Our town-our planning program
-
పనులు 26 వేలు, ఖర్చు 32 వేల కోట్లు!
ఇదీ మన ఊరు-మన ప్రణాళిక గ్రామ, మండల, జిల్లా ప్రణాళికల క్రోడీకరణ మౌలిక సదుపాయాల కోసం ప్రజల డిమాండ్ శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనల్లోచేర్చాలని ప్రభుత్వ ఆదేశం {పాధాన్యాలవారీగా నిధుల కేటాయింపు హైదరాబాద్: మన ఊరు-మన ప్రణాళికలో ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లలో అధికంగా మౌలిక సదుపాయాల కోసమే ఉన్నాయి. గతనెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు దశల్లో జరిగిన మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక, మన జిల్లా-మన ప్రణాళికలో మొత్తం 25,920 పనులు చేపట్టాలని డిమాండ్ వచ్చింది. ఇందుకోసం అయ్యే వ్యయం దాదాపు రూ. 32,184 కోట్లుగా అంచనా వేశారు. తొమ్మిది జిల్లాల్లో నిర్వహించిన ఈ ప్రణాళికలో ఏయే గ్రామం నుంచి ఏయే అవసరాల కోసం ప్రజలు డిమాండ్ చేశారన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. గ్రామపంచాయతీల్లో జరిగిన మన ఊరు-మన ప్రణాళికలోనే 80 శాతం మేరకు దాదాపు 26 అంశాలపై ప్రధానంగా డిమాండ్లు వచ్చినట్టు అధికారవర్గాలు వివరించాయి. ప్రధానంగా పాఠశాలలు, కాలేజీలు, తాగునీరు.సాగునీరు. కల్వర్టులు, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, గ్రామాల్లో అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణం, సిమెంట్ రహదారులు, బోర్లు, భవనాల నిర్మాణంపై డిమాండ్లు ఎక్కువగా వచ్చినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు వివరించాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన విషయం విదితమే. అందులో భాగంగా మన ఊరు-మన ప్రణాళికలో వచ్చిన అంశాలను ఆయా శాఖల వారీగా విడదీసి..ఆ శాఖల బడ్జెట్లలో చేర్చాలని ఆర్థిక, ప్రణాళిక శాఖలు సూచించాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పనులన్నీ ఒకేసారి కాకుండా. ప్రాధాన్యక్రమంలో చేపట్టనున్నారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పనులుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనుల కోసం ప్రభుత్వవాటాతోపాటు, స్థానిక సంస్థల నుంచి, ప్రజల నుంచి కూడా కొంతమొత్తాన్ని కంట్రిబ్యూషన్ రూపంలో సేకరించే అవకాశం ఉంది. -
ప్రణాళిక ఘనం
కరీంనగర్ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లా ప్రణాళికకు జెడ్పీటీసీ సభ్యుల నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో చివరిదశ అయిన ‘మన జిల్లా-మన ప్రణాళిక’ అంశంపై శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ హాల్లో చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ‘జయ జయహే తెలంగాణ’ ప్రార్థనా గీతాన్ని ఆలపించడంతో సభ ప్రారంభమైంది. ఆ తరువాత మెదక్ జిల్లా మాసాయిపేటలో రైల్వే ప్రమాదంలో మృత్యువాతపడ్డ విద్యార్థులకు, తెలంగాణ అమరులకు సభ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. అనంతరం తుల ఉమ సమావేశాన్ని ప్రారంభిస్తూ.. జిల్లా ప్రణాళికకు సభ్యులు ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు చెప్పాలని కోరారు. రెండు, అంతకన్నా ఎక్కువ మండలాలను అనుసంధానం చే సే రోడ్లు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, నీటిపారుదల, మొక్కలు నాటడం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముందుగా జెడ్పీ సీఈఓ సదానందం కార్యక్రమ ఉద్దేశం చెబుతూ గ్రామ ప్రణాళికలో మూడు, మండల ప్రణాళికలో పది పనులు గుర్తించగా, జిల్లా ప్రణాళికలో 20 పనులు ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ఇప్పటివరకు కేవలం 26 మండలాల నుంచే ప్రతిపాదనలు వచ్చాయని, అందులోనూ కొన్ని అసమగ్రంగా ఉన్నాయన్నారు. కొంతమంది ఒక్క మండలానికే రూ.200-300 కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు పంపించారని, అది వీలు కాదని తెలిపారు. ప్రాధాన్యతా అంశాల వారీగా ప్రతిపాదనలు అందించాలని కోరారు. ప్రాధాన్యాంశాలివీ.. ‘మన జిల్లా-మనప్రణాళిక’ సమావేశంలో జిల్లాకు సంబంధించిన ప్రాధాన్యతా అంశాలను సమావేశంలో గుర్తించారు. జిల్లా ప్రణాళికలో ఇరవై పనులు గుర్తించాలనే నిబంధనల మేరకు ప్రాధాన్యత క్రమంలో ఇరవై పనులను రూపొందించేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే అధికారులు, సభ్యులు చేసిన ప్రతిపాదనలు క్రోఢీకరించి, ఎమ్మెల్యేలు, ఎంపీల సవరణలు తీసుకొని తుది ప్రణాళికను ప్రభుత్వానికి పంపించాలని మంత్రి ఈటెల రాజేందర్ ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. మండలాలకు లింక్‌రోడ్లు, గొలుసుకట్టు చెరువులు, మొక్కల పెంపకంతో పాటు విద్యుత్ అంశాన్ని ప్రణాళికలో చేరుస్తున్నట్లు మంత్రిప్రకటించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, భారీ నీటిపారుదల కింద మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, వరదకాలువ అంశాలు, చిన్ననీటిపారుదల కింద జిల్లాలోని అన్ని వాగుల మీద రీజనరేటెడ్, నీటి వినియోగంపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, ఇల్లంతకుంట తదితర దేవాలయాలను రూ.200 కోట్లతో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు, జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు, ప్రతి నియోజకవర్గంలో 200 కిలోమీటర్లకు తగ్గకుండా జిల్లాలోని రెండువేల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను ఆర్అండ్బీ ద్వారా డబుల్ రోడ్లుగా మారుస్తామని జిల్లా ప్రణాళిక అంశాలను మంత్రి వివరించారు. కథలాపూర్‌లో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలోనే ఏర్పాటు చేసేలా చర్యలుతీసుకోవాలని ఎమ్మెల్యేలు, సభ్యులు సూచించారు. కథలాపూర్లోనే హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తెలిపారు. ఈ మేరకు హార్టికల్చర్ వర్సిటీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని సమావేశం ప్రతిపాదించింది. -
వినతులు..కుప్పలు తెప్పలు
హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి(గ్రీవెన్స్‌సెల్)లో తమ బాధలు చెప్పుకునేందుకు జనం పోటెత్తారు. ఒకవైపు గ్రామస్థాయిలో ‘మన ఊరు-మన ప్రణాళిక’ వంటివి జరుగుతున్నా కలెక్టరేట్లో రద్దీ మాత్రం విపరీతంగా ఉంది. ముఖ్యంగా రేషన్‌కార్డులు, పింఛన్లు, భూసమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత కలెక్టర్ కిషన్ ప్రజావాణిలో పాల్గొన్నారు. ఆయనతోపాటు కొద్దిసేపు జేసీ, డీఆర్వో, డీఆర్డీఏ పీడీ ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. వెన్నారం చెరువుపై బ్రిడ్జి నిర్మించాలి డోర్నకల్‌లోని కన్నెగుండ్ల గ్రామం నుంచి తోడేళ్లగూడెం వెళ్లే దారిలో కన్నెగూడెం పెద్దచెరువు వరద కారణంగా రాాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి వెన్నారం చెరువుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఉప సర్పంచ్ వడ్డం వెంకన్న వినతిపత్రం ఇచ్చారు. అంతేకాక అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. వంటచేసే అవ కాశం ఇవ్వండి కేసముద్రం మండలం మొహమూద్‌పట్నంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో పిల్లలకు వంటచేసే అవకాశం స్థానికులకే కల్పించాలని కోరుతూ స్థానిక మహిళలు వినతిపత్రం ఇచ్చారు. తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు తాము స్థలం కేటాయించామని అలాంటిది పక్కగ్రామం వారికి వంటచేసే అవకాశం ఇవ్వడంవల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని వివరించారు. అకారణంగా తొలగించారు వర్ధన్నపేట మండలం నల్లబెల్లి ఎస్టీ హాస్టల్లో అకారణంగా 18మంది విద్యార్థుల పేర్లను వార్డెన్ తొలగించారని, ఈ విషయంలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాని కోరుతూ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బిర్రు మహేందర్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. విద్యార్థులను తిరిగి హాస్టల్లో చేర్పించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ‘మీ సేవ’కు అనుమతివ్వరూ.. వైకల్యంతో నానా కష్టాలు పడుతూనే ఎంఏ, బీఈడీ పూర్తిచేశానని, తనకు మీసేవ, ఏపీఆన్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ భూపాలపల్లికి చెందిని కానుగుల ఐలయ్య కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. మెసెంజర్లను కొనసాగించాలి సర్వశిక్షా అభియాన్‌లో మండలస్థాయిలో పనిచేసిన మెసెంజర్లను కొనసాగించాలని, మెసెంజర్ల వ్యవస్థను రద్దు చేయడం వల్ల వారు ఉపాధి కోల్పోతున్నారంటూ టీఎస్ ఎమ్మార్సీ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.బిక్షపతి కలెక్టర్‌ను కోరారు. వ్యవస్థను రద్దుచేయడంలో మెసెంజర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, తక్షణం దీనిపై స్పందించి న్యాయం చేయాలని కోరారు. కేయూ రిజిస్ట్రార్, డీవోలపై చర్య తీసుకోవాలి కుమార్‌పల్లిలోని సర్వే నంబర్ 214లోగల తమ పట్టాభూమి విషయంలో వివాదాలు సృష్టించి తమను అనవసరంగా ఇబ్బందులు పెడుతున్న కేయూ రిజిస్ట్రార్, డీవోలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎర్రబెల్లి ప్రభాకర్‌రెడ్డి, గట్టురాజు, రామకృష్ణ, నగేష్ తదితరులు వినతిపత్రం అందించారు. ఈ భూమి విషయంలో ఇప్పటికే పలుమార్లు సర్వేలు, విచారణలు చేసినట్లు తెలిపారు. అయినా ఇబ్బందులు తప్పడం లేదని వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్, జేసీ సర్వేకు ఆదేశించారు.