని బాలకిషన్ పేర్కొన్నారు. ఇంతకాలానికి పూడిక తీసి వాటికి చెరువు రూపమిచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. అయితే వరుణుడు కరుణించి ఉంటే ఈపాటికి వాటిల్లో నీళ్లు నిండేవని, ఎర్రబెల్లి దయాకరన్న అద్దంలో బదులు తన ముఖాన్ని చెరువు నీటిలో చూసుకునేవాడని (అంతకుముందు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు) వ్యంగ్యంగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ టీడీపీ నేతలది ప్రతిపక్ష పాత్రేనని, ప్రతిపక్షంలో ఉండగా ప్రతిపక్ష పాత్రేనని, తెలంగాణపై ఎప్పుడూ టీడీపీది సవతితల్లి పాత్రేనని రసమయి ఎద్దేవా చేశారు. -
తిక్కపుడితే.. చదివి కలెక్టర్‌నవుతా..!
పత్రికలపై ‘రసమయి’ ఆక్రోశం తిమ్మాపూర్ : తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పత్రికలపై ఆక్రోశం వెళ్లగక్కారు. రైతుల ఆత్మహత్యలపై బాధ్యతగా వ్యవహరించాల్సిన పత్రికలు పతాక శీర్షికల్లో వాటిని రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. తప్పుడు రాతలు రాసిన విలేకరిని వేరే దేశంలో ఉరితీశారని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో బీసీ బాలికల గురుకుల పాఠశాల భవనం, కేజీబీవీ భవనాల్ని ప్రారంభించేందుకు మంత్రి జోగు రామన్న, ఎంపీ వినోద్‌కుమార్ రాగా.. సభలో వారి ఎదుటే ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధి కావడం చాలా కష్టమని, తిక్కపుడితే.. నాలుగు నెలలు ఇంట్లో కూర్చుని చదువుకుంటే.. కరీంనగర్ జిల్లాకు కలెక్టర్నవుతానని ఎమ్మెల్యే రసమయి స్పష్టం చేశారు. పత్రికలు మంచిని రాస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. -
తెలంగాణ కళలకు ప్రోత్సాహం: రసమయి
హైదరాబాద్: తెలంగాణ కళలకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తెలిపారు. రాష్ట్ర యువజనోత్సవాలు ముగింపు కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పారామంలో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రసమయి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి విభాగం ఏర్పడిన తర్వాత 500 మంది కళాకారులకు ఉపాధి లభించిందని తెలిపారు. ఆకలి కేకలు, ఆర్తనాదాల నుంచి తెలంగాణ పాటలు, కళలు పుట్టుకొచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక విభాగం డిప్యూటి డెరైక్టర్ ఉష, వివేకానంద ఇనిస్టిట్యూట్ ప్రతినిధి గోదానంద స్వామి పాల్గొన్నారు. -
‘సాంస్కృతిక సారథి’గా రసమయి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. జూబ్లీహిల్స్‌లోని సాంస్కృతికశాఖ భవనాన్ని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యక్రమాల కోసం వినియోగించాలని కోరారు. చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్ తదితర కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సాం ఘిక దురాచారాలు, మూఢనమ్మకాలపై ప్రచారయుద్ధం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 500 కళాబృందా లు విస్తృతంగా పర్యటించాలన్నారు. కళాకారులకు శిక్షణ ఇవ్వడానికి సాంస్కృతిక సారథి సమన్వయ బాధ్యతలు నిర్వహించాలన్నారు. ఇది పాటకు దక్కిన గౌరవం : రసమయి సాంస్కృతిక సారథి చైర్మన్ బాధ్యతలను తనకు అప్పగించడం ద్వారా పాటకు గౌరవం, ప్రాతి నిధ్యం ఇచ్చినట్ట్టయిందని రసమయి బాలకిషన్ అన్నారు. తనను చైర్మన్‌గా నియమించినందుకు మంత్రులు టి.రాజయ్య, ఈటెల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన సీఎం వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో నిర్బంధాన్ని ధిక్కరించి నినదించిన గొంతుకు, ఉద్యమపాటకు, తెలంగాణ ధూంధాంకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. ఉద్యమంలో గొంతెత్తినట్టుగానే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ అదే స్ఫూర్తితో పనిచేస్తామన్నారు. -
ప్రణాళిక ఘనం
కరీంనగర్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లా ప్రణాళికకు జెడ్పీటీసీ సభ్యుల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో చివరిదశ అయిన ‘మన జిల్లా-మన ప్రణాళిక’ అంశంపై శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ హాల్లో చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ‘జయ జయహే తెలంగాణ’ ప్రార్థనా గీతాన్ని ఆలపించడంతో సభ ప్రారంభమైంది. ఆ తరువాత మెదక్ జిల్లా మాసాయిపేటలో రైల్వే ప్రమాదంలో మృత్యువాతపడ్డ విద్యార్థులకు, తెలంగాణ అమరులకు సభ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. అనంతరం తుల ఉమ సమావేశాన్ని ప్రారంభిస్తూ.. జిల్లా ప్రణాళికకు సభ్యులు ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు చెప్పాలని కోరారు. రెండు, అంతకన్నా ఎక్కువ మండలాలను అనుసంధానం చే సే రోడ్లు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, నీటిపారుదల, మొక్కలు నాటడం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముందుగా జెడ్పీ సీఈఓ సదానందం కార్యక్రమ ఉద్దేశం చెబుతూ గ్రామ ప్రణాళికలో మూడు, మండల ప్రణాళికలో పది పనులు గుర్తించగా, జిల్లా ప్రణాళికలో 20 పనులు ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ఇప్పటివరకు కేవలం 26 మండలాల నుంచే ప్రతిపాదనలు వచ్చాయని, అందులోనూ కొన్ని అసమగ్రంగా ఉన్నాయన్నారు. కొంతమంది ఒక్క మండలానికే రూ.200-300 కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు పంపించారని, అది వీలు కాదని తెలిపారు. ప్రాధాన్యతా అంశాల వారీగా ప్రతిపాదనలు అందించాలని కోరారు. ప్రాధాన్యాంశాలివీ.. ‘మన జిల్లా-మనప్రణాళిక’ సమావేశంలో జిల్లాకు సంబంధించిన ప్రాధాన్యతా అంశాలను సమావేశంలో గుర్తించారు. జిల్లా ప్రణాళికలో ఇరవై పనులు గుర్తించాలనే నిబంధనల మేరకు ప్రాధాన్యత క్రమంలో ఇరవై పనులను రూపొందించేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే అధికారులు, సభ్యులు చేసిన ప్రతిపాదనలు క్రోఢీకరించి, ఎమ్మెల్యేలు, ఎంపీల సవరణలు తీసుకొని తుది ప్రణాళికను ప్రభుత్వానికి పంపించాలని మంత్రి ఈటెల రాజేందర్ ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. మండలాలకు లింక్‌రోడ్లు, గొలుసుకట్టు చెరువులు, మొక్కల పెంపకంతో పాటు విద్యుత్ అంశాన్ని ప్రణాళికలో చేరుస్తున్నట్లు మంత్రిప్రకటించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, భారీ నీటిపారుదల కింద మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, వరదకాలువ అంశాలు, చిన్ననీటిపారుదల కింద జిల్లాలోని అన్ని వాగుల మీద రీజనరేటెడ్, నీటి వినియోగంపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, ఇల్లంతకుంట తదితర దేవాలయాలను రూ.200 కోట్లతో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు, జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు, ప్రతి నియోజకవర్గంలో 200 కిలోమీటర్లకు తగ్గకుండా జిల్లాలోని రెండువేల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను ఆర్అండ్బీ ద్వారా డబుల్ రోడ్లుగా మారుస్తామని జిల్లా ప్రణాళిక అంశాలను మంత్రి వివరించారు. కథలాపూర్‌లో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోనే ఏర్పాటు చేసేలా చర్యలుతీసుకోవాలని ఎమ్మెల్యేలు, సభ్యులు సూచించారు. కథలాపూర్లోనే హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తెలిపారు. ఈ మేరకు హార్టికల్చర్ వర్సిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని సమావేశం ప్రతిపాదించింది.