కరీంనగర్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లా ప్రణాళికకు జెడ్పీటీసీ సభ్యుల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో చివరిదశ అయిన ‘మన జిల్లా-మన ప్రణాళిక’ అంశంపై శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ హాల్‌లో చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ‘జయ జయహే తెలంగాణ’ ప్రార్థనా గీతాన్ని ఆలపించడంతో సభ ప్రారంభమైంది.
ఆ తరువాత మెదక్ జిల్లా మాసాయిపేటలో రైల్వే ప్రమాదంలో మృత్యువాతపడ్డ విద్యార్థులకు, తెలంగాణ అమరులకు సభ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. అనంతరం తుల ఉమ సమావేశాన్ని ప్రారంభిస్తూ.. జిల్లా ప్రణాళికకు సభ్యులు ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు చెప్పాలని కోరారు. రెండు, అంతకన్నా ఎక్కువ మండలాలను అనుసంధానం చే సే రోడ్లు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, నీటిపారుదల, మొక్కలు నాటడం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ముందుగా జెడ్పీ సీఈఓ సదానందం కార్యక్రమ ఉద్దేశం చెబుతూ గ్రామ ప్రణాళికలో మూడు, మండల ప్రణాళికలో పది పనులు గుర్తించగా, జిల్లా ప్రణాళికలో 20 పనులు ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ఇప్పటివరకు కేవలం 26 మండలాల నుంచే ప్రతిపాదనలు వచ్చాయని, అందులోనూ కొన్ని అసమగ్రంగా ఉన్నాయన్నారు. కొంతమంది ఒక్క మండలానికే రూ.200-300 కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు పంపించారని, అది వీలు కాదని తెలిపారు. ప్రాధాన్యతా అంశాల వారీగా ప్రతిపాదనలు అందించాలని కోరారు.
ప్రాధాన్యాంశాలివీ..
‘మన జిల్లా-మనప్రణాళిక’ సమావేశంలో జిల్లాకు సంబంధించిన ప్రాధాన్యతా అంశాలను సమావేశంలో గుర్తించారు. జిల్లా ప్రణాళికలో ఇరవై పనులు గుర్తించాలనే నిబంధనల మేరకు ప్రాధాన్యత క్రమంలో ఇరవై పనులను రూపొందించేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే అధికారులు, సభ్యులు చేసిన ప్రతిపాదనలు క్రోఢీకరించి, ఎమ్మెల్యేలు, ఎంపీల సవరణలు తీసుకొని తుది ప్రణాళికను ప్రభుత్వానికి పంపించాలని మంత్రి ఈటెల రాజేందర్ ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు.
మండలాలకు లింక్‌రోడ్లు, గొలుసుకట్టు చెరువులు, మొక్కల పెంపకంతో పాటు విద్యుత్ అంశాన్ని ప్రణాళికలో చేరుస్తున్నట్లు మంత్రిప్రకటించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, భారీ నీటిపారుదల కింద మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, వరదకాలువ అంశాలు, చిన్ననీటిపారుదల కింద జిల్లాలోని అన్ని వాగుల మీద రీజనరేటెడ్, నీటి వినియోగంపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.
కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, ఇల్లంతకుంట తదితర దేవాలయాలను రూ.200 కోట్లతో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు, జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు, ప్రతి నియోజకవర్గంలో 200 కిలోమీటర్లకు తగ్గకుండా జిల్లాలోని రెండువేల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను ఆర్‌అండ్‌బీ ద్వారా డబుల్ రోడ్లుగా మారుస్తామని జిల్లా ప్రణాళిక అంశాలను మంత్రి వివరించారు.
కథలాపూర్‌లో ఉద్యానవన విశ్వవిద్యాలయం
ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోనే ఏర్పాటు చేసేలా చర్యలుతీసుకోవాలని ఎమ్మెల్యేలు, సభ్యులు సూచించారు. కథలాపూర్‌లోనే హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తెలిపారు. ఈ మేరకు హార్టికల్చర్ వర్సిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని సమావేశం ప్రతిపాదించింది.
ప్రణాళిక ఘనం
Published Sat, Jul 26 2014 12:58 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement