పనులు 26 వేలు, ఖర్చు 32 వేల కోట్లు!
ఇదీ మన ఊరు-మన ప్రణాళిక
గ్రామ, మండల, జిల్లా ప్రణాళికల క్రోడీకరణ
మౌలిక సదుపాయాల కోసం ప్రజల డిమాండ్
శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనల్లోచేర్చాలని ప్రభుత్వ ఆదేశం
{పాధాన్యాలవారీగా నిధుల కేటాయింపు
హైదరాబాద్: మన ఊరు-మన ప్రణాళికలో ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లలో అధికంగా మౌలిక సదుపాయాల కోసమే ఉన్నాయి. గతనెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు దశల్లో జరిగిన మన ఊరు-మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక, మన జిల్లా-మన ప్రణాళికలో మొత్తం 25,920 పనులు చేపట్టాలని డిమాండ్ వచ్చింది. ఇందుకోసం అయ్యే వ్యయం దాదాపు రూ. 32,184 కోట్లుగా అంచనా వేశారు. తొమ్మిది జిల్లాల్లో నిర్వహించిన ఈ ప్రణాళికలో ఏయే గ్రామం నుంచి ఏయే అవసరాల కోసం ప్రజలు డిమాండ్ చేశారన్న అంశంపై అధికారులు దృష్టి సారించారు. గ్రామపంచాయతీల్లో జరిగిన మన ఊరు-మన ప్రణాళికలోనే 80 శాతం మేరకు దాదాపు 26 అంశాలపై ప్రధానంగా డిమాండ్లు వచ్చినట్టు అధికారవర్గాలు వివరించాయి. ప్రధానంగా పాఠశాలలు, కాలేజీలు, తాగునీరు.సాగునీరు. కల్వర్టులు, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, గ్రామాల్లో అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణం, సిమెంట్ రహదారులు, బోర్లు, భవనాల నిర్మాణంపై డిమాండ్‌లు ఎక్కువగా వచ్చినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు వివరించాయి.
క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన విషయం విదితమే. అందులో భాగంగా మన ఊరు-మన ప్రణాళికలో వచ్చిన అంశాలను ఆయా శాఖల వారీగా విడదీసి..ఆ శాఖల బడ్జెట్‌లలో చేర్చాలని ఆర్థిక, ప్రణాళిక శాఖలు సూచించాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పనులన్నీ ఒకేసారి కాకుండా. ప్రాధాన్యక్రమంలో చేపట్టనున్నారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పనులుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పనుల కోసం ప్రభుత్వవాటాతోపాటు, స్థానిక సంస్థల నుంచి, ప్రజల నుంచి కూడా కొంతమొత్తాన్ని కంట్రిబ్యూషన్ రూపంలో సేకరించే అవకాశం ఉంది.